Saturday, July 9, 2011

నేను కధ రాశా

ఎప్పటి నుంచో ప్రయత్నం "ప్రతిబింబం" వ్రాయాలని. ఇప్పటికి కుదిరింది. భయం భయం గానే పోస్ట్ చేస్తున్నా
ఓ పాలి సూసి కామెంట్ పడేద్దురూ

ప్రతిబింబం

"వెల్, ఐ ఎన్జోఎడ్ ది ఫస్ట్ డే అఫ్ క్లాస్. హోప్ యు డిడ్ టూ. ఐ విల్ సి యు ఇన్ ది నెక్స్ట్ క్లాస్" అంటూ నిన్నటి మొదటి క్లాస్ ముగింఛి బయటకి నడిచాను. ఒక్కొక్క విద్యార్థి అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పుకుంటూ, పిచ్చాపాటి మాట్లాడుతూ క్లాసు బయటకి వచ్చేటప్పటికి అయిదున్నర దాటింది. అదే ఆఖరు క్లాసు అవడంతో తిన్నగా కార్ వైపు నడిచాను. "డాక్టర్ శ్రీ రామా, హాంగ్ ఆన్ వన్ సెకండ్ ప్లీజ్" వెనకాల పరిగెడుతూ వస్తోంది నాన్సీ. అమ్మా, నాన్న ఎంతో ముద్దుగా పెట్టుకున్న పేరు "శ్రీ రమ". ఇక్కడకోచ్చాక, శ్రీ రామా గా మారింది.  నాన్సీ భలే చురుకైన పిల్ల. సాయంత్రం అయినా, రోజంతా ల్యాబ్ లో రిసెర్చ్ చేసి చేసి ఉన్నా, నా దగ్గర టీచింగ్ అసిస్టెంట్ షిప్ చేసేటప్పుడు మాత్రం ఎప్పుడు నవ్వుతూనే ఉంటుంది. దేవుడు కొంత మందికే ఆ వరం ఇస్తాడెమో.  హైదరాబాద్ లో ఎం ఫిల్ చేసి, యునివర్సిటీ అఫ్ పెన్సిల్వేనియా లో గణితశాస్త్రం లో పి హెచ్ డి పట్టా పుచ్చుకుని, చిన్న, చితక కాలేజీ లలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేసి, అయిదేళ్ళ క్రితమే, మా ఆయన ఉద్యోగం మారటం తో, అసోసియేట్ ప్రొఫెసర్ గా వెర్మోంట్ లో ఉన్న ఈ కాలేజీ కి వచ్చాను. మా ఆయనకి వచ్చిన ఉద్యోగం తనకి చాల నచ్చటం ఒక కారణమైతే, వెర్మోంట్ లో ఉన్న ప్రకృతి అందాలు నాకు చాల నచ్చటం ఇక్కడికి రావటానికి రెండో కారణం. "నిన్న మీరు చెప్పిన పనులన్నీ అయిపోయ్యాయి, ఇంకేదయినా కావాలంటే ఈమెయిలు చెయ్యండి. ఇదిగో క్లాసు లిస్టు. మీకు తెలుసా? మీ లాస్ట్ నేమ్ తో ఒక స్టూడెంట్ ఉంది క్లాసు లో" అంటూ లిస్టు చేతికిచ్చి, గడ గడా ఇంకో పది నిమిషాలు కబుర్లు చెప్పి వెళ్ళిపోయింది.
ఈరోజు క్లాసు కి వెళ్ళేవరకు మళ్ళి ఆ లిస్టు వైపే చూడలేదు. క్లాసు ముగించుకుని పుస్తకాలన్నీ బాగ్ లో సద్దుతూ ఉంటె ఎవరో నా వైపే తీక్షణం గా చూస్తున్న భావన. తల పైకెత్తి చూసాను. నా వైపే చూస్తున్న అమ్మాయి. అది కాదు నన్ను ఆకట్టుకున్నవిషయం. ఆ అమ్మాయి చిన్నప్పటి నా ప్రతిబింబం లా ఉంది. ఒక్క క్షణం నాకే ఆశ్చర్యం వేసింది.  నా దగ్గర కొచ్చి "హాయ్ ఐ అం జేన్నిఫెర్. ఐ థింక్ యు నో మీ. ఐ లుక్ ఫార్వర్డ్ టు బీఇంగ్ ఇన్ యువర్ క్లాస్". ఇదేంటి? గొంతు కూడా చిన్నప్పటి నా గొంతు లానే ఉంది. జేన్నిఫెర్. ఓహ్ మై గాడ్. పోలికలు ఇంత స్పష్టం గా ఒక తరం నించి ఇంకో తరం కి సంక్రమిస్తాయా?
"హాయ్", తెలిసిన, తెలియని వాళ్ళ పలకరింతలకి మర్యాదగా సమాధానం చెప్తూ అస్తవ్యస్తంగా నా రూం కి వెళ్లాను. ముందు చల్లటి మంచినీళ్ళు తాగాలి. గొంతులో తడారిపోతోంది. అర్జెంటు గా నాలుగైదు కష్టమైన లెక్కలు చేసి మనసు చల్లబరుచుకున్నాను. లెక్కలు నా అభిరుచి, బ్రతుకు తెరువు మాత్రమే కాదు. నా వ్యసనం. మనసుని మళ్లించాలంటే లెక్కలు ముందేసుకుని కూర్చోవటం నా అలవాటు. అప్పుడు చూసాను నిన్న నాన్సి ఇచ్చిన క్లాసు లిస్టు. జేన్నిఫెర్ ఇంటి పేరు మీద నా కన్ను పడింది. అమెరికన్లు పలకలేని స్వచ్చమైన తెలుగింటిపేరు. ఆ పేరు పలకలేకే, నన్ను అందరు డాక్టర్ శ్రీ రామా అంటారు. అవును. నాది ఆ అమ్మాయిది ఒకే ఇంటి పేరు.

ఎవరో తలుపు కొట్టటంతో బయటికి వెళ్తే ఎదురుగా జేన్నిఫెర్. "ఐ అం సారీ. మిమ్మల్ని ఇవ్వాళ క్లాస్ లో అప్సెట్ చేసానా? అమ్మ మీ పేరు, మీరు చదివిన యునివర్సిటీ చెప్తే, మిమ్మల్ని ఇంటర్నెట్ లో వెతికి పట్టుకుని, కనీసం ఒక్క ఫ్యామిలీ మెంబెర్ కైనా దగ్గరున్దామని ఈ కాలేజీ లో చేరాను. నన్ను అర్ధం చేసుకుంటారని అనుకుంటున్నాను" ఈ మధ్యే తెలుగు నేర్చుకున్నట్టుంది. మొహం లో నాలాగ భావాల్ని చూపించటం ఈ అమ్మాయికి ఎలా వచ్చింది. మా అమ్మాయికి కూడా నా పోలికలు ఇంత స్పష్టం గా రాలేదు. "ఫరవాలేదు. లోపలి రా" అని ఆహ్వానించాను. "వెళ్లి పోవాలి. వేరే క్లాస్ ఉంది. రేపు రానా?" అభ్యర్ధన గా అడిగింది. "అలాగే. లంచ్ కి కలుద్దాం".

