Sunday, April 25, 2010

బాబోయి మల్టీ లెవెల్ మార్కెటింగ్ 2


సరే. ఒక రోజు International Farmer మార్కెట్ కి వెళ్ళా. మిరప కాయలు ఎరుతుంటే నా పక్కనే ఒక తెలుగు దంపతులు నిలబడ్డారు. ఒక నల్ల షర్టు అబ్బాయి వచ్చి "excuse me where is the nearest walmart" అన్నాడు. వేల్లేదో చెప్తుంటే నాకెందుకో అనుమానం వచ్చి తప్పుకున్నా. రెండు వారాల తరవాత మల్లి వెళ్ళినప్పుడు అదే అబ్బాయి ఇంకొక తెలుగు జంట కి సుత్తి వేస్తున్నాడు. సరేలే మనదగ్గరకొస్తే చూద్దాం అని నా పని నే చేసుకు పోతున్నా. ఇంతలో ఇంకొక అతను వచ్చి ఆవిడ తో "బయలు దేరుదామా అండి, చాలా లేట్ అయ్యింది" అంటే వాళ్ళు అతని దగ్గర నుంచి తప్పుకున్నారు. తరువాత వాళ్ళు అతనితో "కరెక్ట్ టైం కి వచ్చారండి. గంట నించి భరించ లేక చస్తున్నాం. జిడ్డు లాగ వదిలి పెట్టడు" అన్నారు. నేను ఎప్పుడు శనివారం నాలుగు గంటల టైం లో వెళ్ళేదాన్ని. దాదాపు ప్రతి సారి కనిపించేవాడు. కాని నాతో ఎప్పుడు మాట్లాడలేదు. ఒకసారి నేను మా ఆయనా వెళ్ళాం. మిరపకాయల దగ్గరే "excuse me " అని వినిపించింది. చూస్తే మన ఫ్రెండు. మా ఆయన దగ్గర కొచ్చి"వేర్ ఇస్ ది నేఅరేస్ట్ వాల్మార్ట్" అన్నాడు. ఓరిని యాడాది నించి వాల్మార్ట్ వెతుకుతున్నావా నాయనా అనుకుని, మా ఆయనకీ భరతనాట్యం లో సైగలు చేసాను. ఇప్పటికే ఈ శాల్తి గురించి చెప్పానేమో, మా ఆయన "ఐ డోన్ట్ నో" అన్నారు.
పట్టువదలని విక్రమార్కుడు: "are you new to this place"
మా ఆయన:"kind of "
ప వి: "where do you work "
మా ఆ:"I don 't work "
ప వి:"సో యు are a student "
మా ఆ:"yeah "
ప వి:"what are you studying ?"
మా అ:"పి హెచ్ డి "
ప వి:"ఇస్ ఇట్ ట్రు దట్ యు పీపుల్ గెట్ paid a lot "
మా ఆ: "హి హి హి"
ప వి:"she is your missusఆ?" (నన్ను చూపించి)
యింక నాకు ఒళ్ళు మండి మా ఆయన కేసి చూసి "షాల్ వి గో?" అన్నాను. తెలుగు మాట్లాడితే తెలుగు లో కొడతాడని నా భయం.
మొత్తానికి ఫోన్ నెంబర్ ఇవ్వ కుండా బయట పడ్డాం. ఆ తరవాత ఆ మార్కెట్ తీసెయ్యడం తో వేరే చోటికి వెళ్తున్నాను. అక్కడెందుకో కనిపించటం లేదు.

ఒక రోజు ట్రైన్ లో వెళ్తుంటే ఒక దేశి అబ్బాయి ఎక్కడో చూసినట్టు కనిపిస్తే రెండు మూడు సార్లు అతని వైపే చూసాను. అతను నన్ను చూడగానే చాలా ఇబ్బంది గా అనిపించి "I am sorry I did not mean to stare at you. You look very familiar" అంటే అతను నావైపు ఒక లుక్కిచ్చి "yeah you are from so and so marketing right" అన్నాడు. "No I am not" అని అతనితో గట్టిగా అన్నానే కాని చాలా సిగ్గనిపించింది. ఈ మార్కెటింగ్ ల పుణ్యమా అని మన దేశీయులు కనిపిస్తే కనీసం నవ్వటానికి కూడా లేదు.
ఇలాంటి అనుభవాలు ఫ్రండ్స్ చెప్పినవి ఎన్నెన్నో. మాల్స్ లో, వాల్మార్ట్ లో ఇంకా చాల చోట్ల. ఈ గొడవేమిటో, ఎప్పుడాగుతుందో? దార్లో నిలబెట్టి మనుషుల్ని ఇబ్బంది పెట్టటం ఎప్పుదాపుతారో ఏమో? మీకు ఉన్నాయా అనుభవాలు. అయితే చెప్పండి మరి.
అసలు నాకేమనిపిస్తోందంటే వీసా stamping అవ్వంగానే ఇక్కడికొచ్చే జనాలకి ఈ విషయం మీద క్లాసు తీసుకుని పంపిస్తే బెటర్ అని. ఏమంటారు?

