Friday, May 20, 2011

నాలో కవయిత్రి, మ్యూజిక్ డిరేక్టరిత్రి నిద్ర లేస్తోంది.... లేచింది.... లేచేసింది

ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు, బేబీ గురించి ఆలొచిస్తూ, పాప ఏడ్చినప్పుడు ఏమేం లాలిపాటలు పాడాలి అని నాకు తెలిసిన పాటలన్నీ గుర్తు తెచ్చుకుని ప్రాక్టీసు చేసుకునే దాన్ని.
వటపత్ర సాయి కి వరహాల లాలి, ముద్దుల మా బాబు, గుడియా రాణి ఇవన్ని రోజు పాడుకునేదాన్ని. పుట్టిన వారం రోజుల నించి రోజు సాయంత్రం మూడు నాలుగు గంటలు ఏడ్చేది. ఒక్కొక్క సారి ఆ ఏడుపు విని చాలా బాధేసేది. మా అమ్మ నాన్న అయితే గిల గిల లాదిపోయ్యేవారు ఆ ఏడుపు విని. తరవాత తెలిసింది దాన్ని "colic " అంటారని అది బేబీకి  మూడు నాలుగు నెలలు వచ్చాక దానంతటదే తగ్గి పోతుందని. దాదాపు డిసెంబర్ చివరి వరకు ఆ నొప్పి ఎలా  భరించిందో ఆ దేవుడి కే తెలియాలి. సాయంత్రం అవుతోందంటే మా అమ్మా, నాన్న భయపడి పొయ్యేవారు. ఎవరైనా ఇంటికొస్తే మాత్రం ఏడిచేది కాదు. నేను ఆఫీసు నించి వచేవరకు అమ్మ నాన్న ప్రాణాలు అరిచేతులు పెట్టుకున్నట్టు ఉండేవారు. Anyway , ఆ ఏడుపుని నా పాటలు అస్సలు ఆపేవి కాదు. దాంతో పాటలు పాడటం కొన్ని రోజులు మానేసాను. ఎవరో చెప్పారు కొంచెం secure గా బ్లాంకెట్ లో చుట్టి పెడితే కాళ్ళు చేతులు ఆడించకుండా పడుకుంటారు, అది కొలిక్ తగ్గిస్తుంది అని. అందుకని "burrito wrap " చేసి పడుకోపెట్టేవాళ్ళం. ఒకరోజు అల్లాగే చుట్టి ఎత్తుకుని ఊపుతుంటే, నేను ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు "Moe 's " లో తిన్న burrito గుర్తొచ్చింది. నాకు తెలీకుండానే ఒక పాట/కవిత వ్రాసేసి, పాడేశా. ఆశు కవిత్వం అంటారు కదా? ఆ టైపు లో. వదల మంటారా. అనఖర్లె. ఇదిగో.

పల్లవి:"చిన్న బరిటో, చిట్టి బరిటో, పొట్టి బరిటో, టుట్టి బరిటో"
అనుపల్లవి:"నిన్ని బరిటో, బన్ని బరిటో, డిన్ని బరిటో, మిన్ని బరిటో"

Guacamole ఉందా? బ్రౌన్ రైస్ ఉందా?
గ్రీన్ బీన్స్ ఉన్నాయా? పెప్పర్స్ ఉన్నాయా? "చిన్న"

కారట్స్ ఉన్నాయా? చిల్లీస్ ఉన్నాయా?
టోమాతోస్ ఉన్నాయా? సాల్సా ఉందా?  "చిన్న"

olives ఉన్నాయా? cucumbers ఉన్నాయా?
sour క్రీం ఉందా? cilantro ఉందా? "చిన్న"

ఎక్కడనించి వచ్చావు? mexico నా? puerto rico నా?
taco బెల్లా? చిపోట్లే నా? "చిన్న"

రా బరిటో , కూర్చో బరిటో
పడుకో బరిటో, నిద్రపో బరిటో
చిన్న బరిటో చిట్టి బరిటో
యమ్మి బరిటో ...... అమ్మ బరిటో

