Thursday, December 24, 2009

Book Festival Nostalgia

మా ఆయన: "చిట్టి తల్లీ, రామ్మా, ఆకలేస్తోంది. భోంచేద్దాం"
నేను: "ఇదిగో వచ్చేస్తున్నా"
గంట తరవాత ......
మా ఆయన: "ఈ మూవీ కూడా అయిపోయింది. తొందరగా రావాలి"
నేను: "వచ్చేస్తున్నా. అయిదు నిమిషాలు"
గంట తరవాత.....
రూం తలుపులు భాడాల్న తెరుచుకున్న చప్పుడుతో మా ఆయన స్టడీ లో ప్రవేశం.
"ఎం చేస్తున్నావు నువ్వసలు కంప్యూటర్ ముందు? ఇందాకట్నుంచి పిలుస్తుంటే రావేంటి? అయినా ఆకలేస్తోందంటే, ఒకటే ఆ ఫోన్ లో ముచ్చట్లేంటి? మీ అమ్మా వాళ్లకి ఇంకో గంట పొయ్యాక ఫోన్ చెయ్యొచ్చుగా? వాళ్లు కూడా పొద్దున్నే ఎనిమిది గంటలకే నీతో హస్కు వేసుకోవాలా? అయినా నువ్వూ మీ నాన్నగారు ఎం మాట్లాడుతున్నారేంటి? తెలంగాణా ఇష్యూ నా?" ఆకలేస్తోందేమో, ఆపకుండా చెలరేగిపోతున్నాడు.
మనం ఎమన్నా తక్కువ తిన్నామా? ఒక్కసారి తన కేసి చూసి "అంత ఆకలేస్తే, టేబుల్ మీద అన్ని రెడీ గా ఉన్నాయి, వెళ్లి స్టార్ట్ చెయ్యి. నేనిప్పుడే వస్తా. నువ్వు ల్యాబ్ లో రాత్రి, రాత్రి readings తీసుకుంటూ కూర్చుంటే నేను వెయిట్ చెయ్యట్లా నీ కోసం. ఇది కూడా అంతే అనుకో" అనేసి కంప్యూటర్ వైపు తిరిగేసా మిగతా బ్లాగ్స్ చూడటానికి. ఇంతకి నేను చూసే బ్లాగ్స్ ఏమనుకుంటున్నారు? హైదరాబాద్ బుక్ ఫెస్టివల్ గురించి తెలుగు బ్లాగ్స్, ఇంకా పుస్తకం.నెట్ లో పరిచయాలు. రెండు ఒకటి తరవాత ఒకటి చూసి, మా అమ్మకి లిస్టు చెప్పటం. అవన్నీ మా అమ్మా, నాన్న బుక్ ఫెస్టివల్ కి వెళ్లి కొని నాకు పంపిస్తారు.

హైదరాబాద్ బుక్ ఫెస్టివల్ తో నా అనుబంధం ఇప్పటిదా? అసలు ఆ గ్రౌండ్ లో అడుగు పెట్టగానే ఆనందం అలా గుండెలోనుంచి పొంగి వస్తుంది. అసలు ఈ గ్రౌండ్ మన ఇంటి back yard అయిపొయ్యి, ఈ బుక్ stalls అన్ని మన property అయిపోతే ఎంత బాగుంటుంది. అప్పుడు మనకిష్టం లేని పుస్తకాల్ని, మనుషుల్ని, గడ్డి పీకేసినట్టుగా తీసేసి, బయట విసిరేయ్యోచ్చు.
మొదటిసారి ఎడో క్లాసు లో ఉన్నప్పుడు వెళ్ళా నేను బుక్ ఫెస్టివల్ కి. చిక్కడపల్లి లో సెంట్రల్ లైబ్రరీ లో. అప్పుడు మనకి పుస్తకాలు అంటే ఇష్టం కాని ఫ్యామిలీ budget సంగతులు అర్ధం కావుకదా? నేను యాభై పుస్తకాలు సెలెక్ట్ చేసుకుంటే, అమ్మ అందులో ఐదో, ఆరో కొనేది. దానికి తోడు మా తమ్ముడు నాకు తోక. వాడికిష్టం వచ్చినలాంటి బుక్స్ నా చేత కొనిపించేవాడు. కొన్న బుక్స్ మొత్తం మీద పదైతే, అందులో దాదాపు ఏడు వాదికిష్టమైనవే ఉండేవి. ఇలా 70 - 30 సిస్టం లో నాకు తీరని అన్యాయం జరిగి పొయ్యేది. నాన్న దగ్గరికి వెళ్లి చెప్దామంటే ఆయనకి కావాల్సిన పుస్తకం వెతుక్కోవటం లో బిజీ. నాన్న ఫ్రీ అయ్యేటప్పటికి నాకు అలిగి, అలిగి విసుగోచ్చేసేది. నా తోకగాడు విజయ గర్వం తో కామిక్స్ పుచ్చుకుని ఆటో లో కూర్చునేవాడు. నేనేమో నా మూడు పుస్తకాల్ని ఇంటికి పట్టికెళ్ళి, అట్టవేసుకుని, పేరు రాసుకునేటప్పటికి రాతిరైపొయ్యింది. వాటిని మహా జాగ్రతగా ఆస్వాదిస్తూ, మరుసటి రోజు టిఫిన్ తినేటప్పుడు చదువుతుంటే ఉందీ....... అబ్బ అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది మజా.