బాబోయి మల్టీ లెవెల్ మార్కెటింగ్



హైదరాబాద్ లో ఒక సాయంత్రం. నేను మా అమ్మా పెద్ద పనేమీ లేదని ఇంట్లో హస్కు మాట్లాడుకుంటున్నాం. ఇంతలో మా మేనత్త గారి అబ్బాయి వచ్చాడు. పిచ్చా పాటి అయ్యాక "మను రేపు అమెరికా నించి వస్తోంది అత్తమ్మా. బిజినెస్ పని మీద వస్తోందట ఎక్కువ రోజులు ఉండనని చెప్పిందట" అన్నాడు. ఈ మను మాకున్న చాలాఆఆఆఆఆఅ మంది కజిన్ లలో ఒకామె. మా అమ్మ జీవితం లో రెండిటికి చాలా భయపడుతుంది. ఒకటి దేవుడు, రెండోది బిజినెస్. మా ఇంట్లో కొందరు సొంత బిజినెస్ లు పెట్టి నష్టపోవటం తో మా అమ్మ భయం చాల ఎక్కువైంది. మేమేప్పుడైన పొరపాట్న బిజినెస్, investments లాంటి మాటలు మాట్లాడితే "ఎస్తేస్తా" అన్నట్టు చూస్తుంది. సరే ఈ కజిన్ బిజినెస్ విషయం లో నాకు curiosity పెరిగింది. చాలా మైల్డ్ గా ఉండే అమ్మాయి అసలు బిజినెస్ ఎలా చేస్తోందబ్బా? అసలు ఏమిటి బిజినెస్? ఏమా కధ? మా బావ నడిగితే,"ఏదో _____________ బిజినెస్ అట, మనం ఏదో కొని ఇంకొకళ్ళకి అమ్మాలట, అప్పుడు ఆ కొన్న వాళ్ళు కూడా అ బిజినెస్ లో చేరినట్టు అట. అలా నీ కింద లెవెల్ వాళ్ళు ఎంత మందిని చేర్చుకుంటే నీకు అంత ప్రాఫిట్ అట" అంటూ తనకి తెలిసినదేదో చెప్పాడు. సరేలే మనకెందుకులే అని నేను ఊరుకుంటుంటే "మీరు కూడా చేరతారా అత్తమ్మా? మేమందరం కూడా దాని గురిచి తెలుసుకుని చేరదామనుకున్తున్నాం" అన్నాడు. మా అమ్మకి టెన్షన్ వచ్చి "వద్దులే. నాకేందుకోచ్చిన బిజినెస్లు" అంది కాని రెండు రోజులు మా అమ్మ కి నిద్దరపట్టలేదు. తన అత్తగారి వైపు వాళ్ళందరూ తనని బిజినెస్ చెయ్యమని పీడిస్తున్నట్టు మా అమ్మకి ఆ రోజుల్లో కలలు వచ్చాయేమోనని నాకైతే అనుమానమే. సరే మా కజిన్ వచ్చి వెళ్ళిపోయింది. ఏదో ________ మాటలు సాగాయి కాని నేను పెద్ద పట్టించుకోలే. ఇద్దరు ముగ్గురు కజిన్లు చేరారు అందులో. మద్రాస్, బంగళూరు లాంటి చోట్లకి మీటింగ్స్ కి వెళ్తున్నామనేవారు, అక్కడ షాపింగ్ లు చేసేవారు. అంతా నడుస్తోంది. మా అమ్మ అందులో ఒకరిని అడిగితే మొత్తం మీద ఎం చెప్పారో తెలీదు కాని ఏదో డిష్ వాషింగ్ సోప్ మాత్రం నాలుగు వందలు చెప్పారట. ఇది 1997 లో మాట.
కట్ చేస్తే ......
నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఒక సారి మను వాళ్ళింటికి వెళ్లాను. ఒక రూం నిండా ____ సామాన్లె. stationary , కాస్మెటిక్స్ ........ అన్ని. వాళ్ళింట్లో ఆ రోజు చాలా మంది వచ్చారు. పార్టీ కాదు కాని ఏదో బిజినెస్ కి సంబంధించిన gathering . అంతా బాగా డబ్బున్న వాళ్ళలాగే ఉన్నారు. ఎవ్వరు పెద్ద బాధ పడుతున్నట్టు అనిపించలేదు. మను నాతో ఎప్పుడు దీని గురించి మాట్లాడలేదు. ఇప్పుడనిపిస్తోంది, "బిజినెస్ లో చేరు, చాలా డబ్బు సంపాదిన్చులోవచ్చు," అంటూ నాకు చెప్తే నేను అక్వర్డ్ గా ఫీల్ అవుతానేమోనని చెప్పలేదేమో బహుసా.
మళ్లీ కట్ చేస్తే ...
మనం graduate అయ్యి ఊళ్లు ఏలటం మొదలు పెట్టాం. వేరే ఊరు షిఫ్ట్ అయిన కొత్తలో, నన్ను ఇక్కడ సెటిల్ చెయ్యటానికి మా అయన (అప్పుడు మా ఆయన కాదు లెండి) వాళ్ళ తమ్ముడు, కజిన్, భార్య వచ్చారు. టీవీ కొనుక్కుందామని వాల్మార్ట్ వెళ్లాం. వెళ్తుంటే, కార్ లో సంభాషణ _________ మీదకి మారింది. Conversation :
ఒకరు: అమ్మో. వాళ్ళ గొడవ పడలేం బాబు. రోడ్డు మీద ఎక్కడ పడితే అక్కడ ఆపేస్తారు.
ఇంకొకరు: మా కాలేజీ లో __________ వాల్లోస్తున్నారంటే, కిటికీ లో నించి చూసి తలుపులు తీసేవాళ్ళం కాదు.
మరొకరు:"ఒకసారి ఇలాగే నేను, విజయ్ మాల్ కి వెళ్ళినప్పుడు ఒకతను విజయ్ ని "మిమ్మల్నేప్పుడో చూసినట్టుంది" అంటూ మాట కలిపాడు. విజయ్ వాడికి ఫోన్ నెంబర్ ఇచ్చాడు. ఆతరవాత యాడాది పాటు రోజు ఫోన్లె. ______ చేరతావా? అని.
సరే వాల్మార్ట్ చేరాక, మా ఆయనా వాళ్ళ కజిన్ ఒక వైపుకి వెళ్తే, మిగతా ముగ్గురం ఇంకో వైపు వెళ్లాం. కొంచెం సేపైయ్యాక "హాయ్" అని పలకరింపు వినిపించింది. వెనక్కి తిరిగి చూస్తే ఒకతను నవ్వుతు చూస్తున్నాడు. మేము నవ్వితే "do you know the way to the nearest target" అన్నాడు. నేను "we are new to this place" అంటే, "I am new here too. can I get your phone number so we can keep in touch" నా చేతిలో సెల్ ఉంది. నాదగ్గర ఫోన్ లేదని చెప్పటానికి లేదు. నీ నెంబర్ ఇవ్వు బాబు ఆ టచ్ లో ఏదో నేనే ఉంటాను అని చెప్పబోఎంతలో నా కాలి మీద ఏదో పాకినట్టని పిస్తే కిందకి చూసా. మా మరిది నా కాలి మీద తడుతున్నాడు. stranger కి నెంబర్ ఇవ్వకు అని చెప్తున్నా డెమో అనుకుని కళ్ళ తోటే భరతనాట్యం చేసి మొత్తానికి ఆ అబ్బాయి నెంబర్ తీసుకుని బయట పడ్డా. ఇంతలో మా ఆయనకీ నాతో ఉన్న మా తోటి కోడలు ఫోన్ చేసేసింది "ఇక్కడ వీడెవడో మమ్మల్ని ఫోన్ నెంబర్ అడుగుతున్నాడు" అని. అందరు నన్ను తిట్లు. నేనేమో ఫోన్ నెంబర్ ఇవ్వలేదు కూడా. మా మరిదేమో వాడు ______ వాడేమో అని నీకు సైగ చేస్తున్నా అర్ధం చేసుకోవేంటి? అంటాడు. కాలి మీద వ్రాస్తే అర్ధమవుతుందా? మేము వెళ్లి పోతుంటే పక్కనే ఉన్న స్టార్ట్ bucks లో ఆ అబ్బాయి దాదాపు పది మంది తో కాఫీ తాగుతూ కనిపించాడు.
మిగతా అనుభవాలు తరవాతి పోస్ట్ లో.


