Tuesday, November 10, 2009

రెండు suitcases, ఒక carry-on ..... బోలెడన్ని memories, మరెన్నో dreams (Part 4): రీసెర్చ్ ల్యాబ్ లో నా అనుభవాలు

మా advisor మొదటి రోజు ల్యాబ్ కి వెళ్ళినప్పుడు బోలెడు రీసెర్చ్ పేపర్లు, ఒక ల్యాబ్ నోట్ బుక్ ఇచ్చి "ల్యాబ్ తలుపు కి ఎడమ పక్కనున్న డెస్క్ నీది. ఇదిగో ల్యాబ్ తాళం" అని ఒక లాంటి shape లో ఉన్న, స్టీల్ మరియు ప్లాస్టిక్ తో చేసిన gadget ని చేతిలో పెట్టారు. చాలా రోజుల క్రితం "జడ పదార్ధం" అనే ఒక మాట విన్నాను. దాని అర్ధం నాకు తెలీదు కాని నా ల్యాబ్ తాళం చెవి చూడగానే ఆ మాట గుర్తొచ్చింది (ఎందుకో తెలీదు). తాళం ఇలా ఉందేంటి అనుకుంటూ ల్యాబ్ కి వెళ్తే, గ్రాడ్ స్టూడెంట్ ఒకడు "ఇది ప్రోగ్రామబుల్ కీ. దీనిని activate చేసి నీకిచ్చారు. నువ్వు graduate అయ్యాక దీన్ని deactivate చేస్తారు" అన్నాడు. సుబ్భరంగా ఒక తాళం చెవి ఇవ్వచ్చుగా? సరే లోపలికెళ్ళి డెస్క్ దగ్గర కూర్చున్నా. నా జీవితం లో రాబొయ్యే ఐదున్నర సంవత్సరాలు ఆ డెస్క్ దగ్గరే కాలం గడిపెస్తానని నాకప్పుడు తెలీదు.

నిజం చెప్పాలంటే, నాకసలు కంప్యూటర్ వాడటం అంత పెద్దగా తెలీదు (పెద్దగా ఏంటి? అస్సలు తెలీదు). డిపార్టుమెంటు సర్వర్, దాని పాస్ వర్డ్స్ లాంటి చిన్న చిన్న basics అన్నిటికి ఒక రోజు పట్టింది. దానికి తోడు మధ్యలో నా TA పని ఎలాగో ఉండేది. నేను ల్యాబ్ లో సమ్మర్ సెమెస్టర్ లో జాయిన్ అయ్యాను. అందుకని నేను తీసుకునే కోర్సు లేమి లేవు. దాంతో మా advisor చెలరేగి పొయ్యేవాడు. తరవాత నాకు అర్ధమయ్యిందేంటంటే, రీసెర్చ్ faculty ఎవ్వరు సమ్మర్ లో టీచింగ్ చెయ్యరు కాబట్టి, పొద్దస్తమానం ల్యాబ్ లోనే ఉండి, మన ప్రాణాలు తీస్తారు అని.

