Thursday, December 24, 2009

Book Festival Nostalgia

మా ఆయన: "చిట్టి తల్లీ, రామ్మా, ఆకలేస్తోంది. భోంచేద్దాం"
నేను: "ఇదిగో వచ్చేస్తున్నా"
గంట తరవాత ......
మా ఆయన: "ఈ మూవీ కూడా అయిపోయింది. తొందరగా రావాలి"
నేను: "వచ్చేస్తున్నా. అయిదు నిమిషాలు"
గంట తరవాత.....
రూం తలుపులు భాడాల్న తెరుచుకున్న చప్పుడుతో మా ఆయన స్టడీ లో ప్రవేశం.
"ఎం చేస్తున్నావు నువ్వసలు కంప్యూటర్ ముందు? ఇందాకట్నుంచి పిలుస్తుంటే రావేంటి? అయినా ఆకలేస్తోందంటే, ఒకటే ఆ ఫోన్ లో ముచ్చట్లేంటి? మీ అమ్మా వాళ్లకి ఇంకో గంట పొయ్యాక ఫోన్ చెయ్యొచ్చుగా? వాళ్లు కూడా పొద్దున్నే ఎనిమిది గంటలకే నీతో హస్కు వేసుకోవాలా? అయినా నువ్వూ మీ నాన్నగారు ఎం మాట్లాడుతున్నారేంటి? తెలంగాణా ఇష్యూ నా?" ఆకలేస్తోందేమో, ఆపకుండా చెలరేగిపోతున్నాడు.
మనం ఎమన్నా తక్కువ తిన్నామా? ఒక్కసారి తన కేసి చూసి "అంత ఆకలేస్తే, టేబుల్ మీద అన్ని రెడీ గా ఉన్నాయి, వెళ్లి స్టార్ట్ చెయ్యి. నేనిప్పుడే వస్తా. నువ్వు ల్యాబ్ లో రాత్రి, రాత్రి readings తీసుకుంటూ కూర్చుంటే నేను వెయిట్ చెయ్యట్లా నీ కోసం. ఇది కూడా అంతే అనుకో" అనేసి కంప్యూటర్ వైపు తిరిగేసా మిగతా బ్లాగ్స్ చూడటానికి. ఇంతకి నేను చూసే బ్లాగ్స్ ఏమనుకుంటున్నారు? హైదరాబాద్ బుక్ ఫెస్టివల్ గురించి తెలుగు బ్లాగ్స్, ఇంకా పుస్తకం.నెట్ లో పరిచయాలు. రెండు ఒకటి తరవాత ఒకటి చూసి, మా అమ్మకి లిస్టు చెప్పటం. అవన్నీ మా అమ్మా, నాన్న బుక్ ఫెస్టివల్ కి వెళ్లి కొని నాకు పంపిస్తారు.