Saturday, March 27, 2010

నాక్కొన్ని డౌట్లు


చిన్నప్పుడు నేను, మా తమ్ముడు రాఘవేంద్ర స్వామి గుడి కి తరచు వెళుతూ ఉండేవాళ్ళం. అమ్మ మా తమ్ముడికి ఎప్పుడు చెప్పేది "తీర్ధం తీసుకున్నాక, కాళ్ళు మొత్తం జాపి సాష్టాంగం చెయ్యి. చేసేటప్పుడు కళ్ళజోడు తీసెయ్యి " అని. నేనైతే బుద్ధిగా సరే అనేదాన్ని. మరి నేను కదా, అందుకని. మా వాడు మాత్రం, "ఎందుకు? ఎవరు చెప్పారు తియ్యమని" అనేవాడు. మా అమ్మకి మండిపోయ్యి "చెప్పిన పని చెయ్యి. పిచ్చి ప్రశ్నలు నువ్వును. మొన్న ఎవరో టీవీ లో శంకరాచార్యుల వారు అలా చెప్పారని చెప్పారు" అంటే, "అసలు శంకరాచార్యులవారు BC టైం లో ఉండేవారు కదా? ఆ రోజుల్లో జనాలకి కళ్ళజోడు ఉండేదా?" అని వీడు మళ్ళి ఆర్గుమెంటు. మా అమ్మకి విసుగొచ్చి లోపలి వెళ్లి పొయ్యేది.
నిజానికి ఇలాంటివి పిచ్చి డౌట్లు కాదు. మనకి తెలిసిన ఇన్ఫర్మేషన్ తక్కువవటం వాళ్ళ ఇలా జరుగుతుండచ్చు. ఇలాంటి డౌట్లు నాకు వస్తాయి కొన్ని సార్లు. ఇప్పుడు మాత్రం రెండింటిని గురించి వ్రాస్తాను. నాకు sincere గా వచ్చిన సందేహాలివి. మన పురాణాలని, culture ని కించపరచటానికి మాత్రం నేను ఇవి వ్రాయట్లేదు సుమా. అపార్ధం మాత్రం చేసుకోకండి.
వినాయక చవితి రోజు కధలో కృష్ణుడి నీలాప నిందల కధ ఉంటుంది. అందులో జాంబవంతుడు సమంతక మణి తన కూతురి ఉయ్యాల మీద కట్టటానికి తీసుకెల్తాడని ఉంటుంది. కృష్ణుడితో యుద్ధం అయ్యాక ఆ కూతురినే ఆయనకిచ్చి పెళ్లి చేసేసాడని ఉంటుంది. ఉయ్యాల లో పడుకునే పాపకి అప్పుడే పెళ్ళేంటి? లేకపోతే ఇది చెట్టుకు కట్టుకుని teenage అమ్మాయిలు ఊగే ఉయ్యాలా? అలా అయితే మణి ఎందుకు?
చందమామ లో చదివే కధల్లో చాల మటుకు చదివేవాళ్ళం ఎవరో ఒక ముని లేకపోతే రాజు వీర లెవెల్ లో తపస్సు చేస్తుంటే ఇంద్రుడు వచ్చి disturb చేసేస్తాడు అని. వేరే వాళ్ళు తపస్సు చేస్తుంటే ఆయనికి ఎందుకంత ప్రాబ్లం? ఇదే మాట నేను మా ఫ్రెండ్ తో అంటే తనన్నాడు, "according to some schools of thought, ఇంద్రుడు అనేది ఒక పదవి లాంటిది, సో ఆ పదవి పోతుందేమో అని current ఇంద్రుడికి ప్రాబ్లం అయ్యుండచ్చు" అని.
పైన నేను చెప్పినట్లు, నాకు తెలియని పురాణాలు ఇక్కడ ఉండొచ్చు. సో మీకు తెలిస్తే నా సందేహాలు తీరుస్తారని ఆశిస్తున్నాను.
మనవి: దయచేసి మూఢ నమ్మకాలపై మీ అభిప్రాయాలని ఇక్కడ కామెంట్స్ లో వ్రాయవద్దని మనవి. అలాగే, ఇది నేను సరదాకి వ్రాసిన పోస్ట్. ఎవ్వరిని కించ పరచటానికి మాత్రం కాదు. మీకు నచ్చక పోతే, మన్నించమని మనవి అంతే కాని offensive కామెంట్స్ మాత్రం పెట్టకండి.

Thursday, January 21, 2010

Frustration ఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆ


మొన్న, మొన్ననే హైదరాబాద్ లో బుక్ ఫెయిర్ అయినప్పుడు నేను కష్టపడి వ్రాసుకున్న పుస్తకాల లిస్టు అమ్మకిచ్చి తెమ్మన్నానా? అప్పుడు అమ్మ, నాన్న నా కోసం తిరిగి నేను అడిగిన పుస్తకాలు (అవి దొరకక పోతే పుబ్లిషెర్ కి ఫోన్ చేసి మరీ కనుక్కుని) కొని తెచ్చారా? మా అమ్మేమో, "అన్ని పుస్తకాలు పోస్ట్ లో నేను పంపించను, వచ్చే నెల మీ తోటికోడలు వాళ్ళ అమ్మ వస్తోందిగా, ఆవిడతో పంపిస్తాను. మీ అత్తగారికిస్తాను, ఆవిడ చెప్తే తీసుకెళ్తుంది లే పరవాలేదు. మేమోచ్చినప్పుడు పట్రామేంటి? దానితో బాటు అరకిలో ఆవకాయి, అరకిలో మాగాయి పంపిస్తాను" అని నన్ను irritate చేస్తోందా?
ఇప్పుడేమో కల్పన గారేమో, అసలు కధంటే ఏంటి? దాన్ని ఎలా చదవాలి, పరిగెడ్తు చదవకూడదు మెల్లగా ఆస్వాదించాలి అంటూ lecture లు. పైగా సుజాత గారు, నెమలికన్ను మురళి, లలిత వీళ్ళందరూనేమో మేము ఈ బుక్ చదివాం, ఆ బుక్ చదివాం, ఆహా, ఓహో అంటూ బ్లాగ్ పోస్ట్లు. ఈ కొత్త పాళీ గారేమో మెల్లగా ఒక బుక్ వ్రాసేసి, గమ్మున ఇండియా వెళ్లి, ఆవిష్కరించేసుకుని వచ్చేసి అసలు ఆ బుక్ ఏంటి, అమెరికా లో ఉన్న వాళ్లకి ఎలా దొరుకుతుంది అని చెప్పనైనా చెప్పకుండా, పైగా "కీ బోర్డ్ దుమ్ము దులపండి, చెలరేగి పొండి" అంటూ రెచ్చగొట్టటం. అసలేమైనా బాగుందా? అహ, బాగుందా అంట?
నాక్కోపమోచ్చేస్తోన్దంతే. frustration రాకపోతే ఏమవుతుంది? మీరైనా చెప్పండి.

Friday, January 8, 2010

పలువురు తమిళులు - ఒక తెలుగు: న్యూ ఇయర్ పార్టీ


ఇప్పుడే సునీత గారి "వేర్ ఇస్ ది పార్టీ" పోస్ట్ చదివి కామెంట్ చేద్దామనుకున్నా. కాని చాలా పెద్ద కామెంట్ అవుతుందని నేనే పోస్ట్ తున్నా.
ఈ సారి న్యూ ఇయర్ వీకెండ్ కి మా మరిది వాళ్ళ ఊరు వెళ్లాం. వెళ్ళే ముందు రోజు చెప్పారు వాళ్ళు నాకు ఎవరింట్లోనో పార్టీ ఉంది ముప్ఫై ఒకటిన అని. వాళ్ళ ఫ్రండ్స్ అందరికి ఒక గూగుల్ గ్రూప్ ఏదో ఉంది. అది ఓపెన్ చేసి ఇవాళ్ళ పార్టీ కి ఎవరెవరు వస్తారు,వాళ్ళ ఫోటో లు, వాళ్ళు దేని గురించి మాట్లాడతారు అని గురువారం పొద్దున్న నిద్దర లేవగానే మా తోటి కోడలు వివరించి చెప్పసాగింది. మా అయన ఊరుకోక "ఎప్పుడు వెళ్ళాలి" అనడిగారు. వాళ్ళింటికి వెళ్లాం, వాల్లెప్పుడు తీసికేల్తే అప్పుడే వెళ్లోచ్చుగా? మా తోటి కోడలు అంది "ఆరింటికి రమ్మన్నారు, ఏడు గంటలకల్లా బయలుదేరదాం" ఆ లాజిక్కు నాకర్ధం కాలేదు. కాకపోతే నాకు ఇక్కడ పార్టీల గురించి ఎక్కువ తెలీదు. హైదరాబాద్ లో అయితే "రేపు సాయంత్రం మా ఇంటికి భోజనానికి రండి" అని పిలిస్తే బాగా తెలిసిన వాళ్ళైతే, లేదా పిన్నులూ, మామయ్యలు ఆ టైపు లో అయితే మా అమ్మ నాలుగు గంటలకే బయలుదేరేది "వాళ్లకి వంట కి సాయం అవసరం అవుతుందే పాపం" అని. అంతగా తెలీని వాళ్ళైతే ఆరు గంటలకి వెళ్ళేవాళ్ళం మాట్లాడుకుని ఎనిమిది గంటలకి తినేయ్యోచ్చని. యింక ఇక్కడి సంగతంటారా, ప్రతి గంటకి ఫోన్ చేసి అప్ డేట్ ఇస్తూనే ఉంటారు కాబట్టి బయలు దేరేతప్పుడు ఫోన్ చెయ్యటం ముఖ్యం కాబట్టి పెద్ద సమస్యే లేదు.