ఇక్కడ మీకందరికీ కొంచెం జ్ఞానోదయం చేస్తా వినుకోండి. హ్మహ్మ్ .... (గొంతు సవరించుకుంటున్న నేను)
advisorలు పలు రకములు.
ప్రతి రోజు మన ప్రాణాలు తింటూ, ప్రతి క్షణం మన జీవితాని stress భరితం చేసి మనల్ని నాలుగు లేక నాలుగున్నర సంవత్సరాలలో Ph.D తో బయటకి నెట్టే వాళ్ళు మొదటి రకం. వీళ్ళని భరించలేక చాలా మంది MS తో బయట పడటమో లేక advisor మార్చుకోవటమో, లేక వేరే కాలేజీ కి వెళ్లి పోవటమో చేస్తారు.
అప్పుడప్పుడు (అంటే రెండు నెలలకోసారి) మన జీవితం మీద మనకి విరక్తి కలిగేతట్టుగా, పోయిన సంవత్సరం data కి సంబంధించిన power point ని లేదా మనం బ్యాక్ అప్ తీసుకోవటం మర్చిపోయిన data ని అడిగి, సమ్మర్ funding కూడా ఇచ్చి, మనల్ని personal లెవెల్ లో చాల బ్రహ్మాండంగా ఆదరించి, సమ్మర్ లో ఒకరోజు మొత్తం వాళ్ళ ఇంట్లో ల్యాబ్ పార్టీ ఇచ్చి అయిదు లేదా అయిదున్నర సంవత్సరాల్లో మనల్ని పంపించే రకం రెండోది. మా advisor రెండో రకం. వీళ్ళకి ప్రతి రోజు ప్రొడక్టివిటీ కావాలి.
మా ల్యాబ్ లో ప్రతి వారం advisor తో individual meeting ఉండేది. దానికి తోడు నెలకోసారో, రెండు నేలలకోసారో గ్రూప్ మీటింగ్స్ ఉండేవి. ఆయన చాల intelligent. ల్యాబ్ లో ప్రతి instrument ఆయనకి కొట్టిన పిండి. ప్రతి రోజు మమ్మల్ని guide చేస్తూ హెల్ప్ చేసేవాడు.
మనం ల్యాబ్ కి ఎప్పుడు వస్తున్నాము అన్న విషయానికి కాకుండా, అసలు పని ఎంత జరుగుతోంది, ఎంత ప్రొడక్టివిటీ ఉంది అన్నది గమనిస్తూ మనల్ని guide చేసే రకం మూడోది. వీళ్ళు ideal advisors.
ఇంక నాలుగో రకం ఏంటంటే, మనల్ని అస్సలు పట్టించుకోకుండా, ఆరేళ్ల తరవాత "I am not happy with the progress of your project. Please leave with MS" అని ఖంగు తినిపించేవారు, లేదా thesis defending seminar లో స్టూడెంట్ ని ఫెయిల్ చేసేవారు నాలుగో రకం. వీళ్ళు మహా dangerous.


నేను నా మొదటి రీసెర్చ్ publication వ్రాసినప్పుడు చూడాలి నా పాట్లు. వ్రాసింది కొట్టేసి, దానినే వేరేలాగా వ్రాస్తే బాగులేదని చెప్పి మళ్లి పాత దానిలాగే వ్రాయించి అబ్బబ్బబ్బా .... మొతానికి పద్దెనిమిది వెర్షన్ లు అయ్యినతరవాత దానిని జర్నల్ కి పంపితే reviewer లు దానిని చీల్చి, చెండాడి మళ్లి మనకి తిప్పి పంపితే, వాళ్లకి కావాల్సిన experiments మనం మళ్లి చేసి, వాటికి explanation జత చేసి మనం పంపితే, అది వాళ్లకి నచ్చితే అప్పుడు మన పేరు మనం scientific journal లో చూసుకోవచ్చు.