ఎలాగోలా ఆ రోజుకి మిగతా పాఠాలు ముగించుకుని ఇంటికి బయలుదేరాను. దారి పొడుగునా గత స్మృతులు నన్ను చుట్టుముట్టాయి.

మా నాన్న మా ఊర్లో చాలా పేరున్న లాయర్. చూట్టు పక్కన ఊళ్ళనించి కూడా చాల కెసులోచ్చేవి. పేదవాళ్ళ లాయర్ అనేవాళ్ళు. ఎంత ఇవ్వగలిగితే అంతే ఫీజు. ఒక్కొక్కసారి అరిటి పళ్ళు, వాళ్ళ ఇళ్ళల్లో పండిన కూరగాయలు తెచ్చిచేవారు పేద వాళ్ళు. చిన్న పిల్లలతో వస్తే వాళ్లకి నా చాక్లెట్లు, బిస్కట్లు ఇవ్వటం. వాళ్ళు ఏమి ఇవ్వలేకపోతే మా ఇంటిలోనే రాత్రి భోజనం, పొద్దున్న కోర్టుకు వెళ్లేముందర కాఫీ, పలహారం. అమ్మా, పెద్దమ్మ కూడా అంతే. మా నాన్నకి ఇద్దరు భార్యలు. మా అమ్మ చిన్నావిడ. కోర్ట్ ఉద్యోగి గా మా అమ్మ వచ్చినప్పుడు వాళ్ళ పరిచయం అయ్యింది.
సమాజాన్ని ఎదిరించి పెళ్ళైతే చేస్కుంది కాని మా అమ్మ సమాజం లో తన ఉనికిని కోల్పోయింది. ప్రేమ కొన్ని రోజులకి కోపంగా, చిరాకుగా చివరికి బాధగా మారేలోపల నేను భూమి మీద పడ్డాను. మొదట నేను, నాన్న, ఉద్యోగమే తన ప్రపంచం. మెల్ల మెల్లగా నాన్న ఆ ప్రపంచంలోకి  అప్పుడప్పుడు వచ్చే అతిధి మాత్రమే అయ్యారు. భౌతికంగా రెండు చోట్ల రెండు రోజులకొకసారి ఉన్నా, ఆయన మనసు మాత్రం పని మీదే. పెద్దలనాటి ఇల్లు, అయిదుగురు అన్నదమ్ములు, నలుగురు అక్క చెల్లెళ్ళు. అదే ఆయన ఆస్తి. అమ్మ, నేను నాన్న వేరే ఇంట్లో ఉండేవాళ్ళం. చూట్టు పక్కల అందరికి అమ్మ మీద గాఉరవం ఉన్నా, అమ్మ "రెండో ఆవిడ" గానే మిగిలి పొయ్యింది. ఇద్దరాడపిల్లలు, ఒక మగ పిల్లవాడి తల్లి అయిన పెద్దమ్మ జీవితం లో ఏదో వెలితి. తాతలనాటి ఇంట్లో ఆవిడ, పిల్లలు ఉండేవారు. పై పై కి అంతా బాగానే ఉన్నా, అక్కా అన్న అని పిలిచి, పిలిపించుకున్నా, పెద్దన్నాన్నల, బాబాయిల పిల్లలు నన్ను బయిట దాని లాగే చూడడం నాకు పెద్దవుతున్న కొద్ది స్పష్టమయ్యేది. అప్పుడే నాన్న హైదరాబాద్ కి ప్రాక్టీసు మార్చారు. సిటీ. కొత్త ప్రపంచం. ఇళ్లు, స్కూళ్ళతో బాటు, మా మనసులు దూరమయ్యాయి.  నాన్న ఎప్పటి లానే రెండు రోజులిక్కడ, రెండు రోజులక్కడ.  నా గురించి తెలిసిన చుట్టాలకి నా మీద, మా అమ్మ మీద రెండే రెండు రకాల భావాలు ఉండేవి.అయితే జాలి లేక అసహ్యం. ఈ విషయం నాకు రోజు రోజు కి స్పష్టం అయ్యేది. ధైర్యం చేసి నన్ను అడిగిన వాళ్ళని నాకు తోచిన తర్కం తో ఒప్పించేదాన్ని, చేసింది తప్పే అయితే దానికి మా నాన్న కూడా బాధ్యులేనని, మా అమ్మ మాత్రమే కాదని. అడగని వాళ్ళు చూసే చూపులే భరించటం కష్టం అయ్యేది. బాధ భరించటం కష్టం అయినప్పుడు మనిషి మనసు మళ్లీన్చుకునే  ప్రయత్నం చేస్తాడు. నేనూ చేసాను. లెక్కలతో. చుట్టుపక్కల నా అంత బాగా లెక్కలు చేసే వాళ్ళు ఎవ్వరు ఉండేవారు కాదు. నా తోటి పిల్లలందరూ geometry తో కుస్తీ పడుతుంటే, నేను అది పూర్తి చేసేసి కాల్కులస్ మీద పట్టు సాధించాను. నా స్నేహితులందరూ ప్రోబబిలిటి తో బుర్ర బద్దలు కొట్టుకుంటుంటే, నేను విశ్వవిద్యాలయం లైబ్రరీ నించి statistics పుస్తకాలు తెచ్చి చదువుకున్నాను.మన జీవితానికి ఒక లక్ష్యం పెట్టుకుని దాన్ని సాధించటం కోసం కష్టపడటంలో నిమగ్నమైతే మనసులో బాధని మానిపించటం తేలికని, ఆ లక్ష్యాన్ని గనక సాధిస్తే సమాజం లో మనకి గౌరవం దానంతటదే వస్తుందని అనిపించిది. అంతే. ఆ లక్ష్య సాధనలో పడ్డాను. నా కాళ్ళ మీద నేను నిలపడాలి. ఎవ్వరి దగ్గరా ఏది ఆశించకూడదు.