ఎలా ఉంది మన టాలెంట్? అలా తప్పట్లు కొట్టకండి. నాకసలే modesty ఎక్కువ బాబు.
అబ్బో అసలు నేను... ఆజ్జ బాబో (మెలికలు తిరిగి పోతున్న నేను)

Thursday, May 19, 2011

మాతృత్వం : "The fun begins"

2009 లో నా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి ఇరవై ఒకటో రోజు ఫంక్షన్ కి వాళ్ళ ఊరు (బోస్టన్) రమ్మని పిలిచింది. ఆవేళ స్నో ఉండటం తో మేము తప్ప ఇంకెవ్వరు రాలేదు. వాళ్ళ అమ్మగారు ఆరోజు బాబుని తొట్టిలో పెట్టిన తరవాత నన్ను , సంధ్యని నిలపెట్టి ఒక బకెట్ లో నీళ్ళు పెట్టి, బావిని simulate చేసి, సంధ్య తో నాకు తాంబూలం ఇప్పించి, నా వీపు మీద దానితో రెండు సార్లు కొట్టించి, తాంబూలం లో పెట్టిన ఒక లడ్డు, వెల్లుల్లి నన్ను మా ఆయన్ని తినేయ మన్నారు. ఆ లడ్డుని కాయం అంటారని, అవి తింటే పిల్లలు పుడతారని చెప్పారు. ఇది నాకు ముందే మా అమ్మ చెప్పడం తో ఇంటికి వచ్చాక ఇద్దరం ఆ లడ్డూ ముక్కని నోట్లో వేసుకున్నాం. అంతే, మా ఇద్దరి మొహాలు చూడాలి. అందులో స్వీట్ తప్ప ప్రపంచం లో ఉన్న వేరే రుచులన్నీ ఉన్నాయి. ఘోరం గా ఉంది. సరే వెల్లుల్లి పులుసులో వేసేసుకున్నాం. మూడు నెలల తరవాత నేను కన్సీవ్ అయ్యాను. అందరూ అది కాయం ప్రభావమే అన్నారు. నేనైతే దేవుడి దయ అనుకున్నాను. ఆగష్టు ఇరవై ఐదో తారికున అమ్మ, నాన్న పొద్దున్నపదింటికి వస్తారని వంట చేసి ఇంటర్నెట్ లో ఎయిర్ ఇండియా వెబ్సైటు తెరిచాను. బొంబాయి నుంచి బయలు దేరే ఫ్లైట్ ఆలస్యమవడంతో మరి అసలు ఫ్లైట్ లో ఉన్నారో లేదా ఫ్లైట్ మిస్ అయ్యి తరవాతి ఫ్లైట్ కి వస్తున్నారో అని ఆలోచిస్తుంటేనే సాయంత్రం నాలుగైపోయింది. నాకు టెన్షన్ మొదలయ్యింది. JFK కి వచ్చి connecting delta ఫ్లైట్ లో అట్లాంటా రావాలి. ఆలోచిస్తూ, ఎయిర్ ఇండియా కి ఫోన్లు చేస్తుండగానే సాయంత్రం ఆరయ్యింది. ఫోన్ల సారాంశం ఏంటంటే అమ్మా, నాన్న బొంబాయి లో ఫ్లైట్ ఎక్కారు కాని delta ఫ్లైట్ ఎక్కలేదు. ఎం చెయ్యాలో అర్ధం అవ్వట్లేదు. ఆరున్నరకి మా అమ్మ ఎవరి ఫోన్ లోంచో కాల్ చేసి ఇప్పుడే అట్లాంటా ఐర్పొర్ట్ లో దిగాము వచ్చి మమ్మల్ని తీసుకెళ్ళు అని చెప్పింది. ఇంత పెద్ద పొట్ట వేసుకుని వెళ్ళిన నన్ను చూసి మా అమ్మ మురిసిపోయింది. నాన్న మోహంలో ఆనందం. emotions ని కళ్ళల్లోనే చూపిస్తారాయన. పెదవుల మీదకి ఎప్పుడు తీసుకురారు.