మా తోటి కోడల్ని వంట చేయ్యఖరలేకుండా చపాతి కొని తెచ్చేయమన్నారట. ఆన్నట్టు చెప్పటం మర్చి పోయా ఇది "kind of potluck, kind of not". అంటే ఏంటంటే, చాలా మటుకు వంటలు ఆ ఇంటావిడ చేస్తుంది, కొన్ని మాత్రం గెస్ట్లు పట్టుకేల్తారు. సరే ఎలాగో స్నో, స్లీట్ ల మధ్య, హోల్ ఫూడ్స్ చపాతిల పాకెట్లు పట్టుకుని సదరు హోస్ట్ ఇంటికి చేరుకున్నాం. మా అయన ఆ చపాతీలు ఉన్న బాగ్ నాకిచ్చి "నేను కార్ పార్క్ చేసాక తమ్ముడి తో వస్తాను. నువ్వెళ్ళు" అని నన్ను తోసేసాడు. లోపలికెల్తే, బయట రూం లో మగవాళ్ళందరూ కూర్చుని మాట్లాడుకుంటున్నారు (అని నేను అనుకున్నాను). కోట్ పెడదామని చూస్తే నాకు క్లోసేట్ కనిపించలేదు. మా తోటి కోడలు తన కోట్ ని లివింగ్ రూం లో ఉన్న మెట్ల రైలింగ్ మీద, మిగతా కోట్ల మీద వేసేసి, నువ్వు కూడా అలాగే చెయ్యాలి అని నేను నీకు స్పెషల్ గా చెప్పాలా ? అన్నట్టుగా చూసింది. సరే నేను అలాగే చేసి, ముందుకి నడిచా. కిచెన్, లివింగ్ రూం కలిపి ఉన్న ఇల్లు కావడం తో కిచెన్ లో, లివింగ్ రూం లో, పక్కనే ఉన్న పిల్లల ప్లే రూం లో ఇలా పలు చోట్ల ఆడవాళ్ళూ మాట్లాడుతూ కనిపించారు (వీళ్ళు నిజంగానే మాట్లాడుతున్నారు లెండి) మీరు గమనించ వలసిన విషయం ఏమిటంటే నేను ఇంకా లివింగ్ రూం లోపలి వెళ్ళలేదు. మా తోటి కోడలు మాయ మయి పోయింది (అంటే అక్కడి వాళ్ళల్లో కలిసిపోయింది) ఈ లోపలే ఎవరో వచ్చి నా చేతిలో ఉన్న చపాతి ప్యాకెట్లు లాగేసుకున్నారు. కొంత మంది కిచెన్ లో వంటలు చేస్తున్నారు అని నేను అప్పుడు గమనించాను. ఆ వంటల వాసన నా కొత్త కోట్ కి తగులుతుందిరా భగవంతుడా అని బాధ పడుతూ లోపలి చూసా. ఆ హోస్ట్ అంటోంది తమిళం లో "లేట్ అయ్యిందేంటి?". "మా బావగారు తోటి కోడలు ఇప్పుడే చేరారు. పాపం స్లీట్ కదా రోడ్ అంతా. లేట్ అయ్యిది" ఈ రిహార్సల్ నాకు ముందే అయిపోవడం తో నేను పెద్ద ఆశ్చర్య పడలా.

సరే గడపలోనే నిలబడ లేను కదా? మనకి తెలిసిన మొహం ఒక్కటైనా కనిపించక పోతుందా అని లోపలి వెళ్ళా. "హాయ్" అంటూ క్రితం సారి మా మరిది ఇంటికి వచ్చిన ఒక ఫ్రెండు పలకరించింది. కొంచెం సేపు మాట్లాడి వెళ్లి పొయ్యింది "let me take a look at what else is going on" అంటూ. అప్పుడప్పుడు ఎవరైనా వచ్చి పలకరిస్తే మాట్లాడటం. ఇలా ఉంటుంది conversation
కొత్త ఆవిడ: "ఎప్పిడి ఇరికింగే"
నేను: "హి హి హి I don't know Tamil" (నిజం చెప్పాలంటే పైదానికీ నాకు అర్ధం తెలుసు. కాకపోతే ఇప్పుడు జరగబోయే సంభాషణ ఒక రెండు లైన్ల తరవాత జరుగుతుంది తప్ప నాకు పెద్ద ఫరక్ పడదు. అది సంగతి)
కొ. ఆ: Oh you don't know Tamil? Are you new here?
నేను: Yeah. do you see that lady there? she is my co-sister.
మాది భాషాంతర వివాహం అని అక్కడ దాదాపు చాలా మందికే తెలుసు కాబట్టి సంభాషణ ని ఆంగ్లం లోకి మార్చి కొంచెం సేపు నాతో మాట్లాడి వెళ్లి పోవడం.

అక్కడ అందరి కంటే పెద్దవాళ్ళైన ఒక దంపతులున్నారు. వాళ్ళు దాదాపు ప్రతి ఫంక్షన్/పార్టీ కి వస్తారు. పెద్ద జోకు ఏంటంటే వాళ్ళు తప్ప ఆ వయసు వాళ్ళు అక్కడ ఇంకెవ్వరు ఉండరు. ఆవిడ ఈ పార్టీ కి అరిసెల లాంటి స్వీట్ తెచ్చింది. దాని పేరు మర్చి పొయ్యా. బలే ఉన్నాయవి. ఎనీ వే, కొంచెం సేపయ్యాక భోజనం వైపు టాపిక్ మళ్ళింది. నాకు ఆకలిగానే ఉంది కాబట్టి సరే అని తినటానికి లేద్దామనుకుంటే ఎవ్వరు లెవరు. అక్కడ రూల్ ఏంటంటే ముందు మగవాళ్ళందరూ భోజనం చేసాక తరవాత ఆడవాళ్ళు తింటారట. నేను తలుపు దగ్గర నుంచుని చూస్తే "మెన్" అందరు ఫుల్లుగా మెక్కుతున్నారు. మా ఆయన నా వేపు నిస్సహాయంగా చూసి ఓ వెర్రి నవ్వు నవ్వాడు. ఏడవలేక నేనూ నవ్వా. వాళ్ళ తిండి అయ్యాక మమ్మల్ని రమ్మన్నారు. నేనూ వెళ్ళే లోపలే ఒకావిడ వచ్చి "ఆపం అయ్యిపోయ్యాయి ఇంకొన్ని చేద్దామా" అంటూ స్టవ్ ఆన్ చేసింది. దోస పిండి లాంటి దాన్ని చిన్న మూకుడు లో పోసి దాన్ని ఇటు, అటు తిప్పి కొంచెం సేపయ్యినతరవాత తీసేస్తారు. అప్పుడు ఆ దోస ఒక "bowl " shape లో వస్తుంది. అవి చేస్తుంటే చూడడం నాకు బలే సరదా వేసి చూస్తూ నిలబడ్డా. "I really like the way you are making it. It is very funny" అన్నా. నా ఉద్దేశం ఏంటంటే "భలే చేస్తున్నారే" అని అందామని. ఆ హోస్ట్ పిల్లకి కొంచెం కోపం వచ్చినట్టుంది "ఫన్ని వా, అడ పావి" అంది. ఎందుకులే నాకు తమిళ్ తో బాటు ఇంగ్లిషు కూడా రాదనీ పేరు తెచ్చుకోవటం అని అక్కడ నించి బయట పడ్డా. అసలు "this aapam making process is very innovative" అనాల్సింది. కనీసం నా ఉద్దేసమైనా వాళ్లకి అర్ధం అయ్యేది. వాటిని కొబ్బరి పాలు, చక్కర కలిపిన పాలతో తిన్నాం. ఇడ్లీలు, చట్నీ, సాంబార్, చిక్కుడుకాయ కూర యింక చాలానే ఉన్నాయి వంటకాలు. అయ్యాక గేమ్స్ ఆడారు. ఆ వచ్చిన పెద్దావిడతో నేను "మీరు చేసిన స్వీట్ చాలా బాగుంది" అంటూ మాట కలిపి చాల సేపే మాట్లాడా. నిజంగానే స్వీట్ బాగుంది. నేనేమి ఊరికే ఆనలా. ఆవిడ కూడా వాళ్ళు ఎప్పుడు స్టేట్స్ వచ్చింది, పిల్లలు, ఆవిడ కొన్ని రోజులు ఉద్యోగం చెయ్యడం తరవాత సొంత బిజినెస్ పెట్టడం అంతా చెప్పింది.
ఆ దంపతులు కేకు కోశాక, రస మలై తిని, "పళ్ళ పాయసం" తిని/తాగి, ఆపిల్ సైడర్ టోస్ట్ తో కొత్త సంవత్సరానికి స్వాగతం చెప్పాం.

