Tuesday, September 29, 2009

పిల్లలు పిల్లల్లాగా ఉండాలి



నా చిన్నప్పుడు అమ్మ ఈ డైలాగ్ రోజుకి ఒక్కసారైనా అనడం వినేదాన్ని. నేను నా ఫ్రెండ్స్ తో ఆడుకుంటున్నపుడు మాలో ఎవరైనా, ఏదైనా పిచ్చి సినిమా మాటలు మాట్లాడితే మా అమ్మ కాని పక్కింటి ఆంటీలు ఎవరైనా కాని అలా అనేవారు. అలా అనంగానే మాకైతే చచ్చే సిగ్గోచ్చేసేది. కొన్ని రోజులు వరకు ఆ విషయం మర్చి పోయేవాళ్ళం కాదు. నేను స్కూల్ లో చదువుకునేటప్పుడు, మేము ఒక కాంపౌండ్ లో ఉండేవాళ్ళం చాలా ఫామిలీస్ తో బాటు. సాయంత్రం ఇంటికొచ్చి హోం వర్క్ చేసుకుని ఆటలకి బయలుదేరేవాళ్ళం. అందరికి దాదాపు ఒకే టైం లో యూనిట్ టెస్ట్లు, ఎగ్జామ్స్ ఉండడం వల్ల అందరం ఒకే టైం లో చదువుకోవటం, ఆడుకోవటం చేసేవాళ్ళం. సమ్మర్ సెలవుల్లో అయితే ఎంత మజా నో చెప్పలేను. రిపోర్ట్ కార్డులు తెచ్చేసుకుని, రెండో, మూడో రోజులు పెద్దాళ్ళ తో తిట్లు తినేసి సమ్మర్ గొడవ మొదలు పెట్టామంటే మళ్లి జూన్ పదకొండో తారికునే అల్లరి ఆపడం. సాయంత్రాలేమో ఆడుకోవటం, మధ్యాన్నం పుస్తకాలు చదవటం, లేదా craft ప్రాజెక్ట్ పని పెట్టుకోవటం. కుట్లు, అల్లికలు, ఐస్ క్రీం స్టిక్స్ తో, అగ్గిపుల్లలతో, అగ్గిపెట్టేలతో, వెల్వెట్ పేపర్ తో craft తాయారు చేసుకోవటం. caroms, scrabble, chess, ludo లాంటి ఆటలు ఆడటం.

ఈ సుత్తంతా ఇప్పుడెందుకు కొడుతున్నానంటే, నేను క్రితం సారి హైదరాబాద్ వెళ్ళినప్పుడు, మా కజిన్ వాళ్ళబ్బాయిని "ఎంట్రా ఎక్కడికి బయలుదేరుతున్నావు?" అనడిగితే "foundation కి వెళ్తున్నాను చిన్నమ్మా" అన్నాడు. నాకిక్కడ రెండు డౌట్లు. మొదటిది, ఫౌండేషన్ అనగా నేమి? రెండోది, తొమ్మిదో క్లాసు చదివే పిల్లాడు, ఇంత బుద్ధిగా ఎక్కడికి వెళ్తున్నాడు? అని. ఆ మాటే వాడిని అడిగా. ఫౌండేషన్ అంటే IIT foundation కోర్సు అట. ఇంక చూస్కోండి. నాకైతే cholesterol లెవెల్ పెరగకుండానే heart attack వచ్చింది. మొన్నెవరో జోక్ చేసారు. "ఒక ముగ్గు వేసే టైం లో నాలుగు EAMCET problems చేసుకోవచ్చు" అని.


కంపెటిషన్ పెరిగింది.కరక్టే. కాని తొమ్మిదో క్లాసు లో IIT కోసం రెడీ అయ్యేంత level లో నా? అసలు అంత చిన్న పిల్లలకి IIT importance ఏమి తెలుసని?ఇంకో మాట. ఇది నేను దాదాపు మూడేళ్ళ క్రితం హైదరాబాద్ వెళ్ళినప్పుడు జరిగింది. ఈ సారి నేను వెళ్ళినప్పుడు, ఆరో క్లాసు పిల్లాడు కూడా, IIT prep మొదలెట్టేస్తాడా?ఈ మధ్యన పిల్లలు computer గేమ్స్ తప్ప ఇంకో ఆట ఆడట్లేదు. వాళ్ళ బాల్యాన్ని వాళ్ళు పోగొట్టుకోవట్లేదు కదా? చదువు మీద ఇంట్రెస్ట్ పోకుండా, వాళ్ళకి వాళ్ళ childhood ని ఎంజాయ్ చేసే విధంగా మనమేమి చెయ్యొచ్చు? స్కూల్ సిస్టం మార్చలేం కదా? కాబట్టి కుటుంబ వాతావరణం లోనే మార్పులు రావాలేమో?

Thursday, September 17, 2009

మన కల్చర్ ని మనమే single handed గా కాపాడుతున్నామా?