Experiment లు అన్ని అంత సులభంగా , సునాయాసంగా జరిగిపోతాయా అంటే అదీ లేదు. మన ల్యాబ్ లో జనాలు ఎక్కువగా లేక పోతే పరవాలేదు. చాలా మంది ఉన్నారనుకోండి, ఇక ముందు రోజు నుంచి మొదలవుతాయి పాట్లు. Instrument రిజర్వు చేసుకోవాలి ముందు. "అమ్మాయివి కదా నీకే first preference ఇవ్వాలి" అని ఒక కుళ్ళు మోతు దేశి స్టూడెంట్ అంటే, "If you cannot get here by 10.00 tomorrow, can I get started on it?" అని మరో punctual గ్రాడ్ స్టూడెంట్ అంటాడు. ఎలాగో చచ్చి చెడి instrument మనదయ్యింది అనుకున్నాక, అందులో ఎ filter ప్రోబ్లేమో ఏదో తగలడుతుంది. ఇంక కంపెనీ వాడికి ఫోన్లు. వాడు చెప్పిన trouble shooting తో పనయ్యిందా సరి. లేదు, వాడిని పిలవటమో, లేదా instrument ని వాడి దగ్గరకి పంపించతమో చెయ్యాలి. అది ఫ్రీ గా అవ్వదు కదా. అందుకని మనం advisor దగ్గర lecture తినాలి "you need to remember to maintain the instrument properly" అని. అదంతా అయ్యాక అప్పుడు మన సోల్యుషనో, మరోటో అందులో పోస్తే అప్పుడోస్తుంది మనకి result. ఆ result మనకి, మన advisor కి నచ్చితే, మనం టట్ట టాడా, టట్ట టాడా అని డాన్స్ చేసుకుంటూ ఇంటికెళ్ళి వంట చేసుకుని, వేడి వేడి గా వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ తినొచ్చు. మనకి కాని, advisor కి కాని, లేదా ఇద్దరికి కాని నచ్చలేదనుకోండి మనం subway కి వెళ్లి, బాధగా ఓ సాండ్ విచ్ మెక్కి, లైబ్రరీ కి పొయ్యి అసలు మనం చేసిన తప్పేంటి, ఇల్లాంటి తప్పు ఇంతక ముందు ఎవరైనా చేసారా? దాన్ని ఎలా solve చెయ్యాలి అని లిటరేచర్ సెర్చ్ చెయ్యాలి.

ఇలా మూడు experimentలు , ఆరు resultలు అన్నట్టు మన జీవితం కొన్ని రోజులు గడిచాక, మన పేరు మీద ఒకటో రెండో publications వచ్చాక మన మీద Ph.D qualifiers అని ఒక అస్త్రం విసరబడుతుంది. దానిని ఎదుర్కోవటానికి సన్నాహంలో భాగంగా మనం ఒక యాభై పుస్తకాలు ముందేసుకుని చదువుకుని, డిసెంబర్ బ్రేక్ లో ఇండియా వెళ్లినప్పుడు , అమ్మతో "నాకు పరిక్షలమ్మా, నాకోసం దేవుడి కి దండం పెట్టు" అని చెప్పి, ఇండియా లో ఉన్నప్పుడు రోజు గుడికెళ్ళి, ఇక్కడికి రాగానే రోజు పూజ్చేసుకుని మొతానికి మనం qualifiers అయ్యాయనిపిస్తాం. ఈ లోపలే మన advisor కి ఒక గొప్ప రీసెర్చ్ ఇవిడియా వచ్చేస్తుంది. దాన్ని ఆయన గ్రాంట్ గా వ్రాయటం మొదలెట్టి మన ప్రాణం తోడేయ్యొచ్చు. అలా ఆయన తోడుతున్న సమయం లో దీపావళి పండగొస్తుంది. "ఇతని శక్తి హమే దేనా దాతా" ప్రాక్టీసు కోసమని సంజన, సుభద్ర, కీ బోర్డు ప్లేయర్ కార్తిక్ మనల్ని ఫోన్ చేసి ముప్ఫై సార్లు రమ్మంటారు. స్టేజి మీద పాట పాడేటప్పుడు పాట మీద కాకుండా, audience లో వాళ్ళు మన సల్వార్ కమీజ్ ని చూసి ఏమనుకుంటున్నారు అన్న దాని మీదే మనకి ధ్యాస ఉంటుంది.

లేదా, ఒక కొత్త instrument ని కొని మన మొహం మీద పారేసి "why don't you optimize it and write some protocols so every one in the lab can use them" అనొచ్చు. అప్పుడు కొన్ని రోజులు మన జీవితం ఆ instrument కి అంకితం.

లేదా, ఎ పెళ్ళిళ్ళ పెరమ్మో మరెవరో అమ్మకి మన కోసం పెళ్లి సంబంధం తెస్తారు. మనకి వాకే అనుకోండి మనం ఆ పోరగాడికి ఎమైల్స్ వ్రాయటం మొదలెడతాం. అక్కడ కొంచెం (కొంచెం ఎం ఖర్మ, ఎక్కువే) టైం వేస్ట్ అవుతుంది. మన కళ్ళు already ఇక్కడ ఒక అబ్బాయి మీదా (ఆ అబ్బాయి కళ్ళు మన మీద) ఉన్నాయనుకోండి, "ఇప్పుడే వద్దులే అమ్మా, Ph.D అయ్యాక చూద్దాం లే" అంటాం.