నాకు ఇంజనీరింగ్ లో సీట్ రాలేదు. పెద్దమ్మ కొడుకు కృష్ణన్నయ్య ఫీజు కట్టి ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీ లో చేరితే నేను బి ఎస్ సి లో చేరాను. తను ఎం ఎస్ కోసం అమెరికా కి వెళ్తే నేను ఎం ఎస్ సి చేసి తరవాత ఎం ఫిల్ చేసాను. క్రిష్ణన్నయ్యకి చాలానే సంబంధాలు వచ్చాయి. ప్రతి సంబంధాన్ని, మా పిల్లాడికి తగదంటూ వదిలేసుకున్నారు నాన్న, పెద్దమ్మా, అక్కయ్యలు. నాకు సంబంధాలు చూడడానికి ఎవ్వరు ముందుకు రాలేదు. మా పిన్ని తీసుకొచ్చిన ఒకటి, అరా సంబంధాలు నాకు నచ్చలేదు.  గౌరవంగా బ్రతకటానికి నాకు మగతోడు ఆఖర్లేదని, నన్ను నన్నుగా ఇష్టపడే వాడినే సమయమోచ్చినప్పుడే పెళ్లి చేసుకోవచ్చని అనుకుని, లెక్చరర్ పోస్ట్ లకి ఇంటర్వ్యూ లకి వెళ్ళటం మొదలెట్టాను. సిటిలోను, జిల్లాలలోను చాలా పేరున్న మూడు నాలుగు విద్యా సంస్థల్లో ఆఫర్లు వచ్చాయి. జిల్లాలకి వెళ్ళటం ఇష్టం లేక సిటి లో పోస్టింగ్ నే ఎంచుకున్నాను. ఒక సంవత్సరం ముగిసిన వెంటనే, నన్ను అమ్మాయిల కాలేజీ కి ట్రాన్స్ఫేర్ చేస్తామన్నారు. ఎందుకనడిగాను. "అమ్మాయిల కాలేజీ లో ఉన్న సారు గారు ఇక్కడ చెప్పటానికి ఉబలాట బడుతున్నారు మేడం. ఎలాగోలా సద్దుకోండి" అని సమాధానం వచ్చింది. ఇదేమైనా ట్రైన్ లో సామానా  సద్దుకొటానికి? అమ్మాయిని కాబట్టి అబ్బాయిల కాలేజీ లో చదువు చెప్పి మంచి పేరు తెచ్చుకుంటే అక్కడ ఉన్న "మేల్" లెక్చరర్ లకి అందరికి నామోషి. ఒళ్ళు మండి రిజైన్ చేసాను.
ఆ రోజుల్లోనే పీ హెచ్ డి చెయ్యాలని ఆలోచన వచ్చింది. జి ఆర్ ఇ, టోఫెల్ పరీక్షలు రాసి స్కాలర్ షిప్ సాదించాను. కొందరు శభాష్ అన్నారు కొందరు పెదవులు విరిచారు. నేను పట్టించుకోలేదు. అమ్మ మాత్రం నేను బయలుదేరే రోజు "నన్ను మర్చి పోకు" అంది. ఆ రోజు నించి ఈ రోజు వరకు ప్రతి రోజు కనీసం ఒక్క సారైనా అమ్మకి ఫోన్ చేస్తాను. రెండో సంవత్సరం నాన్న కేసు పని మీద యూరోప్ వచ్చి పని ముగించుకుని అమెరికా వచ్చారు. నెల రోజులు నాదగ్గరా నెల రోజులు కృష్ణన్నయ్య దగ్గర ఉన్నారు. అప్పటికే మా చుట్టాల కుటుంబాలలో నాన్న పెద్దమ్మ కుటుంబాన్ని నిర్లక్ష్యం చేసారని, అందుకే కృష్ణన్నయ్య దాదాపు పిచ్చివాడైయ్యాడని వార్తలు రాజ్యమేలుతున్నాయి. ఇవన్ని విని మా నాన్న మనసు గాయపడిందని నాకు తెలుసు. అందుకే నాన్న కృష్ణన్నయ్యతో చాలా సమయం గడిపి తను అడిగిన ప్రశ్నలన్నింటికి ఓపికగా సమాధానాలు చెప్పారని కూడా నాకు తెలుసు. నాన్న ట్రిప్ ముగించుకుని హైదరాబాద్ తిరిగి వెళ్ళారు. కృష్ణన్నయ్య, బాబాయ్ పిల్లలు అమావాస్యకో, పున్నమికో ఫోన్లు చేస్తున్నా, నా క్షేమ సమాచారాలు కనుక్కునేది మాత్రం నా స్నేహితులు మాత్రమే. ఉన్నట్టుండి ఒక రోజు మా అత్తయ్య కూతురు హైదరాబాద్ నుండి ఫోన్ చేసి, పిచ్చా పాటి మాట్లాడి, "మీ  అమెరికన్ వదిన ఎలా ఉంది" అనడిగింది. నాకర్ధం కాలేదంటే, తడపడి. "ఎం లేదులే" అంది. సరే వీళ్ళ గొడవ నాకెందుకులే అని నా పని నేచేసుకుంటుంటే అప్పుదోచ్చింది కృష్ణన్నయ్య ఫోన్. "నేను పెళ్లి చేసుకున్నాను" అన్నాడు ఉపోద్ఘాతం లేకుండా. "ఎవరా అమ్మాయి ఏంటా కధ" అనడిగాను. "ఇక్కడ పరిచయం అయ్యింది. పెళ్లి చేసుకున్నాం" అని సమాధానం చెప్పాడు. నాన్న మనసు గాయపడింది. ఆ విషయం కదిపితే మాట మార్చేసేవారు. కొన్ని రోజులకి హైదరాబాద్ వెళ్ళాను. పెద్దమ్మ ఇంట్లో ఫోటోలు చూసాను. అమెరికన్ అమ్మాయి, పేరు జెస్సికా. అన్నయ్య కన్నా రెండేళ్ళు పెద్దది. నాన్న కొంచెం తేరుకున్నట్టే అనిపించినా గాయం ఇంకా మానలేదు. మూడు నెలల తరవాత జెస్సికా ఫోన్ చేసింది. గర్భం తో ఉన్నానని, అన్నయ్య తనతో గొడవ పడి వెళ్లి పోయ్యాడని చెప్పింది. వినటం తప్ప ఏమి చెయ్యలేకపోయాను. సంవత్సరం తరవాత చివరి సారిగా ఫోన్ చేసింది. ఆడపిల్ల పుట్టిందని, జేన్నిఫెర్ అని పేరు పెట్టానని.