నేను Ph.D చేస్తున్నప్పుడు నా roommate ఒక బెంగాలి అమ్మాయి ఉండేది. ఆ అమ్మాయి రెండు సంవత్సరాలప్పుడే వాళ్ళు US కి వచ్చేసారు. సాధారణంగా.... (ధర్మవరపు సుభ్రమణ్యం డైలాగ్ గుర్తొచ్చిందా? ఇప్పుడా కామెడీ వోద్దులెండి) ఇక్కడ పెరిగిన, ఇండియన్ origin ఉన్న పిల్లలకి మన కల్చర్ తెలీదని పెద్ద భ్రమ. నా రూంమేట్ (ఆ అమ్మాయి పేరు కొంచెం సేపు పంకజ అనుకుందాం) వాళ్ళ నాన్నగారు కూడా అలాంటి భ్రమ ఉన్న మనుషుల కోవ లోకే చెందుతారు. పంకజ కి దాదాపు 19 లేదా 20 ఏళ్ళు ఉంటాయేమో. ప్రతి వీకెండ్ 3 గంటలు బస్సు జర్నీ చేసి ఇంటికి వెళ్ళేది. వచేటప్పుడు ఆల్మోస్ట్ వారానికి సరిపడా వండిన కూరలు, పప్పులు అవన్నీ తెచ్చుకునేది. కొత్తలో, బెంగ పెట్టుకుందేమో అనుకునేదాన్ని (బెంగాలి కదా? హి హి హి హి జోకన్నమాట). తరవాత, తరవాత భోజనం తేవటం తగ్గించింది. అయినా ప్రతి వీకెండ్ వెళ్ళేది.

ఒక రోజు అడిగాను. ఇక్కడ dorms లో ఉన్న పిల్లలు అలా ప్రతి వీకెండ్ ఇంటికి వెళ్లారు కదా, నువ్వు మీ పేరెంట్స్ కి చాల క్లోజా? అని. తను నవ్వి, "మా నాన్న ప్రతి వీకెండ్ నాకు బయాలజీ, ఫిజిక్స్ లాంటి సైన్సు సబ్జక్ట్స్ అన్ని కూర్చోపెట్టి చెప్తారు, అందుకే రమ్మంటారు. అలా అయన involve అయ్యి చెప్పకపోతే, నేను నా చదువుని neglect చేస్తానని భయం". "Parents teaching their children is a natural thing for Indians. I think it is an Indian thing" అంది. నాకు ఫస్ట్ ఆశ్చర్యం వేసింది ఆ తరవాత నవ్వొచ్చింది. చిన్నప్పుడు అమ్మ మనల్ని కూర్చోపెట్టి చదివించిన మాట నిజమే. కాని ఇరవై ఏళ్ళు వచ్చాక కూడానా? పేరెంట్స్ కి పిల్లల చదువు మీద anxiousness ఉంటుంది. అది చాలా సహజం. అయినా, కాలేజీ కి వచ్చిన తరువాత పిల్లలు ఎప్పుడు చదువుకోవాలి అని వీక్ టు వీక్ basis మీద పేరెంట్స్ నిర్ణయించటం ఎంత వరకు సబబు? మనకి ఒక originality డెవలప్ అయ్యేది ఆ ఏజ్ లోనే కదా? పంకజ వాళ్ళ నాన్నగారు ఇంకొక పని కూడా చేసేవారు. ఎప్పుడైనా క్రికెట్ మ్యాచ్ జరుగుతుంటే పంకజ వాళ్ళ తమ్ముడిని తప్పకుండా తీసుకెళ్ళే వారు (ఏదో ఒక ఫ్రెండ్ ఇంటిలో డిష్ antenna ఉంటుంది కదా తప్పకుండా). స్కూల్ వర్క్, hobbies neglect చేసినా సరే. ఎందుకయ్యా అంటే, క్రికెట్ మన కల్చర్ లో ఒక భాగం, మన పిల్లలకి అది తెలియాలి అంటారు.

ఇక్కడ చాల మంది పిల్లల్ని వీకెండ్స్ లో తెలుగు, తమిళం (లేదా వేరే ఏదైనా మాతృభాష), శాస్త్రీయ సంగీతం, డాన్స్ క్లాస్సులకి పంపిస్తారు. వాళ్ళ హాబీ ని వాళ్ళనే ఎంచుకోమంటే బెటర్ ఏమో? hobbies కూడా మనం డిసైడ్ చెయ్యడమెందుకు?నేను ఈ విషయం పిల్లలు మరియు teenagers తోనే మాట్లాడాను (ఇలా అన్నానని నేనేదో పెద్ద సైకాలజీ expert ని అనుకునేరు. నాకంత లేదు). పేరెంట్స్ తో మాట్లాడలేదు. కాబట్టి నాకు వాళ్ళ perspective తెలీదు.
మా university లో ప్రతి university కి మల్లె ఒక ఇండియన్ స్టూడెంట్స్ అసోసియేషన్ ఉండేది. దాని elections అప్పుడు వినాలి ఒక్కొక్కడి కల్చర్ గోల. ఒక కల్చరేసుడు రెండో సారి కాంటెస్ట్ చేస్తున్నాడు (మొదటి సారి గెలిచాడు లెండి). అతగాడి స్పీచ్ ఇలా నడుస్తోంది "why do you think I contested last year? I think it is very important to preserve our culture. Some one has to do it you know. My wife was here that time. I did not even consult her when you all nominated me. This year, I want to be an officer for the same reason. We have to make sure this organization has capable officers who can preserve our culture". నాలుగు దేశి మ్యూజిక్ డాన్స్ పార్టీలు పెడితే కల్చర్ ని కాపాడినట్టేనా?