మధ్య మధ్య లో కాంఫెరెంసులకని DC, NY, Boston, LA, San Diego చేక్కేయ్యటాలు, దోస్తులతో లాస్ వేగాస్, అట్లాంటిక్ సిటీ, నయగారా, ఎల్లో స్టోన్ తిరగటాలు ఎలాగో ఉన్నాయి.

ఈ లోపల మన ల్యాబ్ కి ఒక కొత్త స్టూడెంట్ వస్తాడు లేదా వస్తుంది. మన advisor మనల్ని పిలిచి "please train the new student" అంటాడు. మనం ఏడుపు మొహాలమైతే "వీడిని నాకు అంట గట్టాడు కదరా దేవుడా" అని తిట్టుకుంటాం. అదే మనకి challenges ఇష్టమైతే వాళ్ళని ట్రైన్ చేసి "mentored graduate and undergraduate students in the research lab" అని resume లో వ్రాసుకుంటాం. teaching లో ఇంట్రెస్ట్ ఉంటె హై స్కూల్ పిల్లలు ల్యాబ్ కి వచ్చినప్పుడు వాళ్ళని mentor చేస్తాం, lab work లో ఇంట్రెస్ట్ ఉంటె సమ్మర్ internships కి వెళతాం.
తరవాత thesis వ్రాయటం, అందులో భాగం గా ఇంకో రెండు పేపర్లు అవగోట్టటం జరుగుతుంది. ఆ చివరి ఒకటి రెండు సెమెస్టర్ లలో ఫ్లోరిడా వాళ్ళకైతే hurricane లు, మాబోటి north-east గాళ్ళకి snow storm లు. ఇంట్లో కూర్చుని thesis వ్రాసుకోవటాలు. అద్రుష్టం ఉన్నవాళ్ళకి assistantshipలు, లేని వాళ్లకి చిన్న చిన్న అప్పులు. మధ్య మధ్య interviewలు. Thesis సెమినార్ కి ముందు ఉద్యోగం వచ్చేస్తే international students office కి వెళ్లి OPT అప్లికేషను గురించి అడగటం, వాళ్ళు మనల్ని పలురకాల ప్రశ్నలు వేసి, మనం మన సినియర్లకి ఫోన్లు చేసి, వివిధ వెబ్ సైట్లు, ఫోరం లు తెగ చదివేసి, నానా పాట్లు పడి మొతానికి అప్లై చేస్తాం. తరవాత thesis సెమినార్. అందులో పాసయ్యాక మన advisor ఇంట్లో డిన్నర్. తరవాత thesis లో corrections. అప్పుడింక అవసరం లేని టీవీలు, పరుపులు, టేబుళ్లు అందరికి పంచిపెట్టి, మన సామాను పెట్టేల్లోను, డబ్బాల్లోను సద్దుకుని మన తరవాతి destination కి చేరుకుంటాం. అక్కడ మొదటి రోజు మన ఆఫీసు బయట
"Dr. Kiranmayi" అని మన పేరున్న బోర్డు చూసాకా, మనం మళ్లి మే నెలలో graduation walk కోసం university కి వచ్చినప్పుడు మన స్నేహితుల్ని, advisor ని డిన్నర్ కి తీసుకి వెళ్ళినప్పుడు, graduation gown లో మన ఫోటో ని అమ్మ, నాన్న, తమ్ముడు చూసి సంతోషపడినప్పుడు, మన పిన్నులు అత్తయ్యలు మనల్ని చూపించి "అక్క చూడు, ఎంత మంచిగా చడువుకుందో" అని మన కజిన్స్ కి చెప్పినప్పుడు మనకి కలుగుతుంది ఆనందం. ఈ ఆనందం కోసం ఎన్ని గంటలయినా ల్యాబ్ లో ఉంటాం, ఎన్ని snow storms అయినా ఎదురుకుంటాం, ఎన్ని సెమినార్ లయినా ఇస్తాం.

