Saturday, July 9, 2011

ప్రతిబింబం

"వెల్, ఐ ఎన్జోఎడ్ ది ఫస్ట్ డే అఫ్ క్లాస్. హోప్ యు డిడ్ టూ. ఐ విల్ సి యు ఇన్ ది నెక్స్ట్ క్లాస్" అంటూ నిన్నటి మొదటి క్లాస్ ముగింఛి బయటకి నడిచాను. ఒక్కొక్క విద్యార్థి అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పుకుంటూ, పిచ్చాపాటి మాట్లాడుతూ క్లాసు బయటకి వచ్చేటప్పటికి అయిదున్నర దాటింది. అదే ఆఖరు క్లాసు అవడంతో తిన్నగా కార్ వైపు నడిచాను. "డాక్టర్ శ్రీ రామా, హాంగ్ ఆన్ వన్ సెకండ్ ప్లీజ్" వెనకాల పరిగెడుతూ వస్తోంది నాన్సీ. అమ్మా, నాన్న ఎంతో ముద్దుగా పెట్టుకున్న పేరు "శ్రీ రమ". ఇక్కడకోచ్చాక, శ్రీ రామా గా మారింది.  నాన్సీ భలే చురుకైన పిల్ల. సాయంత్రం అయినా, రోజంతా ల్యాబ్ లో రిసెర్చ్ చేసి చేసి ఉన్నా, నా దగ్గర టీచింగ్ అసిస్టెంట్ షిప్ చేసేటప్పుడు మాత్రం ఎప్పుడు నవ్వుతూనే ఉంటుంది. దేవుడు కొంత మందికే ఆ వరం ఇస్తాడెమో.  హైదరాబాద్ లో ఎం ఫిల్ చేసి, యునివర్సిటీ అఫ్ పెన్సిల్వేనియా లో గణితశాస్త్రం లో పి హెచ్ డి పట్టా పుచ్చుకుని, చిన్న, చితక కాలేజీ లలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేసి, అయిదేళ్ళ క్రితమే, మా ఆయన ఉద్యోగం మారటం తో, అసోసియేట్ ప్రొఫెసర్ గా వెర్మోంట్ లో ఉన్న ఈ కాలేజీ కి వచ్చాను. మా ఆయనకి వచ్చిన ఉద్యోగం తనకి చాల నచ్చటం ఒక కారణమైతే, వెర్మోంట్ లో ఉన్న ప్రకృతి అందాలు నాకు చాల నచ్చటం ఇక్కడికి రావటానికి రెండో కారణం. "నిన్న మీరు చెప్పిన పనులన్నీ అయిపోయ్యాయి, ఇంకేదయినా కావాలంటే ఈమెయిలు చెయ్యండి. ఇదిగో క్లాసు లిస్టు. మీకు తెలుసా? మీ లాస్ట్ నేమ్ తో ఒక స్టూడెంట్ ఉంది క్లాసు లో" అంటూ లిస్టు చేతికిచ్చి, గడ గడా ఇంకో పది నిమిషాలు కబుర్లు చెప్పి వెళ్ళిపోయింది.
ఈరోజు క్లాసు కి వెళ్ళేవరకు మళ్ళి ఆ లిస్టు వైపే చూడలేదు. క్లాసు ముగించుకుని పుస్తకాలన్నీ బాగ్ లో సద్దుతూ ఉంటె ఎవరో నా వైపే తీక్షణం గా చూస్తున్న భావన. తల పైకెత్తి చూసాను. నా వైపే చూస్తున్న అమ్మాయి. అది కాదు నన్ను ఆకట్టుకున్నవిషయం. ఆ అమ్మాయి చిన్నప్పటి నా ప్రతిబింబం లా ఉంది. ఒక్క క్షణం నాకే ఆశ్చర్యం వేసింది.  నా దగ్గర కొచ్చి "హాయ్ ఐ అం జేన్నిఫెర్. ఐ థింక్ యు నో మీ. ఐ లుక్ ఫార్వర్డ్ టు బీఇంగ్ ఇన్ యువర్ క్లాస్". ఇదేంటి? గొంతు కూడా చిన్నప్పటి నా గొంతు లానే ఉంది. జేన్నిఫెర్. ఓహ్ మై గాడ్. పోలికలు ఇంత స్పష్టం గా ఒక తరం నించి ఇంకో తరం కి సంక్రమిస్తాయా?
"హాయ్", తెలిసిన, తెలియని వాళ్ళ పలకరింతలకి మర్యాదగా సమాధానం చెప్తూ అస్తవ్యస్తంగా నా రూం కి వెళ్లాను. ముందు చల్లటి మంచినీళ్ళు తాగాలి. గొంతులో తడారిపోతోంది. అర్జెంటు గా నాలుగైదు కష్టమైన లెక్కలు చేసి మనసు చల్లబరుచుకున్నాను. లెక్కలు నా అభిరుచి, బ్రతుకు తెరువు మాత్రమే కాదు. నా వ్యసనం. మనసుని మళ్లించాలంటే లెక్కలు ముందేసుకుని కూర్చోవటం నా అలవాటు. అప్పుడు చూసాను నిన్న నాన్సి ఇచ్చిన క్లాసు లిస్టు. జేన్నిఫెర్ ఇంటి పేరు మీద నా కన్ను పడింది. అమెరికన్లు పలకలేని స్వచ్చమైన తెలుగింటిపేరు. ఆ పేరు పలకలేకే, నన్ను అందరు డాక్టర్ శ్రీ రామా అంటారు. అవును. నాది ఆ అమ్మాయిది ఒకే ఇంటి పేరు.