ఇలాంటి వాళ్ళు కొంతవరకు బెటర్. వాళ్ళింటికి వెళ్తే సుబ్భరంగా క్రికెట్ మ్యాచ్ లు, తెలుగు, హిందీ సినిమాలు చూపించి, మంచి ఫుడ్ పెడతారు (రుచి గా ఉందా, లేదా అన్నది వేరే విషయం). ఇంకొక టైపు కల్చరేస్వరులు ఉంటారు. నా ఫ్రెండ్ ఒకమ్మాయి తను కాలేజీ లో చదువుకున్నప్పటి విషయం ఇలా చెప్పింది:
నేను post graduation లో ఉండగా అనుకుంటా freshers party లో ఒక సీనియర్ ప్రబుద్ధుడు స్పీచ్ ఇస్తున్నాడు. ఇలా సాగుతోంది ".........మన సంస్కృతి ని మనం నిలబెట్టుకోవాలె. నిన్న మన కాలేజీ ల చూసిన ఒక అమ్మాయిని. జీన్స్ ప్యాంటు ఏస్కోని, బొట్టు పెట్టుకోకుండా కాలేజికి వచ్చింది. అట్లనేన కాలేజీ కి వచ్చుడు? గసొంటి బట్టలేస్కోనోస్తర? మన సంస్కృతి ఏమైపోవలె?....." మర్నాడు మేము బస్సు దిగి కాలేజీ కి వెళ్తుంటే గేటు దగ్గర ఒక పెద్ద గ్రూప్ వచ్చే పొయ్యే అమ్మాయిల మీద కామెంట్లు. ఆ గ్యాంగ్ లో ఈ అబ్బాయి కూడా ఉన్నాడు. గేటు దగ్గర నిలపడి అమ్మాయిలకి సైట్ కొట్టటం కూడా ఈ మధ్య కల్చర్ లో భాగం అయిపొయింది. అవును మరి, ప్రతి సినిమా లో బేవార్సు గా రోడ్డు మీద కూచుని లైన్లు వేసే వాళ్ళనే హీరోయిన్లు ప్రేమించేసి, duet పాడేసి, పెళ్లి చేసేసుకుంటారు.

నా ఒపీనియన్ లో culture అనేది చాలా broad concept. Everyone defines it in their own way. ఇలా చేస్తే కల్చర్ ని కాపాడొచ్చు, ఇలా అయితే లేదు అన్న రూల్ ఏమి లేదు. కాకపోతే ఇతరులకి (ముఖ్యంగా తమ పిల్లలికి) ఇబ్బంది లేకుండా, వాళ్ళ మనసులకి కష్టం కలగకుండా చూసుకుంటే మంచిది. నా మటుక్కి నేను సంస్కృతిని కాపాడడానికి ఎం చేసానా అని ప్రశ్నించుకుంటే, నాకేమి జవాబు దొరకట్లేదు. ఇక పైనే ఆలోచించాలి ఏమి చెయ్యొచ్చో. ప్రియమైన చదువరులారా, మీరేమంటారు? కల్చర్ గూర్చియు, మరియు దానిని కాపాడుటకై మనము చేయవలిసిన కృషిని గూర్చియు దయచేసి మీ మీ అభిప్రాయములు చెప్పుడు. (ఎలా ఉంది మన గ్రాంధికం?)

Monday, September 14, 2009

పర భాషా గాయకులు


ఇవాళ్ళ "తెలు-గోడు" బ్లాగ్ లో "తారలెంతగా మెరిసేనో" పోస్ట్ చూడగానే, నాకు చిన్నప్పుడు నేను మహా fascinating గా విన్న "నా మది నిన్ను పిలిచింది గానమై" అనే పాట గుర్తొచ్చింది. ఈ పాట నేను మొదటి సారి ఎప్పుడు విన్నానో జ్ఞాపకం లేదు కాని, ఒక విషయం మాత్రం గుర్తుంది. ఈ పాట వినగానే, ఎదేవరో తెలుగు రానాయన పాడుతున్నాడని మాత్రం అంత చిన్న వయసులో కూడా అర్ధం అయ్యింది. ఈ గొంతు ఎక్కడో విన్నట్టుందే, అని అనుకుంటుంటే మా ఇంట్లో ఎవరో అన్నారు ఇది హిందీ పాటలు పాడే ఒకాయన పాడాడు అని. తరవాత్తరవాత రఫీ, కిషోర్, బాల సుబ్రహ్మణ్యం లాంటి మహా మహా గాయకులతో పరిచయమయినా (నాకు వాళ్ళు తెలుసని, వాళ్లకి తెలీదు), ఆ పాట మాత్రం నా మనసులో ఉండి పొయ్యింది. హిందీ పాటలు పాడినాయన తెలుగు పాట బలే charming గా పాడాడు కదా అనుకునే దాన్ని.