ఇంతకముందు ఒక పోస్ట్ వ్రాసినప్పుడు భావన గారు కామెంటారు "రెండు సూటు కేసులు, బోలెడన్ని జ్ఞాపకాలతో వస్తాం.." అని. నిజమే. చాలా ఉత్సాహంగా వస్తాం. కొన్ని ఎదురు దెబ్బలు తింటాం, కొన్ని సంతోషాలని అనుభవిస్తాం.
నేను చాల conservative, మధ్యతరగతి కుటుంబంలో పెరిగాను. ఇక్కడికి రావటంతో నాకు చాలా విషయాలు తెలిసాయి. చాలా విషయాల గురించి నా దృక్పధం మారింది. ముఖ్యం గా grad program లో ఉన్నప్పుడు రకరకాల మనుషులని కలిసాను, చాలా cultures గురించి తెలుసుకున్నాను. ఈ అనుభవం నాకు ఎంతో ఉపయోగపడుతుంది. ఇంక నా సొంత డబ్బా ఆపేసి, వేరే విషయాల గురిచి వ్రాస్తా నెక్స్ట్ పోస్ట్ లో.
ఈసారి చాలా పెద్ద టపానే వ్రాసాను. చదవటానికి బోరు కొడితే ఒక కామెంట్ పెట్టండి. ఈ మాటు పెద్ద పోస్ట్ కాకుండా జాగర్త పడతాను. ధన్యవాదాలు.

Tuesday, November 3, 2009

రెండు suitcases, ఒక carry-on ..... బోలెడన్ని memories, మరెన్నో dreams (Part 3) - మొదటి సెమెస్టర్


నేను వచ్చిన మొదటి వారమే పెద్ద snow storm వచ్చింది. లోపల్నించి చూడటానికి బాగానే ఉంది కాని బయటకి వెళ్తే చలి చంపేసిది. పైగా సావిత్రేమో "insurance కి ఇంకా sign up చెయ్యలేదు కాబట్టి బయటకి నడిచి వెళ్లడానికి వీల్లేదు. ఐస్ మీద జారి పడ్డావంటే నడుము విరుగుతుంది + టాప్ లేచి పోతుంది (మెడికల్ బిల్)" అని బయటకి వెళ్ళనివ్వలేదు.
మా డిపార్టుమెంటు లో ప్రతి సోమవారం TA మీటింగ్ జరిగేది. TA supervisor (తాటకి) ఒకామె ఉండేది. ఆమె మా అందరికి బాస్. ఆమె వేరే దేశం నించి వచ్చి పాతికేళ్ళ క్రితం ఇక్కడ సెటిల్ అయ్యింది. ఎన్నేళ్ళైనా మాతృదేశం మీద అభిమానం పోదు కదా? అంచేత వాళ్ళ దేశం వాళ్ళు డిపార్టుమెంటు ని ఎలేద్దామని చూసేవారు. కొంతమంది ఆ పప్పులు ఉదకనివ్వకుండా ట్రై చేసేవారు. దానితో నిరంతరం సైలెంట్ వార్ జరిగేది.