ఎవరో తలుపు కొట్టటంతో బయటికి వెళ్తే ఎదురుగా జేన్నిఫెర్. "ఐ అం సారీ. మిమ్మల్ని ఇవ్వాళ క్లాస్ లో అప్సెట్ చేసానా? అమ్మ మీ పేరు, మీరు చదివిన యునివర్సిటీ చెప్తే, మిమ్మల్ని ఇంటర్నెట్ లో వెతికి పట్టుకుని, కనీసం ఒక్క ఫ్యామిలీ మెంబెర్ కైనా దగ్గరున్దామని ఈ కాలేజీ లో చేరాను. నన్ను అర్ధం చేసుకుంటారని అనుకుంటున్నాను" ఈ మధ్యే తెలుగు నేర్చుకున్నట్టుంది. మొహం లో నాలాగ భావాల్ని చూపించటం ఈ అమ్మాయికి ఎలా వచ్చింది. మా అమ్మాయికి కూడా నా పోలికలు ఇంత స్పష్టం గా రాలేదు. "ఫరవాలేదు. లోపలి రా" అని ఆహ్వానించాను. "వెళ్లి పోవాలి. వేరే క్లాస్ ఉంది. రేపు రానా?" అభ్యర్ధన గా అడిగింది. "అలాగే. లంచ్ కి కలుద్దాం".

ఎలాగోలా ఆ రోజుకి మిగతా పాఠాలు ముగించుకుని ఇంటికి బయలుదేరాను. దారి పొడుగునా గత స్మృతులు నన్ను చుట్టుముట్టాయి.