హైదరాబాద్ బుక్ ఫెస్టివల్ తో నా అనుబంధం ఇప్పటిదా? అసలు ఆ గ్రౌండ్ లో అడుగు పెట్టగానే ఆనందం అలా గుండెలోనుంచి పొంగి వస్తుంది. అసలు ఈ గ్రౌండ్ మన ఇంటి back yard అయిపొయ్యి, ఈ బుక్ stalls అన్ని మన property అయిపోతే ఎంత బాగుంటుంది. అప్పుడు మనకిష్టం లేని పుస్తకాల్ని, మనుషుల్ని, గడ్డి పీకేసినట్టుగా తీసేసి, బయట విసిరేయ్యోచ్చు.
మొదటిసారి ఎడో క్లాసు లో ఉన్నప్పుడు వెళ్ళా నేను బుక్ ఫెస్టివల్ కి. చిక్కడపల్లి లో సెంట్రల్ లైబ్రరీ లో. అప్పుడు మనకి పుస్తకాలు అంటే ఇష్టం కాని ఫ్యామిలీ budget సంగతులు అర్ధం కావుకదా? నేను యాభై పుస్తకాలు సెలెక్ట్ చేసుకుంటే, అమ్మ అందులో ఐదో, ఆరో కొనేది. దానికి తోడు మా తమ్ముడు నాకు తోక. వాడికిష్టం వచ్చినలాంటి బుక్స్ నా చేత కొనిపించేవాడు. కొన్న బుక్స్ మొత్తం మీద పదైతే, అందులో దాదాపు ఏడు వాదికిష్టమైనవే ఉండేవి. ఇలా 70 - 30 సిస్టం లో నాకు తీరని అన్యాయం జరిగి పొయ్యేది. నాన్న దగ్గరికి వెళ్లి చెప్దామంటే ఆయనకి కావాల్సిన పుస్తకం వెతుక్కోవటం లో బిజీ. నాన్న ఫ్రీ అయ్యేటప్పటికి నాకు అలిగి, అలిగి విసుగోచ్చేసేది. నా తోకగాడు విజయ గర్వం తో కామిక్స్ పుచ్చుకుని ఆటో లో కూర్చునేవాడు. నేనేమో నా మూడు పుస్తకాల్ని ఇంటికి పట్టికెళ్ళి, అట్టవేసుకుని, పేరు రాసుకునేటప్పటికి రాతిరైపొయ్యింది. వాటిని మహా జాగ్రతగా ఆస్వాదిస్తూ, మరుసటి రోజు టిఫిన్ తినేటప్పుడు చదువుతుంటే ఉందీ....... అబ్బ అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది మజా.

తరవాత పదో తరగతి, ఇంటర్మీడియట్ కి వచ్చినతరవాత లైబ్రరీ, బుక్ ఫెస్టివల్ అన్ని బంద్ కొన్ని రోజులు. అయినా అదేంటో? EAMCET వ్రాసినంత మాత్రాన వేరే పుస్తకాలు చదవకూదడా? ఇదెక్కడి న్యాయం? ఇంతకు ముందు చెప్పినట్టు, అంత కిందా, మీదా పడి చదివినా అప్పుడు చత్త BSc లో చేరాల్సి వచ్చిది (అప్పుడలా అనుకున్నాం. ఇప్పుడు కాదులెండి). ఒక సాయంత్రం ఇంటికి వచ్చేసరికి అమ్మ చిరునవ్వుతో ఇల్లు సద్దుతోంది. ఏమిటి అంటే "ఇంట్లో చత్త ఎక్కువైపోయింది. పాత పుస్తకాలన్నీ పేపర్ల వాళ్లకి ఇచ్చేశాను. బోల్డు చోటు ఉంది ఇప్పుడు సామాన్లు పెట్టడానికి. ఇల్లంతా దుమ్ము దుమ్ము" అని మా అమ్మ స్నానానికి వెళ్ళిపోయింది. మా తమ్ముడి చేతిలో క్రికెట్ బాట్ ధడాల్న కింద పడింది. నేను ఒక్కసారి కుర్చీ లో కూలబడి పొయ్యా. మా అమ్మతో ఆ రోజు పెద్ద యుద్ధమే "నీ అరాచాకాలకి అసలు అంతు ఉండదా" అంటూ. మా అమ్మేమో మా మీద ఒక రేంజ్ లో రివర్స్ ఎటాక్ చేసింది "రోజు లైబ్రరీ లో పుస్తకాలు అద్దెకి తెచ్చి చదువుతారుగా? మళ్లి నెలకో యాభై కొని ఇల్లంతా పుస్తకాలు చెయ్యాలా? మా రోజుల్లో మేము కూడా చదివాం. అయినా చదివేసి బయట పారెయ్యాలి. లేక అటక మీద పెట్టెయ్యాలి. ఈ అద్దె ఇళ్ళల్లో మనకి అటకలు కూడానా?" అంటూ. మా నాన్నేమో ఇంటికొచ్చి గబా గబా ఆయన డబ్బాలు చూసుకున్నారు. కొన్ని మిగిలి పొయ్యాయి కొన్ని మాత్రం పేపర్ వాళ్ళ దగ్గరకి వెళ్లి పొయ్యాయి. కాని మా నాన్న ఫిలోసోఫి ఏమిటంటే చదివేసి, పుస్తకం లో ఉన్న సారాంశాన్ని గుర్తుపెట్టుకోవాలి కాని మెమరీ కోసం పుస్తకం మన దగ్గర ఉండటం ముఖ్యం కాదు అని. అయితే మాత్రం? పుస్తకాలు పడేస్తారా ఎక్కడైనా? అప్పుడు చూసాం పేపర్లో "హైదరాబాద్ బుక్ ఫెస్టివల్" అని. మా పాత రోజులు గుర్తుతెచ్చుకుని మాకు మేం సద్దిచేప్పుకున్నాం ఈ సారి వెళ్లి బోల్డు బోల్డు కొని తెచ్చుకుందాం అని. ఇంకా రెండు నెలలు ఉంది బుక్ ఫెస్టివల్ కి. మా అమ్మ అంది "ఐదు వందలు ఇస్తాను, వెళ్లి తెచ్చుకోండి" అని. ముందే మా వాడి తో చెప్పా, సగం సగం అని. అంటే చెరో రెండొందల యాభై. ఆహా. ఆ రెండు నెలలు ఎన్ని కలలు కన్నామో?