చాలా రోజుల తరువాత "రామ్మా చిలకమ్మ" అన్న పాట విడుదలయ్యి మొత్తం రాష్ట్రాన్నే ఒక ఊపు ఊపేసింది. ఈ సినిమా నేను నా ఫ్రండ్స్ తో, కసిన్స్ తో, "నాతో రావటానికి ఎవ్వరు లేరు నువ్వు రావే" అన్న మా పిన్ని తో మూడు సార్లు చూడాల్సి వచ్చింది (చూడాలని వుంది కదా?). లాస్ట్ టైం నేను చూసినప్పుడు సినిమా రిలీజ్ అయ్యి చాల రోజులే అయినా, రామ చిలకమ్మ పాట రాగానే audience లో భలే excitement ఉండింది. తరవాత ఈనాడు లో రామ చిలకల గురించి ఒక ఆర్టికల్ వచ్చింది. అందులో లాస్ట్ లైన్ నాకు ఇంకా గుర్తు. "రామ చిలకమ్మ ని, పరభాషా గాయకుడు రామ్మా చిలకమ్మా అని పాడినా...." అప్పుడు నాకర్ధమయ్యింది actually అది "రామ చిలకమ్మ" అని. మొన్నీ మధ్య పాట వింటుంటే, "రామ చిలకమ్మ" అని ఉదిత్ నారాయణ్ కరెక్ట్ గానే అన్నాడు కదా.... అనిపించింది.

సరే, వేరే పాటలు కూడా విందాం అనేసి, "రాధే గోవిందా", "కన్నుకొట్టినా" లాంటి ఉదిత్ పాడిన పాటలన్నీ విన్నా. ఉచ్చారణ లో ప్రాబ్లం లేక పోయినా ఏంటో అన్ని పాటలు ఫన్ని గా ఉన్నాయి. సరే అని శంకర్ మహాదేవన్ పాటలు విన్నా. అవి "funny meter" లో కొంచెం బెటర్ గా అనిపించాయి. ఇది లాభం లేదని ఉదిత్ తమిళ్ పాటలు విన్నా. అక్కడ కూడా ఒక funnyness (by the way, is this a word?). సరే బాలు గారి హిందీ పాటలు విన్నా. అవి గమ్మతుగా అనిపించలె. హరి హరన్ పాటలలో కూడా నాకేమి funny గా అని పించలె.

సరే మళ్లి రూట్స్ కే వెళ్లి ప్రాబ్లం ఏంటో కనుక్కుందాం అని "నా మది నిన్ను పిలిచింది" విన్నా. ఈ సారి మీరు విన్నప్పుడు గమనించండి "సూర్య చంద్రులు", "అలనాటి జానకి" అన్న phrases ని రఫీ భలే గమ్మతుగా అన్నారు.
వీళ్ళంతా చాలా పేరున్న గాయకులు కదా? భాష రాకపోవటమే దీనికి కారణం అంటారా? మరి చిత్ర గారికి కూడా భాషా అంతగా రాదు కదా? అసలు నేను ఈ పోస్ట్ రాయడానికి కారణం ఏంటంటే, నేను ఈ పోస్ట్ లో "funny", "గమ్మతు" అనే పదాల్ని చాల సార్లు వాడాను. అవి తప్ప నాకు వేరే పదాలు దొరకలే. వీటికి బదులుగా వేరే ఏవైనా పదాలు వాడొచ్చా? అవేంటో నాకు చెప్తారా ప్లీజ్? లేక పోతే "అనవసరమైన ఆలోచనలు పెట్టుకోక, పాటల్ని ఎంజాయ్ చేయ్యమ్మాయి" అంటారా? వాకే.

Monday, September 7, 2009

పరిశుభ్రత కు నోచుకోని Public Restrooms


నేను పెట్టిన title ని చూసి నేను మాట్లాడేది మన దేశం లో లేదా US లో ఉన్న బాత్రూం ల గురుంచి మాత్రమె అనుకోకండి. నేను వేరే ఎ దేశాలకి వెళ్ళలేదు కాబట్టి నా అనుభవాలు మాత్రమే వ్రాస్తున్నాను. ఇంకొక విషయం. చిన్నప్పటి నుంచి ఈ విషయం ఎవరితోటైనా మాట్లాడితే, "అబ్బ ఇప్పుడీ విషయం అంత అవసరమా?" అని తీసి పారేశారు. అందుకనే blog ముఖంగా వ్రాస్తున్నాను.