వచ్చేటప్పుడు ఎవరెవరు ఎలాంటి చీర/సల్వార్ కమీజ్ లో వచ్చారు, వాళ్ళ నగల, మరియు కార్ల details ఏంటి లాంటి విషయాలతో టైం పాస్స్ అయి పోయింది.
తరువాతి రోజు మా తోటి కోడలు నాతో "మంగమ్మ గారి తో ఏంటి మాట్లాడారు" అని అడిగింది. (అది నిజంగా ఆవిడ పేరు కాదు లెండి, నేనే సృష్టించా). మనసులో విషయాలు మనసులో దాచుకుని పైకి టిక్కు టిక్కు మంటూ, తుక్కు అన్సర్లు చెప్పలేని నేను మా సంభాషణ అంతా పూస గుచ్చినట్టు చెప్పేసా. అప్పుడా అమ్మాయి "నేను కూడా ఆవిడని అన్ని ప్రశ్నలు ఎప్పుడు అడగలేదు. మీరు బలే అడిగారు" అని నా మీద సటైరు విసిరింది. తరవాత మా అయన అన్నారు "పార్టీ లో మగవాళ్ళు చాలా మంది పరిచయం లేని వాళ్ళే. వాళ్ళ వైఫ్ కి తెలిసిన వాళ్ళ పార్టీ అని వచ్చిన వాళ్ళే. ఎవరూ ఎక్కువ మాట్లాడు కోలేదు. చాల మంది ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకున్నారు. It got better after we started playing games" అని.

"ఈ పోస్ట్ వ్రాయటం ద్వారా ఎవ్వరిని ఎగతాళి చెయ్యటం నా ఉద్దేశం కాదు" అని నేను పెద్ద disclaimer పెట్టను. ఎందుకంటే ఇలాంటి పార్టీలల్లో, వాటికి ముందు/తరవాతా జరిగే ప్రీ, పోస్ట్ పార్టీ వ్యవహారాలలో కొన్ని విషయాలు నాకు చాలా చికాకు. కొన్ని విషయాలు మాత్రం నాకు చాలా ఇష్టం.
పార్టీ అనేది మనకి ఇష్టమయిన వాళ్ళని పిలిచి వాళ్ళతో సమయం గడపటం. పార్టీ కి ముందర జరిగే preparations సరదాగా ఉండాలి కాని తల నొప్పి వ్యవహారం కాకూడదు.
Readers అందరికి ఈ సందర్భంగా కొన్ని విషయాలు చెప్పాలను కుంటున్నాను.
-- మీ ఇంటికి సరిపోయేంత మంది నే పిలవండి. ఎక్కువ మందిని పిలిచి సోఫా, కార్పెట్ పాడయ్యి, క్లీన్ అప్ కష్టమయ్యి ఇబ్బంది పడకండి.
-- మీ ఇంట్లో పార్టీ చేసుకుంటుంటే మీకు ఇష్టం అయిన వాళ్ళనే పిలవండి, ఇష్టం లేని వాళ్ళని మొహమాటం కొద్ది పిలిచి, వాళ్ళని ఇబ్బంది పెట్టి మీరు ఇబ్బంది పడకండి.
-- ఎవరైనా రాలేమంటే ఒకసారి చెప్పి వదిలెయ్యండి అంతే గాని పది సార్లు చెప్పి విసిగించకండి.
-- హోస్ట్/hostess మీ ఆవిడ/ఆయన కి తెలీక పోతే ముందు వాళ్ళని పరిచయం చెయ్యండి.
-- అలాగే మీకు తెలిసిన వాళ్ళని పార్టీ కి తీసుకెళ్ళి అక్కడ వాళ్ళని వదిలేయ్యకండి. మీకు తెలిసిన అతిదులని పరిచయం చెయ్యండి. అది బేసిక్ మానర్స్.
--అందరి ఇళ్ళల్లోను చెప్పుల స్టాండ్, కోట్ క్లోసేట్ ఉండాలని రూల్ లేదు. వచ్చేవారి కోట్ తీసుకుని కావాలంటే లోపల గది లో పెట్టండి. వెళ్ళేటప్పుడు వాళ్లకి తిరిగి ఇచ్చేయ్యోచ్చు. కోట్ కి వంట వాసన అంటుకోవటం ముఖ్యం కాదు. కొంత మంది అదే కోట్ ని రేపు ఆఫీసు కి వేసుకుని వెళ్ళాల్సి వస్తుంది. ఆ కోట్ అలాగే ఉంటె కింద చెప్పుల మీద పడీ, పిల్లలు తొక్కి నానా న్యూసెన్సు అవుతుంది. అలాగే వాళ్ళ చెప్పులని ఒక మూలగా, వరసగా పెట్టమనండి. వెతుక్కోవడంలో ఇబ్బంది ఉండకూడదు.
-- బేబీ shower పార్టీ అవుతే మగ వాళ్ళని పిలవకండి. లేదా వాళ్లకి ఏదైనా సినిమానో లేక మరోటో కాలక్షేపం పెట్టండి.
-- చిన్న పిల్లలు ఉన్నప్పుడు, అందులోను పసి పిల్లలు అయితే మనింట్లో పార్టీ పెట్టక పోవటమే మంచిది.
--భోజనం చేసేటప్పుడు అందరిని పిలవండి చాలా చాల ఆకలి వేస్తున్న, భోజనం చేసి మందులు వేసుకోవాల్సిన ఆడవాళ్ళు కూడా ఉంటారని మర్చి పోకండి.
--"please feed your child first. you can start eating as soon as the men are done" అని అమ్మలకి మీరు సలహా ఇవ్వకండి. ఆవిడ పిల్లల విషయం ఆవిడ చూసుకుంటుంది.
Martha Stewart లెవెల్లో సలహాలు ఇవ్వటం యింక ఆపెస్తా. మీరు కూడా పైన లిస్టు కి dos and don'ts add చెయ్యండి మరి.