సరే. డిసెంబర్ రానే వచ్చింది. బుక్ ఫెస్టివల్ నిజాం కాలేజీ గ్రౌండ్స్ లో. ముందే నా రెండొందల యాభై తీసేసుకున్నా అమ్మ దగ్గర నుంచి. ఇప్పుడు ధరలు పెరిగిపోయ్యాయి, మనం కొనే పుస్తకాలు కూడా పెద్దవయ్యేసరికి పర్స్ మీద భారం ఇంకొంచెం ఎక్కువ పడింది. ఏమైతేనేం, నాకిష్టమైనవి పుస్తకాలు కొనుక్కున్నా. ఆ సంవత్సరం తమ్ముడికి కూడా డబ్బులిచ్చా, పుస్తకం మీద నా పేరు కూడా వ్రాసుకునే ఒప్పందం మీద. అప్పుడు మా collection లో R . K . Narayan , జిం కార్బెట్, మైకేల్ క్రియన్ చేరారు. అప్పుడే మేం నిర్ణయం చేసేసుకున్నాం వచ్చే సంవత్సరం ఆ collection పెంచాలని. తరువాతి సంవత్సరాలలో, ఇవే రచయతలవి వేరే పుస్తకాలు ఇంకా కుష్వంత్ సింగ్ పుస్తకాలు కొన్నాం. నేను ఉద్యోగం మొదలు పెట్టిన ఏడాది నా డబ్బులు పెట్టి పుస్తకాలు కొనుక్కున్నా కేశవ్ మెమోరియల్ గ్రౌండ్స్ లో. మా తమ్ముడికైతే పండగే. అమ్మ లాగా నేను ఆంక్షలు పెట్టలేదని. ఆ సంవత్సరం కొన్న పుస్తకాల్లో "Anne Frank 's Dairy " కూడా ఉంది. ఈ పుస్తకం ఎందుకు గుర్తుందంటే, వీసా కోసం మద్రాస్ వెళ్ళినప్పుడు ట్రైన్ లో చదువుకుందామని పట్టికెళ్ళి పోగొట్టుకున్నా. వచ్చేటప్పుడు ట్రైన్ లో చదువుకోవటానికి పుస్తకాలు లేక women 's era కొనుక్కున్నా. నేను ఇక్కడి కొచ్చేసాక పుస్తకాల పిచ్చి తగ్గలేదు కాని మళ్లి హైదరాబాద్ బుక్ ఫెస్టివల్ కి వెళ్ళే అవకాశం రాలేదు.