కాలం మన కోసం ఆగదు కదా? జీవితం ముందుకి సాగుతోంది. చదువులో ముందుకి సాగుతూ నేను ప్రగతిని సాధించే సమయంలో విధి నాకు పరీక్ష పెట్టింది. నా ప్రాణ స్నేహితుడు శశాంక్ రూపం లో. ఒక రోజు అర్ధాంతరంగా వచ్చి పెళ్లి చేసుకుంటానన్నాడు. నాన్న సరే అన్నారు. అమ్మ గయ్యి మంది "మన" కులం వాడు కాదు అని. నా మనసులో ఎన్నో ప్రశ్నలు. నాది ఎ కులం? అమ్మ దా? నాన్న దా? ఎవ్వరు నన్ను వాళ్ళల్లో ఒకదానిగా చూడలేదే. సమాజం కోసం, నాన్న ఇంటి పేరు నా పేరు పక్కన పెట్టుకున్నా, ఆ కట్టు బాట్లతో పెరగ లేదే? అమ్మ అసలు నాన్న భార్యగా సమాజంలో గుర్తిన్చబడలేదే? శశాంక్ ఇవేవి పట్టించుకోలేదు. నువ్వు నా జీవితం లో ఉంటె చాలన్నాడు. చాలా రోజులు ఆలోచించాను. ఇప్పుడు వద్దనుకుంటే జీవితంలో చాలా గొప్ప స్నేహాన్ని పోగొట్టు కుంటానని, నేను ఇంకొకరిని పెళ్లి చేసుకుని అతన్ని ఇష్టపడటం కంటే, నన్ను ప్రేమించే స్నేహితుణ్ణి పెళ్లి చేసుకుంటే జీవితంలో సుఖపడతానని అనిపించింది.రోజు పది నిమిషాల్లో ఇంటికి చేరేదాన్ని అలాంటిది ఇవ్వాళ్ళ అరగంట పైనే పట్టింది. పిల్లలు ఆడుతున్నట్లున్నారు, కేకలు వినిపిస్తున్నాయి. శ్రీవారు కాఫీ తాగుతూ మెయిల్ చూస్తున్నారు. దగ్గరగా వెళ్లి తన వొళ్ళో తల పెట్టుకున్నాను ఎంత ఆపుకున్నా దుఖం ఆగట్లేదు. ఏడుస్తూనే ఈ రోజు జరిగిన పరిచయం గురించి చెప్పాను. "ఎం చేద్దామనుకున్తున్నావ్?" సూటిగానే అడిగారాయన. "నా లాగ ఇంకో ఆడపిల్ల కుటుంబం ప్రేమ కోసం పరితపించ కూడదు. నా కుటుంబం గురించి నాకు తెలిసిన విషయాలన్నీ జేన్నిఫెర్ కి చెప్తాను. మేనత్త స్నేహాన్ని ఆ చిన్నారికి చూపిస్తాను" అని స్థిరంగా చెప్పాను. శశాంక్ చిరునవ్వులో మెచ్చుకోలు. వంట చెయ్యటానికి ఉపక్రమిస్తూ అమ్మకి ఫోన్ కలిపాను, రేపటి లంచ్ కోసం గుత్తి వంకాయ కూర రెసిపి అడగటానికి.

Monday, June 13, 2011

ఆహా నా టీవీ, ఓహో నా టీవీ

చిన్నప్పుడు టీవీ, radio కంటే ఎక్కువ పొపులర్ గా ఉండేది. దృశ్య శ్రవణ మీడియాల్లో "దృశ్య" కి ఎక్కువ ప్రాముఖ్యత దీనికి ఒక కారణం కావచ్చు. ఆ రోజుల్లో (అంటే నేను ఇప్పుడు పెద్ద ముసలి దాన్నేం కాననుకోండి,  ఇరవయ్యో ఏడు మొన్న పదిహేనేళ్ళ క్రితమే వచ్చి జస్ట్ ఏడాది దాటిందంతే. అంటే నా వయస్సు ఎంతున్తున్దంటారు?) కొన్ని పొపులర్ కార్యక్రమాలు ఉండేవి. చిత్రలహరి, చిత్రహార్, ఎ జో హాయ్ జిందగీ, హం లోఒగ్, క్విజ్ టైం. సెలవరోజుల్లో అయితే సాయంత్రం ఏడు గంటలకి వార్తలు వచ్చే ముందర ముప్ఫై నిమిషాల హైదరాబాద్ దూరదర్సన్ వారి నాటకం, అంతకు ముందు వచ్చే రైతుల కార్యక్రమం అన్ని వరస పెట్టి చూసే వాళ్ళం. స్కూల్ లో న్యూస్ చదివే పిల్లలైతే, తప్పకుండా తెలుగు, హిందీ , ఇంగ్లీష్ న్యూస్ చూస్తే గాని నిద్రపొయ్యేవారు కాదు. శాంతి స్వరూప్ అనే ఒకాయన న్యూస్ చదివే వారని నాకు బాగా జ్ఞాపకం. అలాగే ఇంగ్లీష్ లో గీతాంజలి అయ్యర్ అని ఒకావిడ చదివేది. హిందీ న్యూస్ రీడర్ ఒకావిడ తలలో సైడ్ కి గులాబి పువ్వు పెట్టుకునేది. ఆవిడ పేరు గుర్తు రావట్లేదు. కొన్ని రోజుల తరవాత రామాయణ్ మరియు బునియాద్ ఆ తరవాత మహాభారత్ లాంటివి పొపులర్ అయ్యాయి వరసగా. తరవాత DD2 అని అనుకుంటా మొదలెట్టారు అందులో ప్రోగ్రామ్స్ నాకు అంతగా గుర్తులేవు. తరవాత కేబుల్ సిస్టం మొదలయ్యింది. ముందర మన ఇంటి దగ్గర "కేబుల్ అబ్బాయి" దగ్గర కనెక్షన్ తీసుకుని, వస్తు పోతు ఈ రోజు ఈ సినిమా వేస్తావా, ఆ సినిమా వేస్తావా అని అడిగే వాళ్ళం. ఓ ఆరు నెలలో ఏదో అనుకుంటా ఆ ప్రక్రియ సాగిన తరవాత పిచ్చ పిచ్చగా చానల్స్ రావటం మొదలెట్టి ఓ యాడాదికి అసలు ఎ ఛానల్ ఎక్కడోస్తోంది, అందులో ఎం ప్రసారమవుతోంది, remote లో ఉన్న ఈ బటన్ ఎం చేస్తుంది అని జనాలు వీర లెవెల్ లో కొట్టుకునే టైం కి మనం దేశం విడిచి ఇదిగో ఇక్కడకొచ్చాం. ఆ తరవాత భారత దేశం లో చానల్స్ గురించి ఎక్కువ పట్టించుకోలేదు. అప్పుడప్పుడు, అమ్మ SPB గారి పాడుతా తీయగా గురించో మరోటో చెప్తే వినటం తప్ప. ఈ సుత్తంతా ఎందుకు వ్రాస్తున్నానంటే, పోయిన సంవత్సరం అమ్మ వాళ్ళు వచ్చినప్పుడు  ఒక అయిదారు చానల్స్ package కనెక్షన్ తీసుకున్నాం. అసలు జనాలు ఆ న్యూస్ చదవటం ఎంటండి బాబు? "ఈ రోజు ఆట లో ధోని అదరగొట్టాడు". ఏమిటిది? బాగా ఆడాడు అని చెప్పటం సొంపా? costumes అయితే కొంతమందివి పరమ వికారం గా. ఏదో వంటల కార్యక్రమం అట. ఆ anchor ఒక వంట చేసే ఆవిడని "మొదట ఎం చెయ్యాలండి?" అని అడిగితే ఆవిడ సమాధానం "స్టవ్ వెలిగించాలండి". ఆవిడ మీడియా ప్రొఫెషనల్ కాదు. అలాంటప్పుడు కొంచెం ముందర వాళ్ళతో మాట్లాడి ప్రోగ్రాం ఇంటెరెస్టింగ్ గా చెయ్యాలి కాని మరి తెలివి లేకుండా ఇదెక్కడి గొడవ. విసుగొచ్చేసింది. ఇంక మన చిన్నప్పటి టీవీ రోజులు మళ్ళి రావా?