ఇక వాళ్ళు చెప్పిన ప్రయాణపు పదనిసలు:
JFk లో దిగగానే ఎయిర్ ఇండియా వాళ్ళు టికెట్స్ చేతికిచ్చి, మీ ఫ్లైట్ మిస్ అయ్యింది, మీకు అమెరికన్ ఎయిర్ లో తికెట్ తీసుకున్నాము, ఫలానా గేటు కి వెళ్ళండి, మీ suitcase మేము అమెరికన్ ఎయిర్ కి పంపిస్తాము అని చెప్పాడట. వీళ్ళు అమెరికన్ ఎయిర్ కి చెక్ ఇన్ కి వెళ్తే, వాళ్ళు ఈ ఫ్లైట్ ఇక్కడ నించి కాదు, లగాడియా airport నించి అని చెప్తే అమ్మా నాన్న ఐర్పొర్ట్ నించి బయట పడి, shuttle లో లగాడియా చేరుకున్నారు. అప్పటికే boarding మొదలయ్యింది. అట్లాంటా లో వాళ్ళ బాగ్స్ కనిపించలేదు. అమెరికన్ ఎయిర్ వాళ్ళేమో ఫిరియాదు నమోదు చేసుకున్నారు. నేను వెళ్లి కూడా మళ్లీ అన్ని వివరాలు చెప్పి మొతానికి బయట పడ్డాం. దారిలో నాకు అర్థం అయిపోయింది వాళ్ళ మనసంతా సామాను మీదే ఉందని. వాళ్ళని ఆ టాపిక్ నుంచి divert చెయ్యటం నా వల్ల కాలేదు. ఇంకా చూసుకోండి ఎయిర్ ఇండియా కి, అమెరికన్ ఎయిర్ కి రెండు రోజులు ఏక బిగిన ఫోన్లు. మొతానికి తేలింది ఏంటయ్యా అంటే, బాగ్గులు JFK లోనే ఉన్నాయి. చివరికి మూడు రోజుల తరవాత అవి మాదగ్గరకి చేరాయి.
అప్పుడింక అమ్మ సీమంతం preparations మొదలుపెట్టింది. మా ఆయన ఇక్కడ ఉండరు కాబట్టి, డెలివరీ టైం కి తను లీవ్ తీసుకోవాలి కాబట్టి ఇప్పుడు తీసుకోవటం కుదరదు కాబట్టి చిన్నగా పూర్తి చేసేద్దాం అని డిసైడ్ అయ్యాం. సరే శనివారం అని అనుకున్నాక ఆఫీసు లో పిలవాల్సిన వాళ్ళందరికీ ఈమెయిలు పంపించాను. మా ఆయనేమో ఆ వారాంతం డ్రైవ్ చేసి ఆదివారం మధ్యాన్నం కి వచ్చేస్తానన్నారు. బుధవారం కొంచెం discomfort అనిపిస్తే, డాక్టర్ ఆఫీసు కి ఫోన్ చేసాను. మీ డాక్టర్ ఇవ్వాళ్ళ డ్యూటీ లో లేరు, వేరే ఆవిడ ఉన్నారు, ఒకసారి వచ్చి చెక్ చేయించుకోండి అంటే వెళ్లాను. ఆ డాక్టర్ నాకు "this is not labor. labor is a lot more severe than this. When you are in labor, you will know . They call it labor for a reason. come back if your contractions are five minutes apart" అని పెద్ద క్లాస్ తీసింది. సరే కాబోలు అనుకుని ఇంటికెళ్ళాను. అసలు contraction అనగానేమి? తెలీదు. ఎందుకంటే, హాస్పిటల్ లో చెప్పే క్లాసులకి నే వెళ్ళలేదు. ఎందుచేత? సింపుల్. భయం వేసి. labor