నేను స్కూల్ లో చదివింది 1980s లో. అప్పట్లో హైదరాబాద్ లో నీళ్ళ సమస్య చాలా ఘోరంగా ఉండేది. ఎంత ఘోరం అంటే రోజు ఇంటి దగ్గరికి నీళ్ళ tanker (ఆ రోజుల్లో అలానే అనే వాళ్ళం, ఇప్పుడేం అంటున్నారో తెలీదు నాకు) వస్తే పిల్లలు, పెద్ద వాళ్ళు అన్న తేడా లేకుండా బకెట్ లతో నీళ్ళు మోసి, రోజుకి సరిపడా నీళ్ళు నింపుకునే వాళ్ళం. వాటర్ tanker విషయానికి వస్తే ఇల్లుకల వాళ్ళు, అద్దె కి ఉండే వాళ్ళు అన్న తేడా ఉండేది కాదు. It was a world of tough competition. మాది "water works" generation. sodium metal తో వాటర్ react అవుతే ఏమవుతుందో చెప్పలేమేమో గాని, water tanker ఎ రోజు ఎన్ని గంటలకి వస్తుందో, ఎ బకెట్ ఎ చేత్తో పట్టుకుంటే ఎన్ని trips లో సిమెంట్ గోలెం నింపోచ్చో, ఎ అంటీ ఎన్ని గంటలకి తన బకెట్ బయట పెట్టారో, దాన్ని బట్టి మనకి ఆ రోజు ఎన్ని నీళ్ళు వస్తాయో చెప్పగలం మేం. సో, మేము మా జీవితం లో ఇన్ని విషయాలు experience చెయ్యడం వల్ల నీళ్ళు చాల పొదుపుగా వాడతాం. అయితే మాకేంటి? అని మీరనడానికి లేదు. ఈ విషయం ఇప్పుడెందుకు చెప్పానంటే, మేము స్కూల్ లో చదువుతున్నప్పుడు ఒక్క బాత్రూం లో కూడా నీళ్ళు వచ్చేవి కాదు. పర్యవసానం ఎంటయ్యా అంటే, మాహా dirty గా ఉండే బత్రూమ్స్. sixth class లో ఉండగా అనుకుంటా ఒక సారి నేను స్కూల్ లో బాత్రూం లోకి చూసినట్టు జ్ఞాపకం. ఆ రోజు నేను కడుపులో తిప్పి పడిపోయ్యాను. ట్యూషన్ క్లాసు కి వెళ్లినప్పుడు ఒక ఫ్రెండ్ తో చెప్పా ఈ విషయం. తను అంది "నా స్కూల్ లో అలానే ఉంది. మా తమ్ముడి స్కూల్ లో కూడా" అని.
అందరు అంటారు ముందర సమస్య ఏంటో కనుక్కోండి, అప్పుడు సమాధానం ఆలోచించచ్చు అని. చిన్న పిల్లల మైన మాకే అనిపిస్తే, స్కూల్ లో టీచర్స్ కి, ప్రిన్సిపాల్ కి, స్కూల్ కి వచ్చే పేరెంట్స్ కి ఎవ్వరికి ఈ సంగతి పట్టలేదా? ఇంటిలో అన్ని రూమ్స్ ని క్లీన్ గా ఉంచుకున్నట్టే, స్కూల్ లో బత్రూమ్స్ ని కూడా క్లీన్ గా ఉంచాలి అని ఎవ్వరు మాతోటి ఎందుకు అనలేదు. ఎప్పుడో జరిగిన సంగతెందుకు, ఇప్పుడేం చెయ్యాలి అంటారా? నన్నడిగితే, periodical గా నోట్ బుక్ చెకింగ్, classroom inspections చేసినట్టు బాత్రూం inspections కూడా చెయ్యొచ్చేమో?

ఒక సారి ఏదో ఊరు వెళ్ళినప్పుడు, బస్సు స్టాండ్ లో దిగి, బాత్రూం కి వెళ్ళాము. అక్కడ వరసగా నాలుగైదు బత్రూమ్స్ ఉన్నాయి. లైన్ మాత్రం ఒక్కదానికే, చాంతాడంత. బాత్రూం తలుపు దగ్గర ఒకామె నించుని లోపలకి వెళ్ళే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటోంది. నేనేమో పెద్ద ఫీల్ అయిపొయ్యి, "చల్ , నేను డబ్బులెందుకు ఇవ్వాలి, పక్కనున్న బాత్రూం లోకి వెళ్తా" అనుకున్నా. "jawaani ka josh" కదా, అదన్నమాట. లోపలకి వెళ్లి, నానో సెకండ్ లో బయటకి వచ్చా. మళ్ళి కడుపులో తిప్పుడు. ఆ డబ్బులు తీసుకునే ఆమె నన్ను చూసి నవ్విన నవ్వు, నేనింకా మర్చిపోలేను.