తెలుగు పుస్తకాల గురించి చదువుతున్నప్పుడు అనిపించింది నా దగ్గర అస్సలు తెలుగు పుస్తకాలు లేవని. పోయిన సంవత్సరం సుజాత గారి బ్లాగ్ లో బుక్ ఫెయిర్ గురించి చదివాక అనిపించింది వీలైతే నేవెళ్ళి కొనుక్కోవాలని లేకపోతే అమ్మా, నాన్నతో తెప్పించుకోవాలని. ఈ సారి మా అమ్మకి పెద్ద తెలుగు బుక్స్ లిస్టు చెప్పా. "తెలుగు పుస్తకాలు ఎప్పటినుంచి చదువుతున్నావు" అంటూ అమ్మ మురిసిపోయింది. మా అమ్మ, నాన్న వెళ్లారు బుక్ ఫెస్టివల్ కి. నాకు కావాల్సినవి కొన్నే దొరికాయి పుస్తకాలు . ఏమైతేనేం మా అమ్మ అన్ని stalls గురించి వివరంగా చెప్పింది. "వేరే దేశాలల్లో ఉన్నా, నన్ను పుస్తకాల కోసం తిప్పటం మానట్లేదర్రా మీరు" అంది కూడా.
ఇవన్ని చెప్తే మా శ్రీవారంటారు "we did not have to go to any book festivals in Chennai. There are huge books stores we always go to. You probably do not have such big stores. So book festival was a big deal" అని. వొళ్ళు మండిపోయింది నాకైతే. మా హైదరాబాద్ లో కూడా ఉన్నాయండి బుక్ స్టోర్స్ కోటి ఇంకా అబిడ్స్ లో. కాని బుక్ ఫెస్టివల్ మజా నే వేరు. ఎదురు చూస్తున్నా మా అమ్మ వాళ్ళు పంపిచే బుక్స్ కోసం.

Wednesday, December 9, 2009

నా గాలి, నా నేలా, నా ఊరు .......


నిన్న కొత్త పాళీ గారి పోస్ట్ చదివాను. మాతృ భూమిని గురించి వ్రాయటం కష్టం అని ఆయన అన్నప్పుడు నిజమేననిపించింది. మాతృ భూమి కంటే ముందు పుట్టి పెరిగిన ఊరు గురించి వ్రాసి ప్రాక్టీసు చేద్దాం అనుకున్నా. అసలు హైదరాబాద్ గురించి వ్రాస్తే ఏమి రాయొచ్చా అని ఆలోచిస్తుంటే అసలు ఎక్కడ మొదలెట్టాలా అనే చాలా సేపు ఆలోచించా. అంత పెద్ద రచయిత కే కష్టమవుతే, గడ్డి పరక లాంటి దాన్ని, నాకు అసాధ్యమేమోననిపించింది. అయినా ప్రయత్నం చేద్దామని మొదలుపెట్టా.

నాకు ఊహ తెలిసినప్పటి నుంచి హైదరాబాద్ లోనే ఉన్నా. అమ్మా, నాన్న ఉద్యోగ రీత్యా వేరే ఊళ్ళల్లో ఉండేవారు నాకు తొమ్మిదేళ్ళ వయసు వచ్చే వరకు. నేను అమ్మమ్మగారింటిలో హైదరాబాద్ లో ఉండేదాన్ని.
రిక్షా లో వెళ్తే రెడ్డి కాలేజీ ఎదురుకుండా సందులోనుంచి వెళ్లి, రాఘవేంద్ర స్వామి గుడి మీదుగా బసంత్ ధియేటర్ దాటి, కాచిగూడ చౌరస్తా, బడి చౌడి తరవాత కోటి. అబ్బ, కళ్ళకు కట్టినట్టు కనిపిస్తోంది దారంతా. బసంత్ ధియేటర్ కంటే కొంచెం ముందు వచ్చే నృపతుంగా స్కూల్ దాటినతరవాత వచ్చే షాప్ ఎనిమిది గంటలకే తెరిచేసేవారు. స్కూల్ కి వెళ్ళే ముందర ఏదైనా కొనుక్కోవాలంటే అక్కడే. ఖర్మ కాలి అంకుల్ (అందరు పిల్లలు ఆయన్ని అలాగే పిలిచేవారు) షాప్ తెరవకపోతే పెద్ద తలనొప్పే. కాచిగుడా, బడే చౌడి మీద నుంచి వెళ్తుంటే పూల బుట్టలు పెట్టుకుని అమ్ముతున్న వాళ్ళు కనపడితే చాలు, రిక్షా అబ్బాయిని అడిగి, ఆపించి అమ్మయిలమందరం పది పైసలకి గులాబీలు కొనుక్కునే వాళ్ళం టీచర్ కి ఇవ్వడానికి. అబ్బాయిలందరూ ఒకటే గోల. రిక్షా బాలరాజు మాత్రం "పాపా తొందరగా నడవనడంమా" అనేవాడు. బడే చౌడి కూరగాయల మార్కెట్ అప్పుడే కూరల బండ్లతో నిండడం మొదలయ్యేది. ఆకు కూరలైతే, పచ్చగా, ఫ్రెష్ గా ఎంత అందంగా కనపడేవో. ఆంజనేయ స్వామి గుడి పక్కనించి వెళ్తుంటే, పూజారి గారు జాలి సందుల్లోంచి హారతిస్తూ కనిపించేవారు. అందరం దండం పెట్టుకునే వాళ్ళం బాలరాజు తో సహా. వినాయక చవితప్పుడు చూడాలి. దారి పొడుగునా విగ్రహాలు అమ్మకానికి పెట్టేవారు. నిమర్జనం అయ్యేవరకు ప్రతి వేదిక మీద ఉన్న వినాయకుళ్ళని చూడడానికి రోజు ఉత్సాహమే. సుల్తాన్ బజార్ చౌరస్తా దగ్గర రంగు రంగుల పొడులు (బొట్టు పెట్టుకోవటానికి వాడతారు), దేవుడి పుస్తకాలు పెట్టుకుని ఇద్దరు ముగ్గురు ముసలమ్మలు ఉండేవాళ్ళు.