Friday, May 20, 2011

నాలో కవయిత్రి, మ్యూజిక్ డిరేక్టరిత్రి నిద్ర లేస్తోంది.... లేచింది.... లేచేసింది

ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు, బేబీ గురించి ఆలొచిస్తూ, పాప ఏడ్చినప్పుడు ఏమేం లాలిపాటలు పాడాలి అని నాకు తెలిసిన పాటలన్నీ గుర్తు తెచ్చుకుని ప్రాక్టీసు చేసుకునే దాన్ని.
వటపత్ర సాయి కి వరహాల లాలి, ముద్దుల మా బాబు, గుడియా రాణి ఇవన్ని రోజు పాడుకునేదాన్ని. పుట్టిన వారం రోజుల నించి రోజు సాయంత్రం మూడు నాలుగు గంటలు ఏడ్చేది. ఒక్కొక్క సారి ఆ ఏడుపు విని చాలా బాధేసేది. మా అమ్మ నాన్న అయితే గిల గిల లాదిపోయ్యేవారు ఆ ఏడుపు విని. తరవాత తెలిసింది దాన్ని "colic " అంటారని అది బేబీకి  మూడు నాలుగు నెలలు వచ్చాక దానంతటదే తగ్గి పోతుందని. దాదాపు డిసెంబర్ చివరి వరకు ఆ నొప్పి ఎలా  భరించిందో ఆ దేవుడి కే తెలియాలి. సాయంత్రం అవుతోందంటే మా అమ్మా, నాన్న భయపడి పొయ్యేవారు. ఎవరైనా ఇంటికొస్తే మాత్రం ఏడిచేది కాదు. నేను ఆఫీసు నించి వచేవరకు అమ్మ నాన్న ప్రాణాలు అరిచేతులు పెట్టుకున్నట్టు ఉండేవారు. Anyway , ఆ ఏడుపుని నా పాటలు అస్సలు ఆపేవి కాదు. దాంతో పాటలు పాడటం కొన్ని రోజులు మానేసాను. ఎవరో చెప్పారు కొంచెం secure గా బ్లాంకెట్ లో చుట్టి పెడితే కాళ్ళు చేతులు ఆడించకుండా పడుకుంటారు, అది కొలిక్ తగ్గిస్తుంది అని. అందుకని "burrito wrap " చేసి పడుకోపెట్టేవాళ్ళం. ఒకరోజు అల్లాగే చుట్టి ఎత్తుకుని ఊపుతుంటే, నేను ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు "Moe 's " లో తిన్న burrito గుర్తొచ్చింది. నాకు తెలీకుండానే ఒక పాట/కవిత వ్రాసేసి, పాడేశా. ఆశు కవిత్వం అంటారు కదా? ఆ టైపు లో. వదల మంటారా. అనఖర్లె. ఇదిగో.

పల్లవి:"చిన్న బరిటో, చిట్టి బరిటో, పొట్టి బరిటో, టుట్టి బరిటో"
అనుపల్లవి:"నిన్ని బరిటో, బన్ని బరిటో, డిన్ని బరిటో, మిన్ని బరిటో"

Guacamole ఉందా? బ్రౌన్ రైస్ ఉందా?
గ్రీన్ బీన్స్ ఉన్నాయా? పెప్పర్స్ ఉన్నాయా? "చిన్న"

కారట్స్ ఉన్నాయా? చిల్లీస్ ఉన్నాయా?
టోమాతోస్ ఉన్నాయా? సాల్సా ఉందా?  "చిన్న"

olives ఉన్నాయా? cucumbers ఉన్నాయా?
sour క్రీం ఉందా? cilantro ఉందా? "చిన్న"

ఎక్కడనించి వచ్చావు? mexico నా? puerto rico నా?
taco బెల్లా? చిపోట్లే నా? "చిన్న"

రా బరిటో , కూర్చో బరిటో
పడుకో బరిటో, నిద్రపో బరిటో
చిన్న బరిటో చిట్టి బరిటో
యమ్మి బరిటో ...... అమ్మ బరిటో

ఎలా ఉంది మన టాలెంట్? అలా తప్పట్లు కొట్టకండి. నాకసలే modesty ఎక్కువ బాబు.
అబ్బో అసలు నేను... ఆజ్జ బాబో (మెలికలు తిరిగి పోతున్న నేను)

Thursday, May 19, 2011

మాతృత్వం : "The fun begins"