లాస్ట్ టైం ఇండియా వెళ్ళినప్పుడు ఒక బస్సు ప్రయాణం చేసాం. నాది లాస్ట్ విండో సీట్. ఓవర్ నైట్ జర్నీ. రాత్రి మూడు గంట్లకో ఎప్పుడో బస్సు ఆగితే నిద్ర లేచి కిటికీ తీసా గాలి కోసమని. బయటకి చూస్తే ఏముంది? ఒకాయన టైరు దగ్గరే పని కానిచ్చుకుంటున్నాడు. చిరాకొచ్చేసింది. చూస్తే చడువుకున్నవాడిలా ఉన్నాడు. ఇప్పుడనిపిస్తోంది. నాలుగు చీవాట్లు పెడితే బాగుండేది. మళ్ళి అలా చెయ్యడు అని. అసలు అందరం ఇలా మనకెందుకు గొడవ అనుకోపట్టే కదా ఇలా ఉంది పరిస్థితి? మా అమ్మమ్మ ప్రయాణానికి ముందర ఎప్పుడు అంటారు "ఊరికి బయలుదేరే ముందర, బాత్రూం కి వెళ్లి బయలుదేరండి, దారిలో మంచి నీళ్ళు ఎక్కువ తాగకండి, దారిలో బాత్రూమ్స్ సరిగ్గా ఉండవు" అని. మరి ఎండా కాలం లో నీళ్ళు తాగకుండా ఎలా ప్రయాణం చెయ్యడం. అందరు AC ఉన్న బస్సు లో వెళ్ళడం అఫ్ఫోర్డ్ చెయ్యలేరు కదా?

ఒక సారి బోస్టన్ వెళ్ళేటప్పుడు దారిలో రెస్ట్ ఏరియా లో ఆగాం. అక్కడ బాత్రూం అయితే ఛండాలం. flush పని చెయ్యట్లేదు. బాత్రూం తలుపు తియ్యగానే, రూం అంత పేపర్లు పడేసి ఉన్నాయి. ట్రాష్ క్లీన్ చెయ్యలేదు. ఓవర్ ఫ్లో అయ్యి పోతోంది.

ఇది పరిష్కారం లేని సమస్య అని నేననడం లేదు. ముఖ్యం గా నేను ఎవ్వరిని కించపరచటం లేదు. ఇది అందరి సమస్య. మన చుట్టుపక్కల పరిశుభ్రం లేక పోతే, మన ఆరోగ్యానికే నష్టం కదా? If it is not too stinky (even if it is), I would very much appreciate it if you could share your experiences and any possible solutions to this problem.

Wednesday, September 2, 2009

పెళ్ళికూతురు/పెళ్లి కొడుకు ఎలా ఉండాలంటే?........


పెళ్ళంటే? పెళ్ళంటే పందిళ్ళు, లల్లల్ల, లల్లల్ల, లల్లల్ల తలంబ్రాలూ.......... ఆగండి!!!! ఎవరక్కడ కృష్ణంరాజు, శ్రీదేవి లా సాంగేస్కునేది? ఈ మధ్య పిల్లలు మరీ పాడైపోతున్నారు. చదువు గిదువు మీద ధ్యాస లేదు కాని, కాబోయే ఆవిడ/ఆయన ఇలా ఉండాలి, అలా ఉండాలి అని ఒకటే imaginationలు.
చిన్నప్పుడైతే గోరింటాకు పెట్టుకోగానే "మందారం లా పూస్తే మంచి మొగుడొస్తాడు.... ఇంకేదోలా పూస్తే ఇంకొకడెవడో వస్తాడు.." అని పాడెస్కునే వాళ్ళం ఎంచక్కా. సరే, ఆ రోజుల్లో అది చాల "happening" పాట కాబట్టి అలా పాడుకున్నాం. టెన్త్ క్లాసు లో కొచ్చాక శివ సినిమా రిలీజ్ అయ్యింది. ఇంక చూస్కోండి ఏ అమ్మాయిని చూసినా "సరసాలు చాలు శ్రీవారు తాననానా...." ఇదే గొడవ. అక్కడికి నాగార్జున వీళ్ళ కిచెన్ లోకే వచ్చేసి, పింక్ చీర కట్టుకున్న వీళ్ళ తోటే duet వేసుకున్న ఫీలింగ్. ఈ విషయంలో అబ్బాయిలు అమ్మాయిలకి అస్సలు తీసిపోరు. "భోలిసి సూరత్, ఆంఖోమే మస్తి ..." అని వీళ్ళు పాడేసుకోవడమే. అసలు నాకు తెలికడుగుతాను, మన గోరింటాకు మందారంలా పండితే, వాడెవడో మంచివాడేలా అవుతాడు, మన పిచ్చి గాని. పోనీ, ఏదో చిన్నతనం లో అలా అనుకున్నామా అంటే అదీ కాదు. పెద్దయ్యేకొద్దీ ఈ పిచ్చి ముదురుతుందే తప్ప (at least, నాకు తెలిసినంత మటుక్కు) తక్కువ కాదు.