ఎలా ఉంటుందో తెలుస్తే భయం వేస్తుంది, "ignorance is bliss" అన్న టైపు లో ఉండి పోదాం అని. సరే గురువారమ సుబ్భరంగా సాయంత్రం ఆరున్నర వరకు వర్క్ చేసి ఇంటికోచేసా. నేను చేస్తున్న ఇంకో పనేంటంటే ప్రతి రోజు పది-పదిహేను నిమిషాలు ట్రైన్ స్టేషన్ కి నడిచి వెళ్లి ట్రైన్ ఎక్కటం, మళ్లీ సాయంత్రం తిరిగి ట్రైన్ దిగి నడిచి రావటం. సరే గురువారం ఇంటికొచ్చి అమ్మ పెట్టిన అన్నం కూర తిని అమ్మ తెచ్చిన చేకోడిలు, లడ్లు (అవును, లడ్లె, ఒక లడ్డు కాదు, ఏకంగా నాలుగైదు) ప్లేట్లో పెట్టుకుని కంప్యూటర్ మోదేసుక్కూచున్నా. రాత్రి పదిన్నరకలా కడుపులో ఒక టైపు లో నొప్పి మొదలయ్యింది. అది రాత్రంతా ఉండి, పోద్దున్నకేక్కువయ్యింది. రాత్రి మొత్తం బాత్రూం లోకి వెళ్ళాలని అని పిస్తోంది కాని ఏమి అవ్వట్లేదు. అనవసరం గా లడ్లు తిన్నానేమోరా బాబు, కడుపు అప్సెట్ అయ్యినట్టుంది అనుకున్నా.సరే పొద్దున్నే ఉద్యోగానికి పోవాలి కదా? దానికి తోడు మీటింగ్ ఒకటి అటెండ్ అవ్వాలి. "అవసరం అయితే టాక్సీ లో వెళ్లి పోతాను" అని అమ్మ తో చెప్పి, స్నానానికని బాత్ రూం లో దూరా. స్నానం చేస్తుంటే lower stomach లో తిమ్మిరి టైపు ఫీలింగ్, నొప్పి (= contraction ). బయటకి వచ్చాక మా అమ్మ "వెధవ గోల జుట్టు విరబోసుకు తిరుగుతారు. ఎ దిష్టి అయినా తగిలిందేమో. ఉండు ముందు సుబ్భరంగా నునే రాసి జడ వేస్తాను" (మా అమ్మ సుబ్బరం గా నూనే అంది అంటే ఆరోజు నన్ను స్కూల్ లో అందరు "మీ నాన్న కొత్త నునే ఫ్యాక్టరీ కొన్నారా అని ఏడిపించే వారు"). "అమ్మా నొప్పెడుతోంది, మీటింగ్ కి వెళ్ళాలి, అన్నం పెట్టు, జడ తరవాత". "బేబీ తల descend అవుతోందేమో, ఇవి నొప్పులే అయితే సీమంతం చెయ్యడం కుదరదు. ఒక్కసారి పట్టు చీర కట్టేసుకోవే. నాన్న ఫోటో తీసేస్తారు" "అమ్మా ప్లీజ్ నొప్పెడుతోంది, కళ్ళు తిరుగు తున్నాయి. ఎం చెయ్యనే". "ముందు దానికి ఒక బిస్కెట్ ఇచ్చి కూర్చో పెట్టు, పాపం నొప్పి అంటోంది కదా" ఇది మా నాన్న. మా తోటి కోడలికి ఫోన్ చేసాను. ఆవిడేమో "ఏమి పరవాలేదు. due డేట్ ఇంకా పదిహేను రోజులుంది కదా? కొంచెం మంచి నీళ్ళు తాగి పడుకోండి. తగ్గి పోతుంది". ఎందుకైనా మంచిది అని సెల్ ఫోన్ పుచ్చుకుని contractions టైం చేశా. మొదట పది నిమిషాల కొకటి, తరవాత ఏడు నిమిషాల కొకటి ఇంకొంచెం సేపయ్యాక మూడు నిమిషాల కొకటి. ఇది లాభం లేదని డాక్టర్ ఆఫీసు కి ఫోన్ చేశా.