Thursday, December 24, 2009

Book Festival Nostalgia

మా ఆయన: "చిట్టి తల్లీ, రామ్మా, ఆకలేస్తోంది. భోంచేద్దాం"
నేను: "ఇదిగో వచ్చేస్తున్నా"
గంట తరవాత ......
మా ఆయన: "ఈ మూవీ కూడా అయిపోయింది. తొందరగా రావాలి"
నేను: "వచ్చేస్తున్నా. అయిదు నిమిషాలు"
గంట తరవాత.....
రూం తలుపులు భాడాల్న తెరుచుకున్న చప్పుడుతో మా ఆయన స్టడీ లో ప్రవేశం.
"ఎం చేస్తున్నావు నువ్వసలు కంప్యూటర్ ముందు? ఇందాకట్నుంచి పిలుస్తుంటే రావేంటి? అయినా ఆకలేస్తోందంటే, ఒకటే ఆ ఫోన్ లో ముచ్చట్లేంటి? మీ అమ్మా వాళ్లకి ఇంకో గంట పొయ్యాక ఫోన్ చెయ్యొచ్చుగా? వాళ్లు కూడా పొద్దున్నే ఎనిమిది గంటలకే నీతో హస్కు వేసుకోవాలా? అయినా నువ్వూ మీ నాన్నగారు ఎం మాట్లాడుతున్నారేంటి? తెలంగాణా ఇష్యూ నా?" ఆకలేస్తోందేమో, ఆపకుండా చెలరేగిపోతున్నాడు.
మనం ఎమన్నా తక్కువ తిన్నామా? ఒక్కసారి తన కేసి చూసి "అంత ఆకలేస్తే, టేబుల్ మీద అన్ని రెడీ గా ఉన్నాయి, వెళ్లి స్టార్ట్ చెయ్యి. నేనిప్పుడే వస్తా. నువ్వు ల్యాబ్ లో రాత్రి, రాత్రి readings తీసుకుంటూ కూర్చుంటే నేను వెయిట్ చెయ్యట్లా నీ కోసం. ఇది కూడా అంతే అనుకో" అనేసి కంప్యూటర్ వైపు తిరిగేసా మిగతా బ్లాగ్స్ చూడటానికి. ఇంతకి నేను చూసే బ్లాగ్స్ ఏమనుకుంటున్నారు? హైదరాబాద్ బుక్ ఫెస్టివల్ గురించి తెలుగు బ్లాగ్స్, ఇంకా పుస్తకం.నెట్ లో పరిచయాలు. రెండు ఒకటి తరవాత ఒకటి చూసి, మా అమ్మకి లిస్టు చెప్పటం. అవన్నీ మా అమ్మా, నాన్న బుక్ ఫెస్టివల్ కి వెళ్లి కొని నాకు పంపిస్తారు.

హైదరాబాద్ బుక్ ఫెస్టివల్ తో నా అనుబంధం ఇప్పటిదా? అసలు ఆ గ్రౌండ్ లో అడుగు పెట్టగానే ఆనందం అలా గుండెలోనుంచి పొంగి వస్తుంది. అసలు ఈ గ్రౌండ్ మన ఇంటి back yard అయిపొయ్యి, ఈ బుక్ stalls అన్ని మన property అయిపోతే ఎంత బాగుంటుంది. అప్పుడు మనకిష్టం లేని పుస్తకాల్ని, మనుషుల్ని, గడ్డి పీకేసినట్టుగా తీసేసి, బయట విసిరేయ్యోచ్చు.
మొదటిసారి ఎడో క్లాసు లో ఉన్నప్పుడు వెళ్ళా నేను బుక్ ఫెస్టివల్ కి. చిక్కడపల్లి లో సెంట్రల్ లైబ్రరీ లో. అప్పుడు మనకి పుస్తకాలు అంటే ఇష్టం కాని ఫ్యామిలీ budget సంగతులు అర్ధం కావుకదా? నేను యాభై పుస్తకాలు సెలెక్ట్ చేసుకుంటే, అమ్మ అందులో ఐదో, ఆరో కొనేది. దానికి తోడు మా తమ్ముడు నాకు తోక. వాడికిష్టం వచ్చినలాంటి బుక్స్ నా చేత కొనిపించేవాడు. కొన్న బుక్స్ మొత్తం మీద పదైతే, అందులో దాదాపు ఏడు వాదికిష్టమైనవే ఉండేవి. ఇలా 70 - 30 సిస్టం లో నాకు తీరని అన్యాయం జరిగి పొయ్యేది. నాన్న దగ్గరికి వెళ్లి చెప్దామంటే ఆయనకి కావాల్సిన పుస్తకం వెతుక్కోవటం లో బిజీ. నాన్న ఫ్రీ అయ్యేటప్పటికి నాకు అలిగి, అలిగి విసుగోచ్చేసేది. నా తోకగాడు విజయ గర్వం తో కామిక్స్ పుచ్చుకుని ఆటో లో కూర్చునేవాడు. నేనేమో నా మూడు పుస్తకాల్ని ఇంటికి పట్టికెళ్ళి, అట్టవేసుకుని, పేరు రాసుకునేటప్పటికి రాతిరైపొయ్యింది. వాటిని మహా జాగ్రతగా ఆస్వాదిస్తూ, మరుసటి రోజు టిఫిన్ తినేటప్పుడు చదువుతుంటే ఉందీ....... అబ్బ అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది మజా.

తరవాత పదో తరగతి, ఇంటర్మీడియట్ కి వచ్చినతరవాత లైబ్రరీ, బుక్ ఫెస్టివల్ అన్ని బంద్ కొన్ని రోజులు. అయినా అదేంటో? EAMCET వ్రాసినంత మాత్రాన వేరే పుస్తకాలు చదవకూదడా? ఇదెక్కడి న్యాయం? ఇంతకు ముందు చెప్పినట్టు, అంత కిందా, మీదా పడి చదివినా అప్పుడు చత్త BSc లో చేరాల్సి వచ్చిది (అప్పుడలా అనుకున్నాం. ఇప్పుడు కాదులెండి). ఒక సాయంత్రం ఇంటికి వచ్చేసరికి అమ్మ చిరునవ్వుతో ఇల్లు సద్దుతోంది. ఏమిటి అంటే "ఇంట్లో చత్త ఎక్కువైపోయింది. పాత పుస్తకాలన్నీ పేపర్ల వాళ్లకి ఇచ్చేశాను. బోల్డు చోటు ఉంది ఇప్పుడు సామాన్లు పెట్టడానికి. ఇల్లంతా దుమ్ము దుమ్ము" అని మా అమ్మ స్నానానికి వెళ్ళిపోయింది. మా తమ్ముడి చేతిలో క్రికెట్ బాట్ ధడాల్న కింద పడింది. నేను ఒక్కసారి కుర్చీ లో కూలబడి పొయ్యా. మా అమ్మతో ఆ రోజు పెద్ద యుద్ధమే "నీ అరాచాకాలకి అసలు అంతు ఉండదా" అంటూ. మా అమ్మేమో మా మీద ఒక రేంజ్ లో రివర్స్ ఎటాక్ చేసింది "రోజు లైబ్రరీ లో పుస్తకాలు అద్దెకి తెచ్చి చదువుతారుగా? మళ్లి నెలకో యాభై కొని ఇల్లంతా పుస్తకాలు చెయ్యాలా? మా రోజుల్లో మేము కూడా చదివాం. అయినా చదివేసి బయట పారెయ్యాలి. లేక అటక మీద పెట్టెయ్యాలి. ఈ అద్దె ఇళ్ళల్లో మనకి అటకలు కూడానా?" అంటూ. మా నాన్నేమో ఇంటికొచ్చి గబా గబా ఆయన డబ్బాలు చూసుకున్నారు. కొన్ని మిగిలి పొయ్యాయి కొన్ని మాత్రం పేపర్ వాళ్ళ దగ్గరకి వెళ్లి పొయ్యాయి. కాని మా నాన్న ఫిలోసోఫి ఏమిటంటే చదివేసి, పుస్తకం లో ఉన్న సారాంశాన్ని గుర్తుపెట్టుకోవాలి కాని మెమరీ కోసం పుస్తకం మన దగ్గర ఉండటం ముఖ్యం కాదు అని. అయితే మాత్రం? పుస్తకాలు పడేస్తారా ఎక్కడైనా? అప్పుడు చూసాం పేపర్లో "హైదరాబాద్ బుక్ ఫెస్టివల్" అని. మా పాత రోజులు గుర్తుతెచ్చుకుని మాకు మేం సద్దిచేప్పుకున్నాం ఈ సారి వెళ్లి బోల్డు బోల్డు కొని తెచ్చుకుందాం అని. ఇంకా రెండు నెలలు ఉంది బుక్ ఫెస్టివల్ కి. మా అమ్మ అంది "ఐదు వందలు ఇస్తాను, వెళ్లి తెచ్చుకోండి" అని. ముందే మా వాడి తో చెప్పా, సగం సగం అని. అంటే చెరో రెండొందల యాభై. ఆహా. ఆ రెండు నెలలు ఎన్ని కలలు కన్నామో?