సరే నా విషయానికొస్తే, మొదటి వారం మమ్మల్ని TSE exam వ్రాయాలన్నారు." అదేంటి? అప్లికేషనులో అవసరం లేదన్నారు కదా?" అనడిగితే, నన్ను ఒక వెర్రి దానిని చూసినట్టు చూసారు. తరవాత తెలిసింది మనం అమెరికన్ విద్యార్ధులకు అర్ధం అయ్యేటట్టు మాట్లాడగలగాలి, లేకపోతే వాళ్ళు మనల్ని హింస పెడతారు. అందుకనే ఈ పరీక్ష. సరే అది కూడా అయ్యాక నన్ను పిలిచి, నీకు రావలసిన దానికంటే 5 మార్కులు తక్కువోచ్చాయి, సో వెళ్లి accent modification క్లాసు అటెండ్ అవ్వు అని చెప్పింది మా తాటకి. నాకు ఒళ్ళు మంది పొయ్యింది. "చల్. నన్నే ఇంగ్లీష్ క్లాసు కి పంపిస్తుందా?" అని మా advisor దగ్గరికెళ్ళి "నేను Ph. D చెయ్యటానికి వచ్చాను. ఇంగ్లీష్ నేర్చుకోవటానికి కాదు. నేను ఆ క్లాసు కి వెళ్ళను" అని కొంచెం ఏడుపు మొహంతో, కొంచెం అమాయకపు మొహంతో చెప్పాను. రాళ్ళు కరగటం నాకు తెలీదు కాని ఆయన మాత్రం కరగలేదు. పైగా, "this will be a good experience for you" అన్నాడు. అప్పటికే నేను వచ్చిన మొదటి వారం లోనే అక్కడ దేశి కమ్యూనిటీ లో gossip అంతా నాకు తెలిసిపోయ్యిది. "మొన్నెవరో ప్రొఫెసర్ question అడిగితే ఒక దేశి అమ్మాయి లేచి నిలబడి ఆన్సర్ చెప్పిందంట", "ఒక దేశి అబ్బాయి car trunk ని డిక్కీ అన్నడంటా", ఇలా ఉండేవి ఆ గోస్సిప్స్ అన్ని. చెప్పుకుని, చెప్పుకుని అందరు తెగ నవ్వేవారు. ఇప్పుడు నా గురించి కూడా అందరు "ఆ అమ్మాయిని ఇంగ్లీష్ క్లాసు కి పంపించారట" అనుకుంటారేమో అని నా అసలు భయం.


సరే తరవాత రోజు నేను ఇంకో దేశి అబ్బాయి వెళ్ళాం కమ్యూనికేషన్ డిపార్టుమెంటు కి. దారిలో ఎంత తిట్టుకున్నానో, "మరీ ఇంగ్లీష్ రాని వాడితో నన్ను క్లాసు కి పంపిస్తున్నారు " అని. అక్కడ ఆ డిపార్టుమెంటు హెడ్ ఇంకొక టెస్ట్ పెట్టింది. చక్కగా పాస్ అయ్యాం. "మీరు క్లాసు కి రానఖర లేదు, రెండు syllables లో ప్రాబ్లం ఉంది కాబట్టి వచ్చేవారం క్లాసు అటెండ్ అయితే చాలు" అంది ఆవిడ. నేనయితే ఇంటి కొచ్చి టట్ట టాటా, టట్ట టాటా అని డాన్స్ చేశా.


అదే మొదటి సెమెస్టర్ కాబట్టి ల్యాబ్ పని ఉండదు. సోమవారం TA పని. ఆదివారం రాత్రి చాలా సేపు నిద్దర పట్టలే. అసలే reader's digest, అదీ చాల చదివానేమో, నేను ఈ అర్భకపు అమెరికన్ పిల్లలినందరిని ఉద్ధరించేస్తున్నట్టు నిద్ర పట్టగానే ఒకటే కలలు. పొద్దున్నే 7.30 కల్లా బయలుదేరా, 8.00 గంటల క్లాసు కోసం. అప్పుడు చూడండి అసలు మజా. కాలికింద ఐస్, ప్రతి రెండు నిమిషాలకి గాలిలో నేను. నా వీపుకి ఒక పెద్ద బాగ్ ప్యాక్. మూడు layers బట్టలు. ఎముకలు కోరికే చలి. ఇందుకేనా బాబు నేనిన్ని కలలు కన్నాను అని రోదించా. ఎట్లాగో అట్లా క్లాసు అయ్యిన్దనిపించా.


ఇక పోతే నేను తీసుకున్న క్లాస్స్లు. ఒకటేమో organic chem క్లాసు, ఇంకోతేమో electrochem. Organic నాకు తెలుసు కాబట్టి హేండిల్ చేసేసా. ఎలెక్ట్రో లో చూడాలి నా కష్టాలు. కాకపోతే అందులో రెండు take home లు, ఒక term-paper ఉండటం తో బ్రతికి పొయ్యా.