నర్స్: మీ పేరు
నేను: కిరణ్మయి
నర్స్: స్పెల్లింగ్ చెప్పండి
నేను: k-i-r-a-n, n for nancy, m for monkey.......
నర్స్: సోషల్ సెక్యూరిటీ నెంబర్
నేను: నీ మొహం మండా నాకు నొప్పి పెడుతోంది తల్లొఇ (మనసులో)
నర్స్: ఎన్ని నిమిషాలకొక ..........
మా అమ్మ: ఇదేక్కడ గొడవే. నంబర్లు చెప్తూ కూచుంటే ఎలా?
.......................
నర్స్: ఇప్పుడు ఆఫీసు కి రాగాలుగుతారా?
నేను: వస్తున్నా తల్లి. ఇదిగో ఇప్పుడే.
కాని ఎందుకో టాక్సీ పిలవాలని పించక అంబులన్స్ కి ఫోన్ చేశా. paramedics వచ్చినప్పుడు మా appartment వాళ్ళు చూసి, మా నాన్నని హాస్పిటల్ దగ్గర దింపటానికి వచ్చారు. నాకు తెలిసిన తమిళ్ అమ్మాయి ఇల్లు తాళం వేస్తానంది. హాస్పిటల్ కి వెళ్ళగానే నొప్పి భరించలేక గట్టి కేక పెట్టా. అందరు వింతగా చూసారు. I don't give a damn అనుకుని మళ్లీ నొప్పేట్టగానే ఇంకా గట్టిగా అరిచా. అప్పటికి నన్ను రూం లోకి తీసుకెళ్ళి పొయ్యారు. నర్స్ ఒకమ్మాయి టిక్కు టక్కు లాడించుకుంటూ వచ్చి "నొప్పులంటే అల్లానే ఉంటాయి. అరవకు" అని కొట్టినట్టు చెప్పింది. నువ్వు నాకు మళ్లీ కనపడక పోతావా అనుకుని పంటి బిగువన నొప్పి ఒర్చుకోవటానికి ట్రై చేశా. ఇంతలో ఇంక్కావిడ వచ్చి"నీ పేరు ఎలా ప్రొనౌన్స్ చెయ్యాలి?" అంది. నా పేరు చెప్పించే టప్పటికి నాలో ఉన్న సహనం కాస్త నశించింది. ఇక వీర లెవెల్ లో నొప్పి మొదలయ్యింది. పేరు అడిగిన అమ్మాయి "పుష్ కిరణ్మయి , పుష్" అని అరవటం, డాక్టర్ ఒకటి నించి పది లెక్కపెట్టటం, "ఒర్చుకోమ్మా ఇంకొంచెం సేపే" అని మా అమ్మ చెప్పటం, నా బాధ చూడలేక మా నాన్న రూం లోంచి బయటకి వెళ్ళటం, "ఐ కెన్ సి యువర్ బేబీ'స్ హెడ్" అని డాక్టర్ అనటం, నాలో బరువేదో అమాంతం తగ్గి పోవటం, నేనో పెద్ద గమ్యం సాధించినట్టు అందరు అరవటం, "హియర్, సి యువర్ బేబీ" అని ఎవరో అనటం, మా అమ్మ కళ్ళ నీళ్ళు పెట్టేసుకోవటం, అంతా ఒక నలభై నిమిషాల్లో జరిగి పోయింది. మా అమ్మ దగ్గర ఫోన్ తీసుకుని మా ఆయనకీ ఫోన్ చేశా "బేబీ ఇస్ హియర్. స్టార్ట్ డ్రైవింగ్" అనగానే కుర్చీలో ఒక్కసారి కూర్చుండి పొయ్యి "I don't know what to say. give me a minute" అన్నాడు తను. ఇంకేం అంటాడు?