సరే. డిసెంబర్ రానే వచ్చింది. బుక్ ఫెస్టివల్ నిజాం కాలేజీ గ్రౌండ్స్ లో. ముందే నా రెండొందల యాభై తీసేసుకున్నా అమ్మ దగ్గర నుంచి. ఇప్పుడు ధరలు పెరిగిపోయ్యాయి, మనం కొనే పుస్తకాలు కూడా పెద్దవయ్యేసరికి పర్స్ మీద భారం ఇంకొంచెం ఎక్కువ పడింది. ఏమైతేనేం, నాకిష్టమైనవి పుస్తకాలు కొనుక్కున్నా. ఆ సంవత్సరం తమ్ముడికి కూడా డబ్బులిచ్చా, పుస్తకం మీద నా పేరు కూడా వ్రాసుకునే ఒప్పందం మీద. అప్పుడు మా collection లో R . K . Narayan , జిం కార్బెట్, మైకేల్ క్రియన్ చేరారు. అప్పుడే మేం నిర్ణయం చేసేసుకున్నాం వచ్చే సంవత్సరం ఆ collection పెంచాలని. తరువాతి సంవత్సరాలలో, ఇవే రచయతలవి వేరే పుస్తకాలు ఇంకా కుష్వంత్ సింగ్ పుస్తకాలు కొన్నాం. నేను ఉద్యోగం మొదలు పెట్టిన ఏడాది నా డబ్బులు పెట్టి పుస్తకాలు కొనుక్కున్నా కేశవ్ మెమోరియల్ గ్రౌండ్స్ లో. మా తమ్ముడికైతే పండగే. అమ్మ లాగా నేను ఆంక్షలు పెట్టలేదని. ఆ సంవత్సరం కొన్న పుస్తకాల్లో "Anne Frank 's Dairy " కూడా ఉంది. ఈ పుస్తకం ఎందుకు గుర్తుందంటే, వీసా కోసం మద్రాస్ వెళ్ళినప్పుడు ట్రైన్ లో చదువుకుందామని పట్టికెళ్ళి పోగొట్టుకున్నా. వచ్చేటప్పుడు ట్రైన్ లో చదువుకోవటానికి పుస్తకాలు లేక women 's era కొనుక్కున్నా. నేను ఇక్కడి కొచ్చేసాక పుస్తకాల పిచ్చి తగ్గలేదు కాని మళ్లి హైదరాబాద్ బుక్ ఫెస్టివల్ కి వెళ్ళే అవకాశం రాలేదు.

తెలుగు పుస్తకాల గురించి చదువుతున్నప్పుడు అనిపించింది నా దగ్గర అస్సలు తెలుగు పుస్తకాలు లేవని. పోయిన సంవత్సరం సుజాత గారి బ్లాగ్ లో బుక్ ఫెయిర్ గురించి చదివాక అనిపించింది వీలైతే నేవెళ్ళి కొనుక్కోవాలని లేకపోతే అమ్మా, నాన్నతో తెప్పించుకోవాలని. ఈ సారి మా అమ్మకి పెద్ద తెలుగు బుక్స్ లిస్టు చెప్పా. "తెలుగు పుస్తకాలు ఎప్పటినుంచి చదువుతున్నావు" అంటూ అమ్మ మురిసిపోయింది. మా అమ్మ, నాన్న వెళ్లారు బుక్ ఫెస్టివల్ కి. నాకు కావాల్సినవి కొన్నే దొరికాయి పుస్తకాలు . ఏమైతేనేం మా అమ్మ అన్ని stalls గురించి వివరంగా చెప్పింది. "వేరే దేశాలల్లో ఉన్నా, నన్ను పుస్తకాల కోసం తిప్పటం మానట్లేదర్రా మీరు" అంది కూడా.
ఇవన్ని చెప్తే మా శ్రీవారంటారు "we did not have to go to any book festivals in Chennai. There are huge books stores we always go to. You probably do not have such big stores. So book festival was a big deal" అని. వొళ్ళు మండిపోయింది నాకైతే. మా హైదరాబాద్ లో కూడా ఉన్నాయండి బుక్ స్టోర్స్ కోటి ఇంకా అబిడ్స్ లో. కాని బుక్ ఫెస్టివల్ మజా నే వేరు. ఎదురు చూస్తున్నా మా అమ్మ వాళ్ళు పంపిచే బుక్స్ కోసం.

Wednesday, December 9, 2009

నా గాలి, నా నేలా, నా ఊరు .......


నిన్న కొత్త పాళీ గారి పోస్ట్ చదివాను. మాతృ భూమిని గురించి వ్రాయటం కష్టం అని ఆయన అన్నప్పుడు నిజమేననిపించింది. మాతృ భూమి కంటే ముందు పుట్టి పెరిగిన ఊరు గురించి వ్రాసి ప్రాక్టీసు చేద్దాం అనుకున్నా. అసలు హైదరాబాద్ గురించి వ్రాస్తే ఏమి రాయొచ్చా అని ఆలోచిస్తుంటే అసలు ఎక్కడ మొదలెట్టాలా అనే చాలా సేపు ఆలోచించా. అంత పెద్ద రచయిత కే కష్టమవుతే, గడ్డి పరక లాంటి దాన్ని, నాకు అసాధ్యమేమోననిపించింది. అయినా ప్రయత్నం చేద్దామని మొదలుపెట్టా.

నాకు ఊహ తెలిసినప్పటి నుంచి హైదరాబాద్ లోనే ఉన్నా. అమ్మా, నాన్న ఉద్యోగ రీత్యా వేరే ఊళ్ళల్లో ఉండేవారు నాకు తొమ్మిదేళ్ళ వయసు వచ్చే వరకు. నేను అమ్మమ్మగారింటిలో హైదరాబాద్ లో ఉండేదాన్ని.
రిక్షా లో వెళ్తే రెడ్డి కాలేజీ ఎదురుకుండా సందులోనుంచి వెళ్లి, రాఘవేంద్ర స్వామి గుడి మీదుగా బసంత్ ధియేటర్ దాటి, కాచిగూడ చౌరస్తా, బడి చౌడి తరవాత కోటి. అబ్బ, కళ్ళకు కట్టినట్టు కనిపిస్తోంది దారంతా. బసంత్ ధియేటర్ కంటే కొంచెం ముందు వచ్చే నృపతుంగా స్కూల్ దాటినతరవాత వచ్చే షాప్ ఎనిమిది గంటలకే తెరిచేసేవారు. స్కూల్ కి వెళ్ళే ముందర ఏదైనా కొనుక్కోవాలంటే అక్కడే. ఖర్మ కాలి అంకుల్ (అందరు పిల్లలు ఆయన్ని అలాగే పిలిచేవారు) షాప్ తెరవకపోతే పెద్ద తలనొప్పే. కాచిగుడా, బడే చౌడి మీద నుంచి వెళ్తుంటే పూల బుట్టలు పెట్టుకుని అమ్ముతున్న వాళ్ళు కనపడితే చాలు, రిక్షా అబ్బాయిని అడిగి, ఆపించి అమ్మయిలమందరం పది పైసలకి గులాబీలు కొనుక్కునే వాళ్ళం టీచర్ కి ఇవ్వడానికి. అబ్బాయిలందరూ ఒకటే గోల. రిక్షా బాలరాజు మాత్రం "పాపా తొందరగా నడవనడంమా" అనేవాడు. బడే చౌడి కూరగాయల మార్కెట్ అప్పుడే కూరల బండ్లతో నిండడం మొదలయ్యేది. ఆకు కూరలైతే, పచ్చగా, ఫ్రెష్ గా ఎంత అందంగా కనపడేవో. ఆంజనేయ స్వామి గుడి పక్కనించి వెళ్తుంటే, పూజారి గారు జాలి సందుల్లోంచి హారతిస్తూ కనిపించేవారు. అందరం దండం పెట్టుకునే వాళ్ళం బాలరాజు తో సహా. వినాయక చవితప్పుడు చూడాలి. దారి పొడుగునా విగ్రహాలు అమ్మకానికి పెట్టేవారు. నిమర్జనం అయ్యేవరకు ప్రతి వేదిక మీద ఉన్న వినాయకుళ్ళని చూడడానికి రోజు ఉత్సాహమే. సుల్తాన్ బజార్ చౌరస్తా దగ్గర రంగు రంగుల పొడులు (బొట్టు పెట్టుకోవటానికి వాడతారు), దేవుడి పుస్తకాలు పెట్టుకుని ఇద్దరు ముగ్గురు ముసలమ్మలు ఉండేవాళ్ళు.