మా నాన్న మా ఊర్లో చాలా పేరున్న లాయర్. చూట్టు పక్కన ఊళ్ళనించి కూడా చాల కెసులోచ్చేవి. పేదవాళ్ళ లాయర్ అనేవాళ్ళు. ఎంత ఇవ్వగలిగితే అంతే ఫీజు. ఒక్కొక్కసారి అరిటి పళ్ళు, వాళ్ళ ఇళ్ళల్లో పండిన కూరగాయలు తెచ్చిచేవారు పేద వాళ్ళు. చిన్న పిల్లలతో వస్తే వాళ్లకి నా చాక్లెట్లు, బిస్కట్లు ఇవ్వటం. వాళ్ళు ఏమి ఇవ్వలేకపోతే మా ఇంటిలోనే రాత్రి భోజనం, పొద్దున్న కోర్టుకు వెళ్లేముందర కాఫీ, పలహారం. అమ్మా, పెద్దమ్మ కూడా అంతే. మా నాన్నకి ఇద్దరు భార్యలు. మా అమ్మ చిన్నావిడ. కోర్ట్ ఉద్యోగి గా మా అమ్మ వచ్చినప్పుడు వాళ్ళ పరిచయం అయ్యింది.
సమాజాన్ని ఎదిరించి పెళ్ళైతే చేస్కుంది కాని మా అమ్మ సమాజం లో తన ఉనికిని కోల్పోయింది. ప్రేమ కొన్ని రోజులకి కోపంగా, చిరాకుగా చివరికి బాధగా మారేలోపల నేను భూమి మీద పడ్డాను. మొదట నేను, నాన్న, ఉద్యోగమే తన ప్రపంచం. మెల్ల మెల్లగా నాన్న ఆ ప్రపంచంలోకి  అప్పుడప్పుడు వచ్చే అతిధి మాత్రమే అయ్యారు. భౌతికంగా రెండు చోట్ల రెండు రోజులకొకసారి ఉన్నా, ఆయన మనసు మాత్రం పని మీదే. పెద్దలనాటి ఇల్లు, అయిదుగురు అన్నదమ్ములు, నలుగురు అక్క చెల్లెళ్ళు. అదే ఆయన ఆస్తి. అమ్మ, నేను నాన్న వేరే ఇంట్లో ఉండేవాళ్ళం. చూట్టు పక్కల అందరికి అమ్మ మీద గాఉరవం ఉన్నా, అమ్మ "రెండో ఆవిడ" గానే మిగిలి పొయ్యింది. ఇద్దరాడపిల్లలు, ఒక మగ పిల్లవాడి తల్లి అయిన పెద్దమ్మ జీవితం లో ఏదో వెలితి. తాతలనాటి ఇంట్లో ఆవిడ, పిల్లలు ఉండేవారు. పై పై కి అంతా బాగానే ఉన్నా, అక్కా అన్న అని పిలిచి, పిలిపించుకున్నా, పెద్దన్నాన్నల, బాబాయిల పిల్లలు నన్ను బయిట దాని లాగే చూడడం నాకు పెద్దవుతున్న కొద్ది స్పష్టమయ్యేది. అప్పుడే నాన్న హైదరాబాద్ కి ప్రాక్టీసు మార్చారు. సిటీ. కొత్త ప్రపంచం. ఇళ్లు, స్కూళ్ళతో బాటు, మా మనసులు దూరమయ్యాయి.  నాన్న ఎప్పటి లానే రెండు రోజులిక్కడ, రెండు రోజులక్కడ.  నా గురించి తెలిసిన చుట్టాలకి నా మీద, మా అమ్మ మీద రెండే రెండు రకాల భావాలు ఉండేవి.అయితే జాలి లేక అసహ్యం. ఈ విషయం నాకు రోజు రోజు కి స్పష్టం అయ్యేది. ధైర్యం చేసి నన్ను అడిగిన వాళ్ళని నాకు తోచిన తర్కం తో ఒప్పించేదాన్ని, చేసింది తప్పే అయితే దానికి మా నాన్న కూడా బాధ్యులేనని, మా అమ్మ మాత్రమే కాదని. అడగని వాళ్ళు చూసే చూపులే భరించటం కష్టం అయ్యేది. బాధ భరించటం కష్టం అయినప్పుడు మనిషి మనసు మళ్లీన్చుకునే  ప్రయత్నం చేస్తాడు. నేనూ చేసాను. లెక్కలతో. చుట్టుపక్కల నా అంత బాగా లెక్కలు చేసే వాళ్ళు ఎవ్వరు ఉండేవారు కాదు. నా తోటి పిల్లలందరూ geometry తో కుస్తీ పడుతుంటే, నేను అది పూర్తి చేసేసి కాల్కులస్ మీద పట్టు సాధించాను. నా స్నేహితులందరూ ప్రోబబిలిటి తో బుర్ర బద్దలు కొట్టుకుంటుంటే, నేను విశ్వవిద్యాలయం లైబ్రరీ నించి statistics పుస్తకాలు తెచ్చి చదువుకున్నాను.మన జీవితానికి ఒక లక్ష్యం పెట్టుకుని దాన్ని సాధించటం కోసం కష్టపడటంలో నిమగ్నమైతే మనసులో బాధని మానిపించటం తేలికని, ఆ లక్ష్యాన్ని గనక సాధిస్తే సమాజం లో మనకి గౌరవం దానంతటదే వస్తుందని అనిపించిది. అంతే. ఆ లక్ష్య సాధనలో పడ్డాను. నా కాళ్ళ మీద నేను నిలపడాలి. ఎవ్వరి దగ్గరా ఏది ఆశించకూడదు.
నాకు ఇంజనీరింగ్ లో సీట్ రాలేదు. పెద్దమ్మ కొడుకు కృష్ణన్నయ్య ఫీజు కట్టి ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీ లో చేరితే నేను బి ఎస్ సి లో చేరాను. తను ఎం ఎస్ కోసం అమెరికా కి వెళ్తే నేను ఎం ఎస్ సి చేసి తరవాత ఎం ఫిల్ చేసాను. క్రిష్ణన్నయ్యకి చాలానే సంబంధాలు వచ్చాయి. ప్రతి సంబంధాన్ని, మా పిల్లాడికి తగదంటూ వదిలేసుకున్నారు నాన్న, పెద్దమ్మా, అక్కయ్యలు. నాకు సంబంధాలు చూడడానికి ఎవ్వరు ముందుకు రాలేదు. మా పిన్ని తీసుకొచ్చిన ఒకటి, అరా సంబంధాలు నాకు నచ్చలేదు.  గౌరవంగా బ్రతకటానికి నాకు మగతోడు ఆఖర్లేదని, నన్ను నన్నుగా ఇష్టపడే వాడినే సమయమోచ్చినప్పుడే పెళ్లి చేసుకోవచ్చని అనుకుని, లెక్చరర్ పోస్ట్ లకి ఇంటర్వ్యూ లకి వెళ్ళటం మొదలెట్టాను. సిటిలోను, జిల్లాలలోను చాలా పేరున్న మూడు నాలుగు విద్యా సంస్థల్లో ఆఫర్లు వచ్చాయి. జిల్లాలకి వెళ్ళటం ఇష్టం లేక సిటి లో పోస్టింగ్ నే ఎంచుకున్నాను. ఒక సంవత్సరం ముగిసిన వెంటనే, నన్ను అమ్మాయిల కాలేజీ కి ట్రాన్స్ఫేర్ చేస్తామన్నారు. ఎందుకనడిగాను. "అమ్మాయిల కాలేజీ లో ఉన్న సారు గారు ఇక్కడ చెప్పటానికి ఉబలాట బడుతున్నారు మేడం. ఎలాగోలా సద్దుకోండి" అని సమాధానం వచ్చింది. ఇదేమైనా ట్రైన్ లో సామానా  సద్దుకొటానికి? అమ్మాయిని కాబట్టి అబ్బాయిల కాలేజీ లో చదువు చెప్పి మంచి పేరు తెచ్చుకుంటే అక్కడ ఉన్న "మేల్" లెక్చరర్ లకి అందరికి నామోషి. ఒళ్ళు మండి రిజైన్ చేసాను.
ఆ రోజుల్లోనే పీ హెచ్ డి చెయ్యాలని ఆలోచన వచ్చింది. జి ఆర్ ఇ, టోఫెల్ పరీక్షలు రాసి స్కాలర్ షిప్ సాదించాను. కొందరు శభాష్ అన్నారు కొందరు పెదవులు విరిచారు. నేను పట్టించుకోలేదు. అమ్మ మాత్రం నేను బయలుదేరే రోజు "నన్ను మర్చి పోకు" అంది. ఆ రోజు నించి ఈ రోజు వరకు ప్రతి రోజు కనీసం ఒక్క సారైనా అమ్మకి ఫోన్ చేస్తాను. రెండో సంవత్సరం నాన్న కేసు పని మీద యూరోప్ వచ్చి పని ముగించుకుని అమెరికా వచ్చారు. నెల రోజులు నాదగ్గరా నెల రోజులు కృష్ణన్నయ్య దగ్గర ఉన్నారు. అప్పటికే మా చుట్టాల కుటుంబాలలో నాన్న పెద్దమ్మ కుటుంబాన్ని నిర్లక్ష్యం చేసారని, అందుకే కృష్ణన్నయ్య దాదాపు పిచ్చివాడైయ్యాడని వార్తలు రాజ్యమేలుతున్నాయి. ఇవన్ని విని మా నాన్న మనసు గాయపడిందని నాకు తెలుసు. అందుకే నాన్న కృష్ణన్నయ్యతో చాలా సమయం గడిపి తను అడిగిన ప్రశ్నలన్నింటికి ఓపికగా సమాధానాలు చెప్పారని కూడా నాకు తెలుసు. నాన్న ట్రిప్ ముగించుకుని హైదరాబాద్ తిరిగి వెళ్ళారు. కృష్ణన్నయ్య, బాబాయ్ పిల్లలు అమావాస్యకో, పున్నమికో ఫోన్లు చేస్తున్నా, నా క్షేమ సమాచారాలు కనుక్కునేది మాత్రం నా స్నేహితులు మాత్రమే. ఉన్నట్టుండి ఒక రోజు మా అత్తయ్య కూతురు హైదరాబాద్ నుండి ఫోన్ చేసి, పిచ్చా పాటి మాట్లాడి, "మీ  అమెరికన్ వదిన ఎలా ఉంది" అనడిగింది. నాకర్ధం కాలేదంటే, తడపడి. "ఎం లేదులే" అంది. సరే వీళ్ళ గొడవ నాకెందుకులే అని నా పని నేచేసుకుంటుంటే అప్పుదోచ్చింది కృష్ణన్నయ్య ఫోన్. "నేను పెళ్లి చేసుకున్నాను" అన్నాడు ఉపోద్ఘాతం లేకుండా. "ఎవరా అమ్మాయి ఏంటా కధ" అనడిగాను. "ఇక్కడ పరిచయం అయ్యింది. పెళ్లి చేసుకున్నాం" అని సమాధానం చెప్పాడు. నాన్న మనసు గాయపడింది. ఆ విషయం కదిపితే మాట మార్చేసేవారు. కొన్ని రోజులకి హైదరాబాద్ వెళ్ళాను. పెద్దమ్మ ఇంట్లో ఫోటోలు చూసాను. అమెరికన్ అమ్మాయి, పేరు జెస్సికా. అన్నయ్య కన్నా రెండేళ్ళు పెద్దది. నాన్న కొంచెం తేరుకున్నట్టే అనిపించినా గాయం ఇంకా మానలేదు. మూడు నెలల తరవాత జెస్సికా ఫోన్ చేసింది. గర్భం తో ఉన్నానని, అన్నయ్య తనతో గొడవ పడి వెళ్లి పోయ్యాడని చెప్పింది. వినటం తప్ప ఏమి చెయ్యలేకపోయాను. సంవత్సరం తరవాత చివరి సారిగా ఫోన్ చేసింది. ఆడపిల్ల పుట్టిందని, జేన్నిఫెర్ అని పేరు పెట్టానని.