2009 లో నా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి ఇరవై ఒకటో రోజు ఫంక్షన్ కి వాళ్ళ ఊరు (బోస్టన్) రమ్మని పిలిచింది. ఆవేళ స్నో ఉండటం తో మేము తప్ప ఇంకెవ్వరు రాలేదు. వాళ్ళ అమ్మగారు ఆరోజు బాబుని తొట్టిలో పెట్టిన తరవాత నన్ను , సంధ్యని నిలపెట్టి ఒక బకెట్ లో నీళ్ళు పెట్టి, బావిని simulate చేసి, సంధ్య తో నాకు తాంబూలం ఇప్పించి, నా వీపు మీద దానితో రెండు సార్లు కొట్టించి, తాంబూలం లో పెట్టిన ఒక లడ్డు, వెల్లుల్లి నన్ను మా ఆయన్ని తినేయ మన్నారు. ఆ లడ్డుని కాయం అంటారని, అవి తింటే పిల్లలు పుడతారని చెప్పారు. ఇది నాకు ముందే మా అమ్మ చెప్పడం తో ఇంటికి వచ్చాక ఇద్దరం ఆ లడ్డూ ముక్కని నోట్లో వేసుకున్నాం. అంతే, మా ఇద్దరి మొహాలు చూడాలి. అందులో స్వీట్ తప్ప ప్రపంచం లో ఉన్న వేరే రుచులన్నీ ఉన్నాయి. ఘోరం గా ఉంది. సరే వెల్లుల్లి పులుసులో వేసేసుకున్నాం. మూడు నెలల తరవాత నేను కన్సీవ్ అయ్యాను. అందరూ అది కాయం ప్రభావమే అన్నారు. నేనైతే దేవుడి దయ అనుకున్నాను. ఆగష్టు ఇరవై ఐదో తారికున అమ్మ, నాన్న పొద్దున్నపదింటికి వస్తారని వంట చేసి ఇంటర్నెట్ లో ఎయిర్ ఇండియా వెబ్సైటు తెరిచాను. బొంబాయి నుంచి బయలు దేరే ఫ్లైట్ ఆలస్యమవడంతో మరి అసలు ఫ్లైట్ లో ఉన్నారో లేదా ఫ్లైట్ మిస్ అయ్యి తరవాతి ఫ్లైట్ కి వస్తున్నారో అని ఆలోచిస్తుంటేనే సాయంత్రం నాలుగైపోయింది. నాకు టెన్షన్ మొదలయ్యింది. JFK కి వచ్చి connecting delta ఫ్లైట్ లో అట్లాంటా రావాలి. ఆలోచిస్తూ, ఎయిర్ ఇండియా కి ఫోన్లు చేస్తుండగానే సాయంత్రం ఆరయ్యింది. ఫోన్ల సారాంశం ఏంటంటే అమ్మా, నాన్న బొంబాయి లో ఫ్లైట్ ఎక్కారు కాని delta ఫ్లైట్ ఎక్కలేదు. ఎం చెయ్యాలో అర్ధం అవ్వట్లేదు. ఆరున్నరకి మా అమ్మ ఎవరి ఫోన్ లోంచో కాల్ చేసి ఇప్పుడే అట్లాంటా ఐర్పొర్ట్ లో దిగాము వచ్చి మమ్మల్ని తీసుకెళ్ళు అని చెప్పింది. ఇంత పెద్ద పొట్ట వేసుకుని వెళ్ళిన నన్ను చూసి మా అమ్మ మురిసిపోయింది. నాన్న మోహంలో ఆనందం. emotions ని కళ్ళల్లోనే చూపిస్తారాయన. పెదవుల మీదకి ఎప్పుడు తీసుకురారు.
ఇక వాళ్ళు చెప్పిన ప్రయాణపు పదనిసలు:
JFk లో దిగగానే ఎయిర్ ఇండియా వాళ్ళు టికెట్స్ చేతికిచ్చి, మీ ఫ్లైట్ మిస్ అయ్యింది, మీకు అమెరికన్ ఎయిర్ లో తికెట్ తీసుకున్నాము, ఫలానా గేటు కి వెళ్ళండి, మీ suitcase మేము అమెరికన్ ఎయిర్ కి పంపిస్తాము అని చెప్పాడట. వీళ్ళు అమెరికన్ ఎయిర్ కి చెక్ ఇన్ కి వెళ్తే, వాళ్ళు ఈ ఫ్లైట్ ఇక్కడ నించి కాదు, లగాడియా airport నించి అని చెప్తే అమ్మా నాన్న ఐర్పొర్ట్ నించి బయట పడి, shuttle లో లగాడియా చేరుకున్నారు. అప్పటికే boarding మొదలయ్యింది. అట్లాంటా లో వాళ్ళ బాగ్స్ కనిపించలేదు. అమెరికన్ ఎయిర్ వాళ్ళేమో ఫిరియాదు నమోదు చేసుకున్నారు. నేను వెళ్లి కూడా మళ్లీ అన్ని వివరాలు చెప్పి మొతానికి బయట పడ్డాం. దారిలో నాకు అర్థం అయిపోయింది వాళ్ళ మనసంతా సామాను మీదే ఉందని. వాళ్ళని ఆ టాపిక్ నుంచి divert చెయ్యటం నా వల్ల కాలేదు. ఇంకా చూసుకోండి ఎయిర్ ఇండియా కి, అమెరికన్ ఎయిర్ కి రెండు రోజులు ఏక బిగిన ఫోన్లు. మొతానికి తేలింది ఏంటయ్యా అంటే, బాగ్గులు JFK లోనే ఉన్నాయి. చివరికి మూడు రోజుల తరవాత అవి మాదగ్గరకి చేరాయి.
అప్పుడింక అమ్మ సీమంతం preparations మొదలుపెట్టింది. మా ఆయన ఇక్కడ ఉండరు కాబట్టి, డెలివరీ టైం కి తను లీవ్ తీసుకోవాలి కాబట్టి ఇప్పుడు తీసుకోవటం కుదరదు కాబట్టి చిన్నగా పూర్తి చేసేద్దాం అని డిసైడ్ అయ్యాం. సరే శనివారం అని అనుకున్నాక ఆఫీసు లో పిలవాల్సిన వాళ్ళందరికీ ఈమెయిలు పంపించాను. మా ఆయనేమో ఆ వారాంతం డ్రైవ్ చేసి ఆదివారం మధ్యాన్నం కి వచ్చేస్తానన్నారు. బుధవారం కొంచెం discomfort అనిపిస్తే, డాక్టర్ ఆఫీసు కి ఫోన్ చేసాను. మీ డాక్టర్ ఇవ్వాళ్ళ డ్యూటీ లో లేరు, వేరే ఆవిడ ఉన్నారు, ఒకసారి వచ్చి చెక్ చేయించుకోండి అంటే వెళ్లాను. ఆ డాక్టర్ నాకు "this is not labor. labor is a lot more severe than this. When you are in labor, you will know . They call it labor for a reason. come back if your contractions are five minutes apart" అని పెద్ద క్లాస్ తీసింది. సరే కాబోలు అనుకుని ఇంటికెళ్ళాను. అసలు contraction అనగానేమి? తెలీదు. ఎందుకంటే, హాస్పిటల్ లో చెప్పే క్లాసులకి నే వెళ్ళలేదు. ఎందుచేత? సింపుల్. భయం వేసి. labor ఎలా ఉంటుందో తెలుస్తే భయం వేస్తుంది, "ignorance is bliss" అన్న టైపు లో ఉండి పోదాం అని. సరే