తరవాత పదో తరగతి, ఇంటర్మీడియట్ కి వచ్చినతరవాత లైబ్రరీ, బుక్ ఫెస్టివల్ అన్ని బంద్ కొన్ని రోజులు. అయినా అదేంటో? EAMCET వ్రాసినంత మాత్రాన వేరే పుస్తకాలు చదవకూదడా? ఇదెక్కడి న్యాయం? ఇంతకు ముందు చెప్పినట్టు, అంత కిందా, మీదా పడి చదివినా అప్పుడు చత్త BSc లో చేరాల్సి వచ్చిది (అప్పుడలా అనుకున్నాం. ఇప్పుడు కాదులెండి). ఒక సాయంత్రం ఇంటికి వచ్చేసరికి అమ్మ చిరునవ్వుతో ఇల్లు సద్దుతోంది. ఏమిటి అంటే "ఇంట్లో చత్త ఎక్కువైపోయింది. పాత పుస్తకాలన్నీ పేపర్ల వాళ్లకి ఇచ్చేశాను. బోల్డు చోటు ఉంది ఇప్పుడు సామాన్లు పెట్టడానికి. ఇల్లంతా దుమ్ము దుమ్ము" అని మా అమ్మ స్నానానికి వెళ్ళిపోయింది. మా తమ్ముడి చేతిలో క్రికెట్ బాట్ ధడాల్న కింద పడింది. నేను ఒక్కసారి కుర్చీ లో కూలబడి పొయ్యా. మా అమ్మతో ఆ రోజు పెద్ద యుద్ధమే "నీ అరాచాకాలకి అసలు అంతు ఉండదా" అంటూ. మా అమ్మేమో మా మీద ఒక రేంజ్ లో రివర్స్ ఎటాక్ చేసింది "రోజు లైబ్రరీ లో పుస్తకాలు అద్దెకి తెచ్చి చదువుతారుగా? మళ్లి నెలకో యాభై కొని ఇల్లంతా పుస్తకాలు చెయ్యాలా? మా రోజుల్లో మేము కూడా చదివాం. అయినా చదివేసి బయట పారెయ్యాలి. లేక అటక మీద పెట్టెయ్యాలి. ఈ అద్దె ఇళ్ళల్లో మనకి అటకలు కూడానా?" అంటూ. మా నాన్నేమో ఇంటికొచ్చి గబా గబా ఆయన డబ్బాలు చూసుకున్నారు. కొన్ని మిగిలి పొయ్యాయి కొన్ని మాత్రం పేపర్ వాళ్ళ దగ్గరకి వెళ్లి పొయ్యాయి. కాని మా నాన్న ఫిలోసోఫి ఏమిటంటే చదివేసి, పుస్తకం లో ఉన్న సారాంశాన్ని గుర్తుపెట్టుకోవాలి కాని మెమరీ కోసం పుస్తకం మన దగ్గర ఉండటం ముఖ్యం కాదు అని. అయితే మాత్రం? పుస్తకాలు పడేస్తారా ఎక్కడైనా? అప్పుడు చూసాం పేపర్లో "హైదరాబాద్ బుక్ ఫెస్టివల్" అని. మా పాత రోజులు గుర్తుతెచ్చుకుని మాకు మేం సద్దిచేప్పుకున్నాం ఈ సారి వెళ్లి బోల్డు బోల్డు కొని తెచ్చుకుందాం అని. ఇంకా రెండు నెలలు ఉంది బుక్ ఫెస్టివల్ కి. మా అమ్మ అంది "ఐదు వందలు ఇస్తాను, వెళ్లి తెచ్చుకోండి" అని. ముందే మా వాడి తో చెప్పా, సగం సగం అని. అంటే చెరో రెండొందల యాభై. ఆహా. ఆ రెండు నెలలు ఎన్ని కలలు కన్నామో?