కాలం మన కోసం ఆగదు కదా? జీవితం ముందుకి సాగుతోంది. చదువులో ముందుకి సాగుతూ నేను ప్రగతిని సాధించే సమయంలో విధి నాకు పరీక్ష పెట్టింది. నా ప్రాణ స్నేహితుడు శశాంక్ రూపం లో. ఒక రోజు అర్ధాంతరంగా వచ్చి పెళ్లి చేసుకుంటానన్నాడు. నాన్న సరే అన్నారు. అమ్మ గయ్యి మంది "మన" కులం వాడు కాదు అని. నా మనసులో ఎన్నో ప్రశ్నలు. నాది ఎ కులం? అమ్మ దా? నాన్న దా? ఎవ్వరు నన్ను వాళ్ళల్లో ఒకదానిగా చూడలేదే. సమాజం కోసం, నాన్న ఇంటి పేరు నా పేరు పక్కన పెట్టుకున్నా, ఆ కట్టు బాట్లతో పెరగ లేదే? అమ్మ అసలు నాన్న భార్యగా సమాజంలో గుర్తిన్చబడలేదే? శశాంక్ ఇవేవి పట్టించుకోలేదు. నువ్వు నా జీవితం లో ఉంటె చాలన్నాడు. చాలా రోజులు ఆలోచించాను. ఇప్పుడు వద్దనుకుంటే జీవితంలో చాలా గొప్ప స్నేహాన్ని పోగొట్టు కుంటానని, నేను ఇంకొకరిని పెళ్లి చేసుకుని అతన్ని ఇష్టపడటం కంటే, నన్ను ప్రేమించే స్నేహితుణ్ణి పెళ్లి చేసుకుంటే జీవితంలో సుఖపడతానని అనిపించింది.