తరవాత నేను అబిడ్స్ లో missionary స్కూల్ లో చేరాను. శాంతి ధియేటర్ దాటి, వితల్ వాడి క్రైస్తవ సిమెట్రీ, saint జోసెఫ్స్ స్కూల్, కింగ్ కోటి హాస్పిటల్ దాటి వెళ్ళేవాళ్ళం. దారిలో ఒక చిన్న ధియేటర్ ఉండేది. దాని పేరు మర్చిపోయ్యాను. అందులో ఎప్పుడు "A Certified" సినిమాలు ఉంటాయని, అమ్మ రిక్షా అబ్బాయితో రెండు మూడు వారాలకోక్కసారి చెప్పేది "ధియేటర్ పక్క సందులోనుంచి వెళ్ళకు" అని. తరవాత అక్కడ "one way" పెట్టడంతో తప్పిది కాదు. కింగ్ కోటి హాస్పిటల్ దగ్గర చిన్న చిన్న షెడ్లు, స్కూటర్ రేపైర్ వాళ్ళ షాప్లు, బలే సందడి గా ఉండేది. పండగలోస్తే, బాలరాజు ని సాయంత్రం రావద్దని చెప్పి, సాయంత్రం అమ్మా, నాన్న వచ్చేవాళ్ళు నన్ను, తమ్ముడిని పిక్ అప్ చేసుకోటానికి. తాజ్ లో టిఫిన్ తిని, బట్టలు కొనుక్కునే వాళ్ళం. చేర్మాస్, దయాల్స్, నీడ్స్, బోల్డు బట్టల షాప్లుండేవి. అంతా అయ్యాక, అమ్మకి చీర కొని, నాన్నకూడా సియరామ్స్ లోనో, లేక
raymonds, లోనో (ఇంకా చాలా షాప్స్ పేర్లు గుర్తురావట్లేదు) షర్టు బట్టలు కొని, జోన్స్ బకేరి కి వెళ్లి pastry (అప్పుడు 1.50 Rs కి పెద్ద పెస్త్రి వచ్చేది) కొనుక్కుని, ఇంటికి వెళ్ళేవాళ్ళం. ఆహా ఆ రోజులు మళ్ళి రావుకదా.