సరే. డిసెంబర్ రానే వచ్చింది. బుక్ ఫెస్టివల్ నిజాం కాలేజీ గ్రౌండ్స్ లో. ముందే నా రెండొందల యాభై తీసేసుకున్నా అమ్మ దగ్గర నుంచి. ఇప్పుడు ధరలు పెరిగిపోయ్యాయి, మనం కొనే పుస్తకాలు కూడా పెద్దవయ్యేసరికి పర్స్ మీద భారం ఇంకొంచెం ఎక్కువ పడింది. ఏమైతేనేం, నాకిష్టమైనవి పుస్తకాలు కొనుక్కున్నా. ఆ సంవత్సరం తమ్ముడికి కూడా డబ్బులిచ్చా, పుస్తకం మీద నా పేరు కూడా వ్రాసుకునే ఒప్పందం మీద. అప్పుడు మా collection లో R . K . Narayan , జిం కార్బెట్, మైకేల్ క్రియన్ చేరారు. అప్పుడే మేం నిర్ణయం చేసేసుకున్నాం వచ్చే సంవత్సరం ఆ collection పెంచాలని. తరువాతి సంవత్సరాలలో, ఇవే రచయతలవి వేరే పుస్తకాలు ఇంకా కుష్వంత్ సింగ్ పుస్తకాలు కొన్నాం. నేను ఉద్యోగం మొదలు పెట్టిన ఏడాది నా డబ్బులు పెట్టి పుస్తకాలు కొనుక్కున్నా కేశవ్ మెమోరియల్ గ్రౌండ్స్ లో. మా తమ్ముడికైతే పండగే. అమ్మ లాగా నేను ఆంక్షలు పెట్టలేదని. ఆ సంవత్సరం కొన్న పుస్తకాల్లో "Anne Frank 's Dairy " కూడా ఉంది. ఈ పుస్తకం ఎందుకు గుర్తుందంటే, వీసా కోసం మద్రాస్ వెళ్ళినప్పుడు ట్రైన్ లో చదువుకుందామని పట్టికెళ్ళి పోగొట్టుకున్నా. వచ్చేటప్పుడు ట్రైన్ లో చదువుకోవటానికి పుస్తకాలు లేక women 's era కొనుక్కున్నా. నేను ఇక్కడి కొచ్చేసాక పుస్తకాల పిచ్చి తగ్గలేదు కాని మళ్లి హైదరాబాద్ బుక్ ఫెస్టివల్ కి వెళ్ళే అవకాశం రాలేదు.

తెలుగు పుస్తకాల గురించి చదువుతున్నప్పుడు అనిపించింది నా దగ్గర అస్సలు తెలుగు పుస్తకాలు లేవని. పోయిన సంవత్సరం సుజాత గారి బ్లాగ్ లో బుక్ ఫెయిర్ గురించి చదివాక అనిపించింది వీలైతే నేవెళ్ళి కొనుక్కోవాలని లేకపోతే అమ్మా, నాన్నతో తెప్పించుకోవాలని. ఈ సారి మా అమ్మకి పెద్ద తెలుగు బుక్స్ లిస్టు చెప్పా. "తెలుగు పుస్తకాలు ఎప్పటినుంచి చదువుతున్నావు" అంటూ అమ్మ మురిసిపోయింది. మా అమ్మ, నాన్న వెళ్లారు బుక్ ఫెస్టివల్ కి. నాకు కావాల్సినవి కొన్నే దొరికాయి పుస్తకాలు . ఏమైతేనేం మా అమ్మ అన్ని stalls గురించి వివరంగా చెప్పింది. "వేరే దేశాలల్లో ఉన్నా, నన్ను పుస్తకాల కోసం తిప్పటం మానట్లేదర్రా మీరు" అంది కూడా.
ఇవన్ని చెప్తే మా శ్రీవారంటారు "we did not have to go to any book festivals in Chennai. There are huge books stores we always go to. You probably do not have such big stores. So book festival was a big deal" అని. వొళ్ళు మండిపోయింది నాకైతే. మా హైదరాబాద్ లో కూడా ఉన్నాయండి బుక్ స్టోర్స్ కోటి ఇంకా అబిడ్స్ లో. కాని బుక్ ఫెస్టివల్ మజా నే వేరు. ఎదురు చూస్తున్నా మా అమ్మ వాళ్ళు పంపిచే బుక్స్ కోసం.

3 comments:

  1. బాగుందండి మీ అనుబంధం బుక్ ఫెస్టివల్తో. మా ఇంట్లో మా నాన్న మాకు కంపల్సరీ చేసిన మంచి అలవాట్లలో ఒకటి పుస్తకానికి అట్ట వెయ్యడం. అది ఎవరి పుస్తకమైనా సరే, ఏ పుస్తకమైనా సరే, మా ఇంటికి వచ్చిందంటే కనీసం న్యూస్ పేపరు అట్ట ఐనా వెయ్యాలిసిందే. ఆ తరువాతే చదవడం.

    ReplyDelete
  2. మీరు ఎంచుకున్న పుస్తకాల వివరాలు చెప్పరూ. ధన్యవాదాలు.

    ReplyDelete
  3. బావుంది. నేనెపుడూ బుక్ ఫెస్టివల్స్ కి వెళ్ళలేదు. మీ టపా చదివితే వెళ్లి ఉంటె బావుండేది అనిపించింది.

    ReplyDelete