రోజు పది నిమిషాల్లో ఇంటికి చేరేదాన్ని అలాంటిది ఇవ్వాళ్ళ అరగంట పైనే పట్టింది. పిల్లలు ఆడుతున్నట్లున్నారు, కేకలు వినిపిస్తున్నాయి. శ్రీవారు కాఫీ తాగుతూ మెయిల్ చూస్తున్నారు. దగ్గరగా వెళ్లి తన వొళ్ళో తల పెట్టుకున్నాను ఎంత ఆపుకున్నా దుఖం ఆగట్లేదు. ఏడుస్తూనే ఈ రోజు జరిగిన పరిచయం గురించి చెప్పాను. "ఎం చేద్దామనుకున్తున్నావ్?" సూటిగానే అడిగారాయన. "నా లాగ ఇంకో ఆడపిల్ల కుటుంబం ప్రేమ కోసం పరితపించ కూడదు. నా కుటుంబం గురించి నాకు తెలిసిన విషయాలన్నీ జేన్నిఫెర్ కి చెప్తాను. మేనత్త స్నేహాన్ని ఆ చిన్నారికి చూపిస్తాను" అని స్థిరంగా చెప్పాను. శశాంక్ చిరునవ్వులో మెచ్చుకోలు. వంట చెయ్యటానికి ఉపక్రమిస్తూ అమ్మకి ఫోన్ కలిపాను, రేపటి లంచ్ కోసం గుత్తి వంకాయ కూర రెసిపి అడగటానికి.