తరవాత నేను అబిడ్స్ లో missionary స్కూల్ లో చేరాను. శాంతి ధియేటర్ దాటి, వితల్ వాడి క్రైస్తవ సిమెట్రీ, saint జోసెఫ్స్ స్కూల్, కింగ్ కోటి హాస్పిటల్ దాటి వెళ్ళేవాళ్ళం. దారిలో ఒక చిన్న ధియేటర్ ఉండేది. దాని పేరు మర్చిపోయ్యాను. అందులో ఎప్పుడు "A Certified" సినిమాలు ఉంటాయని, అమ్మ రిక్షా అబ్బాయితో రెండు మూడు వారాలకోక్కసారి చెప్పేది "ధియేటర్ పక్క సందులోనుంచి వెళ్ళకు" అని. తరవాత అక్కడ "one way" పెట్టడంతో తప్పిది కాదు. కింగ్ కోటి హాస్పిటల్ దగ్గర చిన్న చిన్న షెడ్లు, స్కూటర్ రేపైర్ వాళ్ళ షాప్లు, బలే సందడి గా ఉండేది. పండగలోస్తే, బాలరాజు ని సాయంత్రం రావద్దని చెప్పి, సాయంత్రం అమ్మా, నాన్న వచ్చేవాళ్ళు నన్ను, తమ్ముడిని పిక్ అప్ చేసుకోటానికి. తాజ్ లో టిఫిన్ తిని, బట్టలు కొనుక్కునే వాళ్ళం. చేర్మాస్, దయాల్స్, నీడ్స్, బోల్డు బట్టల షాప్లుండేవి. అంతా అయ్యాక, అమ్మకి చీర కొని, నాన్నకూడా సియరామ్స్ లోనో, లేక
raymonds, లోనో (ఇంకా చాలా షాప్స్ పేర్లు గుర్తురావట్లేదు) షర్టు బట్టలు కొని, జోన్స్ బకేరి కి వెళ్లి pastry (అప్పుడు 1.50 Rs కి పెద్ద పెస్త్రి వచ్చేది) కొనుక్కుని, ఇంటికి వెళ్ళేవాళ్ళం. ఆహా ఆ రోజులు మళ్ళి రావుకదా.

ఇంక కాలేజీ కి వచ్చాక చుట్టు పక్కనున్న ధియేటర్ లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లు, అన్ని మనవే. శాంతి, కిషోర్, సంధ్య, దేవి, odeon, sapthagiri, sangam, మహేశ్వరీ-పరమేశ్వరి, తారకరామ అబ్బో. అబిడ్స్ లో మూడో నాలుగో ఉండేవి, వాటి పేర్లు నాకు గుర్తు రావట్లేదు. కాలేజీ లో ఉన్నప్పుడు ఇవి చాలవుటండి. నాన్న ఇంగ్లీష్ సినిమా కి తీసుకెళ్ళాలంటే, secundrabad లో ఉన్న సంగీత్. ఇంక తినతానికైతే హిమాయత్ నగర్ ఏరియా లో కింగ్ అండ్ కార్డినల్, పిక్ అండ్ move, minerva, gayathri భవన్. పోయిన సారి హైదరాబాద్ వెళ్లి నప్పుడు చూసాను అక్కడే మాక్ దోనల్డ్స్, పిజ్జా హట్ ఇంక చాలా చాల కనిపించాయి. అలానే ముందు కెళ్తే, liberty ఏరియా దగ్గరనుకుంటా Baskin robins ఉండేది. దాంట్లోకి వెళ్ళాలంటే ధైర్యం కావాలి ఎందుకంటే బాగ్ లో డబ్బులున్డాలి మరి. విగ్రహాలని పెట్టినతరవాత, హైదరాబాద్ వచ్చిన చుట్టాలని ట్యాంక్ bund తప్పకుండా తీసుకెళ్ళే వాళ్ళం. అప్పుడే కాల్చిన మొక్క జొన్న పొత్తులు తింటూ, బుద్దుడిని చూస్తూ నడుస్తుంటే టైం తెలిసేది కాదు. కొన్ని రోజులతరువాత లుంబిని పార్క్ కూడా వెళ్ళేవాళ్ళం వచ్చిన చుట్టాలని తీసుకుని. Secretariat దగ్గర Lees బ్యుటి పార్లర్ ఉండేది. మన మొహం ,మన జడ మన చేతిలోకోచ్చాక అక్కడికేల్లెవాళ్ళం, facials , eye brows , hair cut కోసమని. నాకైతే వెళ్ళేటప్పుడు, వచ్చిన తరవాత రెండు సార్లు తిట్లే. అయితే ఎందుకు వెళ్ళడం అంటారా? అదంతే. అప్పుడింక దోస్తులతోటి బడి చౌడి, కోటి, జనరల్ బజార్ వెళ్లి మన సల్వార్ కమీజులు మనమే సెలెక్ట్ చేసి తెచ్చుకోవడమే.
ఇంక సంజీవరెడ్డి నగర్ లో ఉద్యోగం వెలగపెట్టేటప్పటికి మేము ఇల్లు మారిపోయ్యం. బస్సు లో వెళ్ళేదాన్ని ఉద్యోగానికి. ఖైరతాబాద్, పంజాగుట్ట ఏరియా లో అప్పటికే అపార్ట్మెంట్ కల్చర్ పెరిగిపోయింది. రిక్షాలు తగ్గిపోయ్యాయి. చాలామంది పిల్లలు అటో లో స్కూల్కి వెళ్ళటం మొదలెట్టారు, తల్లి తండ్రులు హై టెక్ సిటీ లో పని చేస్తుంటే పిల్లలు కార్లల్లోనే స్కూల్ కి వెళ్తున్నారు. కంపెనీ బుస్సులన్ని సిటీ లోకి రావటం మొదలు పెట్టాయి. అటో minimum ఛార్జ్ పెరిగి, పెరిగి నేను పోయిన సారి వెళ్ళినప్పుడు నమ్మలేనంతగా తయారయ్యింది. మా స్కూల్ దగ్గరున్న గోడ కూలిపోయ్యి బోల్డు అపార్ట్మెంట్లు లేచాయి. చాల classy గా ఉండే botique లు పెరిగి పొయ్యాయి. కాలుష్యం చాలా ఎక్కువయ్యింది. ఇంత కాలుష్యం లో పిల్లలు బయట ఆడుకోకపోవటమే నయమనిపిస్తోంది.
ఈసారి వెళ్ళినప్పుడు ఎ మార్పులు చూస్తానో?