మా డిపార్టుమెంటు లో ఒక బెంగాలీ post doc ఉండేవాడు. ఒకరోజు కనిపించి పిచ్చాపాటి మాట్లాడిన తరవాత నాతో పాటే నడుస్తూ, "do you have assistantship?" అన్నాడు. నేను "yes" అన్నాను. అతను వెంటనే "fool" అన్నాడు. ఇక్కడ కష్టాలు తెలీక అసిస్టెంట్ షిప్ దొరకగానే ఎగురుకుంటూ వచ్చేసినందుకు అలా అన్నాడేమో అని ఓ రెండడుగులు వేసాను. "fool or half" అని అతను రెట్టించాడు. అప్పుడర్థమయ్యింది నాకు "నీకు full-assistantship ఉందా, లేక half-assistantship ఉందా" అని అడుగుతున్నాడని. తరవాత తెలిసింది ఆయన చాలా అమాయకుడు, ఎవ్వరేమి అడిగినా కాదనకుండా హెల్ప్ చేస్తాడని. ఇలాంటి మంచి వాళ్ళే కాదు, పరమ నీచులు కూడా కొంత మంది తారస పడ్డారు. వాళ్ళ గురించి ఇప్పుడు వద్దులెండి. Ph.D స్టూడెంట్ గా నా research lab అనుభవాలు వ్రాసి ఈ సిరీస్ ఇంతటితో ముగిస్తా.

Monday, November 2, 2009

రెండు suitcases, ఒక carry-on ..... బోలెడన్ని memories, మరెన్నో dreams (Part 2)- అమెరికా లో నా మొదటి వారం

మొదటి రోజు లేవగానే మా రూం మేట్ (పేరు కొంచెం సేపు సావిత్రి అనుకోండి) అంది "నేను lab కి వెళ్తాను, ఏది కావాలంటే అది తిను. ఇవాల్టికి కొంచెం సేపు రెస్ట్ తీసుకో. రేపు స్కూల్ కి తీసుకెల్తా" అని. స్కూలా? ఇదేంటి రా దేవుడా. తరవాత తెలిసింది ఇక్కడ university కి మరో పదం స్కూల్. ఆ రోజు పెద్ద చెప్పాల్సిన విషయాలేవీ జరగలేదు. రోజంతా పడుకుని, మధ్య, మధ్యన లేస్తూ, ఫ్రిజ్ లో కనపడే ప్రతి వస్తువు రుచి చూస్తూ గడిపేసా. సరే తరవాతి రోజు కృష్ణ అని మా డిపార్టుమెంటు అబ్బాయి, నేను, సావిత్రి బయలుదేరాం. అసలే జనవరి నెల. నార్త్ ఈస్ట్ లో చలి పిచ్చ, పిచ్చగా ఉంది. సావిత్రి ఇచ్చిన jacket వేసుకున్నా వెన్నులోంచి చలి పుట్టుకొస్తోంది. చిన్నప్పుడు నేర్చుకున్న "wood is a bad conductor of heat........." పాఠం గుర్తొచ్చి ఎప్పుడెప్పుడు బిల్డింగ్ లోపలి చేరతాం రా బాబు అనుకుంటూ డిపార్టుమెంటు కి చేరా. కృష్ణ నన్ను అందరికి పరిచయం చేస్తూ మధ్యలో ఎటో తప్పిపోయ్యాడు. సరే advisor రూం కి వెళ్దాం అని ఆయన రూపం గుర్తు తెచ్చికోవటానికి ట్రై చేశా. మన పదహారణాల తెలుగాయన నన్ను ఆదరించక పోతాడా అనుకున్నా. నా పప్పులేవి ఆయన దగ్గర ఉడకలా. వెళ్ళిన రెండు నిమిషాల్లోనే ప్రాజెక్ట్ ఎక్ష్ప్లైన్ చెయ్యడం మొదలెట్టాడు. నాకు కొంచెం అర్ధమవుతోంది (మరి కొంచెం అర్ధమవ్వట్లేదని మీకర్ధమయిపోయ్యుంటుంది కదా). సరే అదయ్యాక రోజు ఎన్ని గంటలకి రావాలి, వారానికి ఎంతసేపు పనిచెయ్యాలి, ఏడాదికి ఎన్ని పేపర్స్ publish చెయ్యాలి ....... పేపర్స్ publishing ఎంటబ్బా? అనుకున్నా. తరవాత తెలిసింది దాని సంగతి. మొత్తం గంట సేపు ఒక్క తెలుగు ముక్క మాట్లాదలేదాయన. అప్పుడు "అబ్బో, పొగరు" అనుకున్నా కాని తరవాత తెలిసింది (తెలుగు) faculty అందరు అలాగే ఉంటారని. మిగతా భాషల వాళ్ళ గురించి నాకు తేలేదు సుమా.