4 comments:

  1. నాకు చాలా ఇష్టమైన సబ్జెక్ట్ అండీ ఇది.. మణిరత్నం 'ఘర్షణ' సినిమా కూడా ఈ కారణానికి చాలా ఇష్టం..
    తొలి ప్రయత్నమే అయినా కథ బాగా రాశారు.. జెన్నిఫర్ తన తల్లిద్వారా తెలుసుకుని కేవలం శ్రీరమ కోసమే ఈమె పనిచేసే కాలేజీలో చేరిందంటే, విషయాలన్నీ ఆమెకి కొంతవరకూ తెలుసన్న మాటే. ఇక, అమెరికన్స్ కి సెంటిమెంట్స్ తక్కువ అన్న ప్రచారం తప్పేమో అనిపించేవిధంగా ఉంది, జెస్సికా పాత్రని మీరు మలిచిన తీరు.. ఏదన్నా జాల పత్రికకి పంపించి ఉండాల్సింది ఈ కథని.. అభినందనలండీ..

    ReplyDelete
  2. మంచి ప్రయత్నం.
    శైలి చదివించేదిగా ఉంది. అభినందనలు.
    కథనం, sequence of scenes మీద ఇంకొంచెం శ్రద్ధ పెట్టాలి. ఉదాహరణకి తొలి దృశ్యంలో డా. శ్రీరమ క్లాసు ముగించి ఇంటికెళ్ళేందుకు కారు దగ్గరికి వెళ్తూన్నది. నేన్సీ ఎప్పుడు క్లాస్ లిస్టు ఇచ్చినట్టు? జెన్నిఫర్ అదే క్లాసులో డా. శ్రీరమని పలకరించిందా? మరొక క్లాసులోనా?
    డా. శ్రీరమ తల్లిదండ్రుల మధ్య సంబంధాన్ని, తండ్రితో కృష్ణన్నయ్య విభేదాలని, జెస్సికా, జెన్నిఫర్ల పాత్రలని మరికొంత లోతుగా exploreచేస్తే కథ పుష్టిగా ఉంటుంది అని నాకనిపిస్తోంది.
    ఫ్లేష్‌బేక్ లో చెప్పిన భాగాన్ని చిన్న పేరాలుగా విభజించుకుంటే చదివేవారికి సులువుగా ఉంటుంది.
    మరిన్ని మంచి కథలు రాస్తారని కోరుకుంటూ మరోసారి అభినందనలు.

    ReplyDelete
  3. Really very happy to say that your post is very interesting. I never stop myself to say something about it. You did a great job. Keep it up.

    Latest News Updates

    ReplyDelete