గురువారమ సుబ్భరంగా సాయంత్రం ఆరున్నర వరకు వర్క్ చేసి ఇంటికోచేసా. నేను చేస్తున్న ఇంకో పనేంటంటే ప్రతి రోజు పది-పదిహేను నిమిషాలు ట్రైన్ స్టేషన్ కి నడిచి వెళ్లి ట్రైన్ ఎక్కటం, మళ్లీ సాయంత్రం తిరిగి ట్రైన్ దిగి నడిచి రావటం. సరే గురువారం ఇంటికొచ్చి అమ్మ పెట్టిన అన్నం కూర తిని అమ్మ తెచ్చిన చేకోడిలు, లడ్లు (అవును, లడ్లె, ఒక లడ్డు కాదు, ఏకంగా నాలుగైదు) ప్లేట్లో పెట్టుకుని కంప్యూటర్ మోదేసుక్కూచున్నా. రాత్రి పదిన్నరకలా కడుపులో ఒక టైపు లో నొప్పి మొదలయ్యింది. అది రాత్రంతా ఉండి, పోద్దున్నకేక్కువయ్యింది. రాత్రి మొత్తం బాత్రూం లోకి వెళ్ళాలని అని పిస్తోంది కాని ఏమి అవ్వట్లేదు. అనవసరం గా లడ్లు తిన్నానేమోరా బాబు, కడుపు అప్సెట్ అయ్యినట్టుంది అనుకున్నా.సరే పొద్దున్నే ఉద్యోగానికి పోవాలి కదా? దానికి తోడు మీటింగ్ ఒకటి అటెండ్ అవ్వాలి. "అవసరం అయితే టాక్సీ లో వెళ్లి పోతాను" అని అమ్మ తో చెప్పి, స్నానానికని బాత్ రూం లో దూరా. స్నానం చేస్తుంటే lower stomach లో తిమ్మిరి టైపు ఫీలింగ్, నొప్పి (= contraction ). బయటకి వచ్చాక మా అమ్మ "వెధవ గోల జుట్టు విరబోసుకు తిరుగుతారు. ఎ దిష్టి అయినా తగిలిందేమో. ఉండు ముందు సుబ్భరంగా నునే రాసి జడ వేస్తాను" (మా అమ్మ సుబ్బరం గా నూనే అంది అంటే ఆరోజు నన్ను స్కూల్ లో అందరు "మీ నాన్న కొత్త నునే ఫ్యాక్టరీ కొన్నారా అని ఏడిపించే వారు"). "అమ్మా నొప్పెడుతోంది, మీటింగ్ కి వెళ్ళాలి, అన్నం పెట్టు, జడ తరవాత". "బేబీ తల descend అవుతోందేమో, ఇవి నొప్పులే అయితే సీమంతం చెయ్యడం కుదరదు. ఒక్కసారి పట్టు చీర కట్టేసుకోవే. నాన్న ఫోటో తీసేస్తారు" "అమ్మా ప్లీజ్ నొప్పెడుతోంది, కళ్ళు తిరుగు తున్నాయి. ఎం చెయ్యనే". "ముందు దానికి ఒక బిస్కెట్ ఇచ్చి కూర్చో పెట్టు, పాపం నొప్పి అంటోంది కదా" ఇది మా నాన్న. మా తోటి కోడలికి ఫోన్ చేసాను. ఆవిడేమో "ఏమి పరవాలేదు. due డేట్ ఇంకా పదిహేను రోజులుంది కదా? కొంచెం మంచి నీళ్ళు తాగి పడుకోండి. తగ్గి పోతుంది". ఎందుకైనా మంచిది అని సెల్ ఫోన్ పుచ్చుకుని contractions టైం చేశా. మొదట పది నిమిషాల కొకటి, తరవాత ఏడు నిమిషాల కొకటి ఇంకొంచెం సేపయ్యాక మూడు నిమిషాల కొకటి. ఇది లాభం లేదని డాక్టర్ ఆఫీసు కి ఫోన్ చేశా.
నర్స్: మీ పేరు
నేను: కిరణ్మయి
నర్స్: స్పెల్లింగ్ చెప్పండి
నేను: k-i-r-a-n, n for nancy, m for monkey.......
నర్స్: సోషల్ సెక్యూరిటీ నెంబర్
నేను: నీ మొహం మండా నాకు నొప్పి పెడుతోంది తల్లొఇ (మనసులో)
నర్స్: ఎన్ని నిమిషాలకొక ..........
మా అమ్మ: ఇదేక్కడ గొడవే. నంబర్లు చెప్తూ కూచుంటే ఎలా?
.......................
నర్స్: ఇప్పుడు ఆఫీసు కి రాగాలుగుతారా?
నేను: వస్తున్నా తల్లి. ఇదిగో ఇప్పుడే.
కాని ఎందుకో టాక్సీ పిలవాలని పించక అంబులన్స్ కి ఫోన్ చేశా. paramedics వచ్చినప్పుడు మా appartment వాళ్ళు చూసి, మా నాన్నని హాస్పిటల్ దగ్గర దింపటానికి వచ్చారు. నాకు తెలిసిన తమిళ్ అమ్మాయి ఇల్లు తాళం వేస్తానంది. హాస్పిటల్ కి వెళ్ళగానే నొప్పి భరించలేక గట్టి కేక పెట్టా. అందరు వింతగా చూసారు. I don't give a damn అనుకుని మళ్లీ నొప్పేట్టగానే ఇంకా గట్టిగా అరిచా. అప్పటికి నన్ను రూం లోకి తీసుకెళ్ళి పొయ్యారు. నర్స్ ఒకమ్మాయి టిక్కు టక్కు లాడించుకుంటూ వచ్చి "నొప్పులంటే అల్లానే ఉంటాయి. అరవకు" అని కొట్టినట్టు చెప్పింది. నువ్వు నాకు మళ్లీ కనపడక పోతావా అనుకుని పంటి బిగువన నొప్పి ఒర్చుకోవటానికి ట్రై చేశా. ఇంతలో ఇంక్కావిడ వచ్చి"నీ పేరు ఎలా ప్రొనౌన్స్ చెయ్యాలి?" అంది. నా పేరు చెప్పించే టప్పటికి నాలో ఉన్న సహనం కాస్త నశించింది. ఇక వీర లెవెల్ లో నొప్పి మొదలయ్యింది. పేరు అడిగిన అమ్మాయి "పుష్ కిరణ్మయి , పుష్" అని అరవటం, డాక్టర్ ఒకటి నించి పది లెక్కపెట్టటం, "ఒర్చుకోమ్మా ఇంకొంచెం సేపే" అని మా అమ్మ చెప్పటం, నా బాధ చూడలేక మా నాన్న రూం లోంచి బయటకి వెళ్ళటం, "ఐ కెన్ సి యువర్ బేబీ'స్ హెడ్" అని డాక్టర్ అనటం, నాలో బరువేదో అమాంతం తగ్గి పోవటం, నేనో పెద్ద గమ్యం సాధించినట్టు అందరు అరవటం, "హియర్, సి యువర్ బేబీ" అని ఎవరో అనటం, మా అమ్మ కళ్ళ నీళ్ళు పెట్టేసుకోవటం, అంతా ఒక నలభై నిమిషాల్లో జరిగి పోయింది. మా అమ్మ దగ్గర ఫోన్ తీసుకుని మా ఆయనకీ ఫోన్ చేశా "బేబీ ఇస్ హియర్. స్టార్ట్ డ్రైవింగ్" అనగానే కుర్చీలో ఒక్కసారి కూర్చుండి పొయ్యి "I don't know what to say. give me a minute" అన్నాడు తను. ఇంకేం అంటాడు?