ఇక ఆ తరవాతి రోజు నేను, సావిత్రి A&P కి వెళ్ళాం. అదో కొత్త అనుభవం. కాని సావిత్రి కి వాళ్ళ fiance (ఇప్పుడు హస్బెండ్) కి నేను చాల థాంక్స్ చెప్పాలి. నేను అస్సలు బెంగ పడకుండా నన్ను చాలా మంచిగా చూసుకున్నారు. నాకు పరిచయమయిన ఇంకొక couple V and B. నన్ను పరిచయం చేసుకుని, నాకు కావాల్సిన వన్ని లిస్టు వ్రాయించి, ఎక్కడెక్కడ ఏమేమి అవసరమోస్తుందో చెప్పి, షాపింగ్ కి తీసుకు వెళ్లి, మొదటి వారం ప్రతి రోజు ఫోన్ చేసి నాతో మాట్లాడి, నాకు చాల హెల్ప్ చేసారు.


తరవాత రోజు TA orientation. ఓరి వీళ్ళ TA దొంగలెత్తుకెళ్ళ!!!! ఎంత సుత్తి కొట్టి చంపేసారనుకున్నారు. నేను కూడా teaching చేసాను కాని నన్ను ఇంత ఎవ్వరు భయపెట్టలేదు. "ప్రతీది document చెయ్యండి. స్టూడెంట్స్ తో అనవసరం గా మాట్లాడకండి, మీరు, స్టూడెంట్ ఒక రూం లో ఉన్నప్పుడు తలుపు దెగ్గర వెయ్యకండి....." ఇదే గోల. ప్రతీ దానికి పర్యవసానం "This might result in the cancellation of your assistantship" అని మాత్రం మర్చి పోకుండా చెప్పేవారు. తరవాతి రోజేమో placement tests. వీటి గురించి ముందే చెప్పారేమో నేను తెగ prepare అయ్యా. అక్కడికెళ్ళి చూస్తే ఏవిటో వింత వింతగా ఉన్నాయి ప్రశ్నలన్ని. మొతానికి అయ్యిందని పించా. సాయంత్రం వెళ్లి చూస్తే ఏముంది కొన్నింటిలో పాసయ్యాం, కొన్నింటిలో లేదు. మా దేశం లో మేం చదివామమ్మా అయినా ఎవ్వరు మమ్మల్ని ఇలా హింస పెట్టలేదు. సరే పాస్ అయ్యిన పేపర్స్ లో కోర్సు తీసుకోఖరలేదు. మిగతావాతిల్లో తీసుకోవాలి అన్నారు. సరే అని చెప్పి క్లాస్ కి రిజిస్టర్ చేసుకుని, ఆ వారానికి బయట పడ్డా. ఆ రోజు నేను సావిత్రి తో కలిసి మాల్ కి వెళ్ళా. నా ఫస్ట్ మాల్ ట్రిప్ బలే సరదాగా ఉండింది. మొదటివారం లో అమెరికాలో నేను తిన్న కొత్త పదార్ధాలు "swiss roll", "fresh pretzel", taco bell వారి bean burrito. నా మొదటి సెమెస్టర్ అనుభవాలు వచ్చే భాగం లో.