చదువుకునే రోజుల్లో నాకు తెలిసిన అమ్మాయి ఇంకొక ఫ్రెండ్ తో "నాకైతే పెళ్లి విషయం లో కొన్ని specifications ఉన్నాయి. నాకు కాబోయే భర్త EAMCET లో టాప్ 50 రాంక్ holders లో ఒకడై ఉండాలి, IIT లో MTech చేసుండాలి, MS మాత్రం CS అయితేనే అస్సలు proceed అయ్యేది, లేకపోతే లేదు". అప్పుడా ఫ్రెండ్ అంది ... "అన్ని qualifications ఉన్నవాడు నిన్నెందుకు పెళ్లి చేసుకుంటాడు?" అని. అవును మరి మన lady ఏమో హైదరాబాద్ లో ఏదో ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీ లో electrical engineering చదివింది.


నేనిందాక చెప్పా కదా అబ్బాయిలు ఎందుకు తీసిపోరని. నాలుగైదేళ్ళ క్రితం మా university లో చదువుతున్న ఒక తెలుగు అమ్మాయికి పెళ్ళయ్యింది. బాగా ఉన్నవాళ్ళమ్మాయి అవడంతో చాలా గ్రాండ్ గా పెళ్లి చేసారని ఆ అమ్మాయి రూం మేట్స్ ద్వార అందిన సమాచారం. అది పెద్ద విషయం ఎంచేతంటే, తను ఎప్పుడు అంత డబ్బున్న పిల్లలా behave చెయ్యలేదు. అందరితో పాటే కలిసి పొయ్యి చాల friendly గా ఉండేది. సడన్ గా సంబంధం కుదరటం తో అ అమ్మాయి ఇండియా వెళ్ళే ముందర ఎక్కువ మందికి చెప్పలేదు. అందుకని వచ్చాక ఫ్రెండ్స్ (అమ్మాయిల్ని మాత్రమే) Pizza party కి పిలిచింది. ఈ విషయాలన్నీ ఎలా అయితేనేం ఇండియన్ అబ్బాయిలందరికీ తెలిసాయి. నాకు తెలిసిన అబ్బాయి తో తరువాతి రోజు జరిగిన conversation:
నేను: అబ్బ, ఇవ్వాళ ల్యాబ్ కి వచెటప్పటికి లేట్ అయ్యింది.
తె అ: ఎందుకండి నిన్న పార్టీ కేమైనా వెళ్ళారా?
నేను: (మనసులో "ఓర్నీ, నీకెలా తెలిసింది?" అనుకుని, బైటికి మాత్రం) ఔనయ్యా. భలే కనిపెట్టావే.
తె అ: నేను కనిపేట్టతానికేముందండి, అందరు అనుకుంటున్నారు?
నేను: (అందరు అంటే?) ఏమని?
తె అ: సో అండ్ సో అమ్మాయి పెళ్ళయిందని, అమ్మాయి చాల డబ్బున్న వాళ్ళ అమ్మాయి అని, పెళ్లి చాలా గ్రాండ్ గా చేసారని, ఆ అబ్బాయి సో అండ్ సో university లో Ph.D చేస్తున్నాడని, ఈ అమ్మాయి MS అవ్వంగానే వెళ్ళిపోతుందని, ........
నేను: (ఆపుతావా నాయనా? ఓరి మీ అసాధ్యం కూలా. వారం రోజుల్లో ఇన్ని విషయాలు ఎక్కడ కనిపెట్టారు? ల్యాబ్ లో రీసెర్చ్ మానేసి ఈ పనులన్నీ చేస్తున్నారా ఏంటి?) హి హి హి హి అయితే ఇప్పుడు ఏంటి?
తె అ: మీ లాంటి సీనియర్స్ ఉండి నాలాంటి వాళ్లకి లాభామేవుందండి? ఆ అమ్మాయి గురించి నాకైనా చెప్పలేదు.
నేను: (ఇంక నాకు తిక్క వచ్చేసింది) చెప్తే ఏమి చేసేవాడివి?
తె అ: మీరు introduce చేస్తే, friendship చేసుకుని, మెల్లమెల్లగా పెళ్లి వరకు తీసుకేల్లెవాడిని (మరి లాస్ట్ సెమెస్టర్ లో వాళ్ళ స్టడీ గ్రూప్ చదువుకుందామని పిలిస్తే రానన్నావ్?)
నేను: సరే ఇప్పుడేమయింది. నీకెలాంటి అమ్మాయి కావాలో చెప్పు. ఇప్పుడు వెతుకుదాం (అక్కడికి నేనేదో పెళ్ళిళ్ళ పేరమ్మ లాగ)
ఇంక మొదలయ్యింది లిస్టు. ఎంతకీ ఆపడే? ఆ అమ్మాయికి చాల డబ్బులుండాలి, ఆ అమ్మాయి సన్నగా ఉండాలి, కళ్ళజోడు ఉండకూడదు, పెద్ద జడ ఉండాలి............................................................................................, చివరిగా ఆ అమ్మాయికి MS డిగ్రీ ఉండాలి అని. ఈ లిస్టు చెప్పటం అయ్యేటప్పటికి నేను రెండు experiments కి సరిపడా calculations పూర్తి చేశా.
నేను: MS ఎందుకు? నువ్వు ఎలాగో Ph.D చేస్తున్నావుగా? ఆ అమ్మయి కూడా Ph. D అయితే బావుంటుంది (నాలో పెళ్ళిళ్ళ పేరమ్మ మేల్కొంది).
తె అ: వద్దండి Ph.D ఉన్న పిల్లయితే నా మాట వినదు.
నాకప్పుడనిపించింది, ఎక్కడో ఈ లోకంలో ఒక అమ్మాయి అనుకుంటూ ఉంటుంది "మా నాన్న అన్ని కట్నం డబ్బులు, అవీ ఇచ్చినతరవాత Ph. D. ఉన్నవాడినేందుకు చేసుకోవటం దండగ, ఎంచక్కా 10th క్లాసు పాస్ అయ్యిన వాడిని చేసుకుంటే బెటర్, మన మాటైనా వింటాడు" అని.
సరే. అమ్మాయిలూ, అబ్బాయిలు ఇలా అనుకుంటే reasonable గానే ఉండొచ్చు. వాళ్ళ పెళ్లి విషయం కాబట్టి. ఇంక తల్లి తండ్రుల కోరికలు వినాలి. మా అమ్మకి బోల్డంత మంది కజిన్లు. వాళ్ళల్లో కొంత మంది కి సంబధించిన విశేషాలు:

ఒక ఆవిడ: అక్కా, భాస్కర్ కి సంబంధాలేవైన చూస్తున్నారా?
ఇంకో ఆవిడ: చెప్పానే చాలా మందికి. ఇంకా ఎవ్వరు ఏమి సంబంధాలు తీసుకు రాలే.
ఎందుకు తీసుకొస్తారు. తీసుకొచ్చి ఈవిడ తోటి పిచ్చ తిట్లు తినటానికా? మొన్నటికి మొన్న ఒకాయనెవరో సంబంధం మాట చెప్తే, solid గా తిట్టింది. ఈవిడ కండిషన్ ఏంటంటే, పిల్ల తెల్ల్ల్ల్ల్ల్ల్ల్ల్ల్ల్ల్ల్ల్ల్ల్ల్ల్లగా ఉండాలిట. ఆవిడ "తెల్ల" ని అంత స్ట్రెస్ చేసింది మరి. వాళ్ళ అబ్బాయి చామన ఛాయ కంటే కొంచెం ఎక్కువుంటాడు.

మా అమ్మ ఒక సారి వాళ్ళ ఇంకొక కజిన్ వాళ్ళ ఫ్యామిలీ హైదరాబాద్ కి transfer అయ్యి వచ్చారని నన్ను, మా పిన్నిని తీసుకెళ్ళింది వాళ్ళింటికి. ఆవిడ తలుపు తీసి మమ్మల్ని చూస్తూనే జరిగిన conversation:
అమ్మ: ఏమే బాగున్నావా? గుర్తుపట్టవా?
ఆవిడ: గుర్తుపట్టక పోవటం ఏమిటే? ఇదెవరు? మీ అమ్మాయా? పెళ్ళయ్యిందా? అది చెల్లెలు కదూ?
అమ్మ: కాలేదే. చదువుకుంటోంది.
ఆ: అవున్లే ఈ రోజుల్లో చదువుండాలి కదా దేనికైనా. మా అమ్మాయికి మంచి సంబంధం చూడవే.
(కాళ్ళు నేప్పెడుతున్నాయి బాబు, కొంచెం కుర్చీ చూపించి మంచినీళ్ళు ఇస్తారా?)
అమ్మ: నాకే ఆడపిల్ల (నేను) ఉంది కదా? ముందు దానికి చూసుకోవాలిగా?
ఆ: నీ పిల్ల కేమే? పొట్టి వాడైనా పరవాలేదు. మా అమ్మాయి 5 6' ఉంటుంది. పోడుగువాళ్ళు దొరకటంలా.
నాకసలే నా height మీద కామెంట్ చేస్తే ఒళ్ళు మంట. టక్కున నేను మా పిన్ని లేచాం. "general bazaar లో షాపింగ్ చేసోస్తాం" అని. నాకు పొగరు లేదు కాని నేను మాత్రం మళ్లి వాళ్ళింటికి వెళ్ళలేదు. ఎందుకేల్తాను? నన్ను అంత అవమానించాక? కదా?


ఏ విషయం లోనైనా, మనకి కొన్ని standards ఉండడం చాల అవసరం. కాకపోతే, కామన్ సెన్స్ ఉండాలి పైగా కొన్ని విషయాలని ప్రైవేటు గా ఉంచుకోవటం ఎంతైనా అవసరం. లేక పోతే నవ్వుల పాలవ్వటం ఖాయం.