Sunday, January 2, 2011

మళ్ళి బ్లాగ్ లోకం లో నేను

అందరికి కొత్త సంవత్సర శుభాకాంక్షలు. గత కొద్ది నెలలుగా నేను టపాలు పెట్టలే. విషయం ఏమిటంటే పోయిన సంవత్సరం సెప్టెంబర్ లో మాకు పాప పుట్టింది. సంయుక్త మనస్విని అని పేరు పెట్టుకున్నాం. అప్పటి నించి మాతుత్వం లో తన్మయత్వం అనుభావిస్తున్నానన్నమాటే గాని రోజుకి ఇరవై నాలుగు గంటల సమయం చాలటం లేదు. ఆరు వారాలవ్వగానే ఉద్యోగం లో జాయిన్ అవ్వాల్సి వచ్చింది. (ఇదెక్కడి అన్యాయం అని అడగకండి. అదంతే). అప్పటినుంచి ఇల్లు, ఆఫీసు, ఇదే పని. ఇంతక ముందు పుస్తకాలు చదువుకునేదాన్ని, రకరకాల వంటకాలు ట్రై చేసేదాన్ని, టీవీ చూసేదాన్ని. అబ్బే. అల్ తట్ వ్యాస్ లాంగ్ టైం అగో. సెప్టెంబర్ నుంచి ఎక్కడ పనులక్కడే. వీలున్నప్పుడు నాకిష్టమైన బ్లాగ్స్ చదువుకున్నా, కామెంట్లు పెట్టటానికి ఒపికుండేది కాదు. ఇప్పటినుంచి మళ్లీ వీలున్నపుదల్లా టపాలు (మరియు కామెంట్లు) పెడదామని నిర్ణయించేసా.

Tuesday, June 8, 2010

New Jersey లో బాలు


ఇప్పుడే సుజాత గారు బాలు గారికి వ్రాసిన లేఖ చూసా. రెండు వారల క్రితం న్యూ జెర్సీ లో ఆయన లైవ్ ప్రోగ్రాం కి వెళ్లాం. దాని మీద టపా వ్రాద్దాం వ్రాద్దాం అని బాధకిస్తున్డగానే సుజాత గారు తట్టి లేపినట్టుగా ఉంది ఆవిడ లేఖ.
ప్రోగ్రాం సాయంత్రం ఆరున్నరకి అంటే, ఆరు గంటలకల్లా వెళ్ళాం. చాంతాడంత లైను, పట్టు చీరల్లో వచ్చిన ఆంటిలు. సరే లైనులో నిలపడ్డాక "cameras not allowed" అని గుస గుస వినిపించింది. ఆఫీసు లో అడిగితే ఆడిటోరియం రూల్స్ వేరు, ప్రోగ్రాం రూల్స్ వేరు, మీరు అర్గానైజేర్స్ ని కనుక్కోండి అన్నారు. ఆ రద్దీ లో మనకి అర్గానైజేర్స్ ఎలా తెలుస్తారులే అని మా ఆయన్ని కామెర కార్ లో దాచమని చెప్పి నేను లైను లో నిలపడ్డా. ప్రోగ్రాం మొదలయ్యేసరికి ఏడున్నర. బాలు ని స్టేజి మీదికి ఆహ్వానించినప్పుడు చాలా సేపు standing ovation. అదే రోజు ప్రముఖ గేయ రచయిత వేటూరి పోయారని, ఆయన పాట "వేదం అణువణువున నాదం" తో మొదలు పెట్టారు. అన్నట్టు ఈ ప్రోగ్రాం లో ప్రముఖ గాయని ఎస్. పి. శైలజ కూడా పాల్గున్నారు. అప్పుడు బాలు అన్నారు "మాకు సమాచారం కొన్ని గంటల ముందే అందింది. సాధారణం గా ఇలాంటి విచారకరమైన రోజున నేను ఇండియా లో అయితే ప్రోగ్రాం చెయ్యను. కాని ఇక్కడ అలా చెయ్యటానికి వీలు లేదు అందుకని నాకు చాతనైనత వరకు ఈ ప్రోగ్రాం కి న్యాయం చేస్తాను" అని. దాదాపు ఒక ఇరవై పాటల్ని ఆయ పాడుంటారు . మిగతావి శ్రీ కృష, కల్పనా మరియు శైలజ గారు పాడారు. ఆయన "శంకరా...." అని మొదలెట్టగానే auditorium అంతా ఆగకుండా చప్పట్లు. సిరి సిరి మువ్వలో "రా దిగిరా..", "వీణ వేణువైన సరిగమ.." కూడా చాల బాగా పాడారు. జనాలంతా అరుస్తూ పాటలు రిక్వెస్ట్ చేస్తే చివరికి "మీరైతే రోజు కారులో పెట్టుకుని వింటారు కాబట్టి మీకు గుర్తుంటాయి. ముప్ఫై వేలకి పైగా పాటలు పాడాను. నాకెలా గుర్తుంటాయి చెప్పండి?" అన్నారు. చివరికి భరించలేక ఆడియన్సు అరుస్తున్న పాటలన్నీ ఒక్కొక్క దాని పల్లవి పాడారు. "కుర్రాళ్ళో కుర్రాళ్ళు", "ఆరేసుకోబోయి" పాడలేదని నేను డిస్సప్పాయింట్ అయ్యాను. మధ్యలో ఒకసారి "కావాలంటే ఫోటోలు తీసుకోండి కాని వీడియొ మాత్రం తీయకండి" అని ఆయన అనంగానే మొదలైన క్లిక్లు ప్రోగ్రాం పూర్తయ్యేంత వరకు ఆగలేదు.
Belated Happy Birthday Balu.