ఇంక కాలేజీ కి వచ్చాక చుట్టు పక్కనున్న ధియేటర్ లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లు, అన్ని మనవే. శాంతి, కిషోర్, సంధ్య, దేవి, odeon, sapthagiri, sangam, మహేశ్వరీ-పరమేశ్వరి, తారకరామ అబ్బో. అబిడ్స్ లో మూడో నాలుగో ఉండేవి, వాటి పేర్లు నాకు గుర్తు రావట్లేదు. కాలేజీ లో ఉన్నప్పుడు ఇవి చాలవుటండి. నాన్న ఇంగ్లీష్ సినిమా కి తీసుకెళ్ళాలంటే, secundrabad లో ఉన్న సంగీత్. ఇంక తినతానికైతే హిమాయత్ నగర్ ఏరియా లో కింగ్ అండ్ కార్డినల్, పిక్ అండ్ move, minerva, gayathri భవన్. పోయిన సారి హైదరాబాద్ వెళ్లి నప్పుడు చూసాను అక్కడే మాక్ దోనల్డ్స్, పిజ్జా హట్ ఇంక చాలా చాల కనిపించాయి. అలానే ముందు కెళ్తే, liberty ఏరియా దగ్గరనుకుంటా Baskin robins ఉండేది. దాంట్లోకి వెళ్ళాలంటే ధైర్యం కావాలి ఎందుకంటే బాగ్ లో డబ్బులున్డాలి మరి. విగ్రహాలని పెట్టినతరవాత, హైదరాబాద్ వచ్చిన చుట్టాలని ట్యాంక్ bund తప్పకుండా తీసుకెళ్ళే వాళ్ళం. అప్పుడే కాల్చిన మొక్క జొన్న పొత్తులు తింటూ, బుద్దుడిని చూస్తూ నడుస్తుంటే టైం తెలిసేది కాదు. కొన్ని రోజులతరువాత లుంబిని పార్క్ కూడా వెళ్ళేవాళ్ళం వచ్చిన చుట్టాలని తీసుకుని. Secretariat దగ్గర Lees బ్యుటి పార్లర్ ఉండేది. మన మొహం ,మన జడ మన చేతిలోకోచ్చాక అక్కడికేల్లెవాళ్ళం, facials , eye brows , hair cut కోసమని. నాకైతే వెళ్ళేటప్పుడు, వచ్చిన తరవాత రెండు సార్లు తిట్లే. అయితే ఎందుకు వెళ్ళడం అంటారా? అదంతే. అప్పుడింక దోస్తులతోటి బడి చౌడి, కోటి, జనరల్ బజార్ వెళ్లి మన సల్వార్ కమీజులు మనమే సెలెక్ట్ చేసి తెచ్చుకోవడమే.
ఇంక సంజీవరెడ్డి నగర్ లో ఉద్యోగం వెలగపెట్టేటప్పటికి మేము ఇల్లు మారిపోయ్యం. బస్సు లో వెళ్ళేదాన్ని ఉద్యోగానికి. ఖైరతాబాద్, పంజాగుట్ట ఏరియా లో అప్పటికే అపార్ట్మెంట్ కల్చర్ పెరిగిపోయింది. రిక్షాలు తగ్గిపోయ్యాయి. చాలామంది పిల్లలు అటో లో స్కూల్కి వెళ్ళటం మొదలెట్టారు, తల్లి తండ్రులు హై టెక్ సిటీ లో పని చేస్తుంటే పిల్లలు కార్లల్లోనే స్కూల్ కి వెళ్తున్నారు. కంపెనీ బుస్సులన్ని సిటీ లోకి రావటం మొదలు పెట్టాయి. అటో minimum ఛార్జ్ పెరిగి, పెరిగి నేను పోయిన సారి వెళ్ళినప్పుడు నమ్మలేనంతగా తయారయ్యింది. మా స్కూల్ దగ్గరున్న గోడ కూలిపోయ్యి బోల్డు అపార్ట్మెంట్లు లేచాయి. చాల classy గా ఉండే botique లు పెరిగి పొయ్యాయి. కాలుష్యం చాలా ఎక్కువయ్యింది. ఇంత కాలుష్యం లో పిల్లలు బయట ఆడుకోకపోవటమే నయమనిపిస్తోంది.
ఈసారి వెళ్ళినప్పుడు ఎ మార్పులు చూస్తానో?